logo

ప్రలోభ పెట్టినా ‘చెవి’లో పువ్వే!.. సహకరించని సొంత పార్టీ నేతలు

ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్‌కు ముందు రోజు వరకు ఆ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. విశ్రాంత పోలీసు అధికారులు, పొరుగు జిల్లాల నుంచి రప్పించుకున్న వ్యక్తులతో సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒకరిని నియమించుకుని వారితో మంత్రాంగం నడిపారు.

Updated : 15 May 2024 08:46 IST

పార్లమెంట్‌ స్థానంలో క్రాస్‌ ఓటింగ్‌

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్‌కు ముందు రోజు వరకు ఆ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. విశ్రాంత పోలీసు అధికారులు, పొరుగు జిల్లాల నుంచి రప్పించుకున్న వ్యక్తులతో సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒకరిని నియమించుకుని వారితో మంత్రాంగం నడిపారు. అయినప్పటికీ ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న సదరు అభ్యర్థికి ఎన్నికల్లో సొంత పార్టీ శ్రేణులు, నేతలే సహకరించలేదని తెలుస్తోంది. ప్రధానంగా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు సాగింది. ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొదటి నుంచీ జోరు కొనసాగించారు. గత ఎన్నికల్లో ఆయన వైకాపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచీ ఆ కుటుంబం ఒంగోలును అంటిపెట్టుకునే ఉంది. సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ కూడా రెండు ఎన్నికల్లో పోటీ చేయగా, తర్వాత శ్రీనివాసరెడ్డి బరిలో నిలుస్తూ వస్తున్నారు. జిల్లాలో తనకంటూ సొంత వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వైకాపాలో తనకు ఎదురవుతున్న అవమానాలు భరించలేక.. ఆత్మాభిమాన్ని చంపుకోలేక ఆ పార్టీని వీడి తెదేపాలో చేరారు. దీంతో ఒంగోలులో అత్యధికులు, కనిగిరి, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో వైకాపా నుంచి పలువురు ఆయన వెంటే పార్టీ మారారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్థానికేతరుడు కావడం.. ఇప్పటివరకు జిల్లాతో ఎలాంటి అనుబంధం లేకపోదు. అయినప్పటికీ సొంత ప్రైవేట్‌ సైన్యంతో ఓటర్లను ప్రలోభాల్లో ముంచి రాజకీయం చేయాలని వ్యూహరచన చేశారు. ఇది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రుచించలేదు. ఆయన్ను నమ్ముకుంటే తమ ఓట్లకూ గండి పడుతుందని భావించారు. దీంతో ఒక ఓటు ఎంపీ మాగుంటకు.. మరొకటి మాకు వేయాలంటూ పరోక్షంగా ప్రచారం చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ క్రాస్‌ ఓటింగ్‌కు దారి తీయనున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని