logo

సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి

పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు.

Updated : 24 Apr 2024 05:25 IST

నిధుల్ని మింగేసిన జగన్‌
బ్లీచింగ్‌కూ చిల్లిగవ్వ లేదు
నేడు జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం

పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. పల్లెల ఉసురు తీసేసి సర్పంచుల్ని ఉత్సవమూర్తులుగా మిగిల్చారు. జగన్‌ తన అయిదేళ్ల పాలనలో గ్రామ సీమల్ని ఇలా నీరుగార్చేశారు..

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం, కనిగిరి: అయిదేళ్ల జగన్‌ పాలనలో పల్లెల ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. నిధులు లేక..ఉన్నా సకాలంలో బిల్లులు రాక.. పాలకవర్గాలు కూడా చేతులెత్తేశాయి. దీంతో ప్రగతి పాలన మొత్తం కుంటుపడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1046 గ్రామ పంచాయతీలుండగా, జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు మిగిలాయి. పాలకుల నిర్వాకంతో ఇవన్నీ కుదేలయ్యాయి. వైకాపా పాలనలో చిన్నపాటి అభివృద్ధి పని కూడా చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని సమస్యలపై కథనం.
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల సంగతి అటుంచి..  కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను గత మూడేళ్లుగా విద్యుత్తు బిల్లుల బకాయిల పేరిట వెనక్కి తీసేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కనీసం బ్లీచింగ్‌ కొనాలన్నా ఇంటి పన్నుల మీదే ఆధార పడాల్సి వస్తోంది. ఇటీవల సాధారణ నిధులను సైతం విద్యుత్తు బకాయిల కింద జమ చేసుకోవడంతో పాలకవర్గాలు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.

కేంద్రం నిధులూ తీసేసుకుని..

టంగుటూరు గ్రామ పంచాయతీ కార్యాలయం

2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇంతవరకు గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదు, పైగా అందుబాటులో ఉన్న అరకొర సాధారణ నిధులతో  పనులెలా చేయాలని సర్పంచులు వాపోతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇచ్చినట్లే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా వెనక్కి మళ్లించికుంటోంది. దీంతో అక్కడ పాలన కుంటుపడింది. మైనర్‌ పంచాయతీల పరిస్థితి అయితే మరింత దుర్భరంగా ఉంది. ఆయా గ్రామాల్లో సాధారణ నిధుల రాబడి రూ.లక్షలోపే ఉండటంతో వీధిదీపాలు, పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణకే అవి సరిపోవడం లేదు.

రూ.20 కోట్ల బిల్లుల ఊసే లేదు

ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 51 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా ప్రజా పరిషత్‌ పాలకవర్గం యథావిధిగా కొనసాగడంతో వాటి నిర్వహణకు జడ్పీ నుంచే నిధులు కేటాయించాలి. అందుకు బిల్లుల చెల్లింపు నిమిత్తం సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేశారు. అయినా దీర్ఘకాలంగా రూ.20 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌ ఉన్నాయి.

సమస్యలు తీరే దారేదీ..?

అధ్వాన పారిశుద్ధ్యం..గుంతలు పడిన రహదారులు..అస్తవ్యస్త మురుగు కాలువలు...తాగునీటి వెతలు..వెలగని వీధి దీపాలు..ఇలా పల్లెల్లో సమస్యలు కోకొల్లలు. వాటన్నింటిని పరిష్కరిస్తాం..పల్లె అభివృద్ధిని పెట్టాలెక్కిస్తామని 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా సర్పంచులిచ్చిన హామీలు. కనీస సమాచారం లేకుండా 2021 నవంబర్‌లో 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 2022 సెప్టెంబర్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు రాగా, వాటితో విద్యుత్తు బిల్లుల బకాయిలు, క్లాప్‌మిత్రలకు జీతాలు చెల్లించారు.

రూ.17 లక్షల్ని ప్రభుత్వం లాగేసుకుంది

కనిగిరి : బ్లీచింగ్‌కు నగదు లేక  పారిశుద్ధ్యం ఇలా..

నేను సర్పంచ్‌గా ఎన్నికయ్యే నాటికి మా పంచాయతీలో రూ.17 లక్షల నగదు ఉంది. పనులు గుర్తించే లోపే ఆ నిధుల్ని ప్రభుత్వం లాగేసుకుంది. కనీసం బ్లీచింగ్‌ కూడా వేయించలేని పరిస్థితుల్లో ఉన్నాం. సొంత నిధులు వెచ్చించి పైప్‌ లైన్లు, మోటార్‌, ప్రభుత్వ భవనాలకు సంబంధించి రూ. 30 లక్షలు ముందుగా పెట్టుబడి పెట్టాం. ఇంతవరకు పైసా రాలేదు. వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. సమావేశాలకు పిలవడం లేదు. తెదేపా హయాంలో చక్కని వ్యవస్థ ఉండేది. నేడు అలంకారప్రాయంగా మిగిలాం.

ప్రగతికి చుక్కానిలాంటి పల్లెలు..నేడు సమస్యల ముళ్లతో విలవిల్లాడుతున్నాయి. గ్రామాభివృద్ధికి దిశా నిర్దేశం చేయడంలో పంచాయతీ పాలకవర్గం కీలకంగా వ్యవహరిస్తుంది. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గ్రామాల్లోని చిన్న సమస్యను సైతం పరిష్కరించలేక పోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న ధీమాతో కొందరు రూ. లక్షలు అప్పులుతెచ్చి మరీ చేయించారు. అయిదేళ్లలో తమకు నయాపైసా రాలేదని వారు ఆవేదన చెందుతున్నారు.

అమ్మో..ఈ వేసవి గట్టెక్కేదెలా..

నిధుల్లేక గ్రామ కార్యదర్శులు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. ఈ ఏడాది వేసవి గట్టెక్కేదెలా అని వారు ఆందోళన చెందుతున్నారు. సీజన్‌ దృష్ట్యా తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని పైపులైన్‌ మరమ్మతులు, పథకాల నిర్వహణకు నిధులు ఖర్చు చేశారు. కొన్ని పంచాయతీల్లో బోర్ల మరమ్మతులతోపాటు, చెరువులకు సాగర్‌ నీరు పెట్టేందుకు వ్యయమయ్యాయి. వాటికే నిధులు లేకపోవడంతో కొన్నిచోట్ల నెలల తరబడి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టలేకపోయారు. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి అన్న భావనలో సర్పంచులున్నారు. దీంతో కొత్తగా వీధి దీపాల కొనుగోలు, కాలువల్లో పూడికతీత పనులకు పెట్టుబడి పెట్టేందుకు స్థానిక సర్పంచులతోపాటు, అధికార పార్టీ నాయకులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

ఇలా ఇచ్చి.. అలా మళ్లించి..

పంచాయతీలకు నిధులు అందని ద్రాక్షగానే మిగిలాయి. వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన మొదట్లో చాలా గ్రామాలు ఆర్థికంగా బలోపేతమై ఉన్నాయి. ఆ నిధులతో మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, పైప్‌లైన్లు ఇతర పనులు చేయిద్దామనేలోపే నిధుల్ని ప్రభుత్వం తీసేసుకోవడంతో అవి నిలిచిపోయాయి. కనిగిరి, పామూరు, పీసీ పల్లి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, సీఎస్‌ పురం మండలాల్లో ఇలా వెనక్కు తీసుకోవడంతో అక్కడ ప్రగతి పనులు ముందుకు తీసుకెళ్లలేకపోయామని వారు వాపోతున్నారు.

ఆంక్షల కొరడా..

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెలలో సుమారు రూ.38 కోట్ల మేర నిధులు జమయ్యాయి. అందులోనూ 15 శాతం విద్యుత్తు బిల్లులకు చెల్లించాలంటూ పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో ఇప్పటికే రూ.4 కోట్లు చెల్లించారు. 2023-24 సంవత్సరం ముగిసినా దానికి సంబంధించి నిధులు జమ కాలేదు. దీంతో పల్లె ఖాతాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. వాటిపైనా ఆ తర్వాత ఖజానాలో ఆంక్షలు కొనసాగడంతో పాలక వర్గాలు ఏ పనీ చేయలేకపోతున్నాయి. కార్మికులకు జీతాలు తప్ప ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి పెద్ద మొత్తానికి బిల్లు పెడితే జమ కావడం లేదు. ఇప్పటికే ఎక్కువమంది సర్పంచులకు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి, దీంతో కొత్తగా ప్రతిపాదించిన అత్యవసర పనులపై సర్పంచులు నిరాసక్తత చూపుతున్నారు. లోటు బడ్జెట్‌ కారణంగా స్థానిక సంస్థల ఆర్థిక సంఘం నిధులు విడుదలపైనా నెలల తరబడి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏ పనికి బిల్లులు అప్‌లోడ్‌ చేసినా విడుదల కావడంలేదు.

వైకాపా సర్పంచుల్లో ఆవేదన

సచివాలయ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి పాలన మరింత గాడి తప్పిందని కొందరు  వైకాపా సర్పంచులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమావేశాలకు పిలవడం లేదని, పనుల గురించి ఎవరికి చెప్పాలో తెలియడం లేదన్నారు. తెదేపా హయాంలో పంచాయతీల పరిపుష్ఠికి ప్రణాళిక ప్రకారం నిధులు మంజూరయ్యేవని వారంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు