logo

రాజకీయ తెరపై తారల తళుకులు.. తమిళనాట పరిస్థితి ఇలా..

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కొత్త పార్టీ పుట్టుకురావడం ఆనవాయితీగా మారింది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మక్కళ్‌ నీది మయ్యం పార్టీని నటుడు కమల్‌హాసన్‌ ప్రారంభించగా ప్రస్తుతం తమిళగ వెట్రి కళగాన్ని నటుడు విజయ్‌ ఆరంభించారు.

Updated : 13 Apr 2024 07:52 IST

విజయ్‌

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కొత్త పార్టీ పుట్టుకురావడం ఆనవాయితీగా మారింది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మక్కళ్‌ నీది మయ్యం పార్టీని నటుడు కమల్‌హాసన్‌ ప్రారంభించగా ప్రస్తుతం తమిళగ వెట్రి కళగాన్ని నటుడు విజయ్‌ ఆరంభించారు. రాష్ట్ర చరిత్రలో సినీ, రాజకీయ రంగానికి విడదీయరాని సంబంధం ఉంది. పలువురు నటులు సొంత పార్టీలు పెట్టినా వారిలో కొందరు మాత్రమే రాణించారు.

చెన్నై, న్యూస్‌టుడే


ఎస్‌.ఎస్‌.రామచంద్రన్‌

ఎస్‌.ఎస్‌.రాజేంద్రన్‌: శాసనసభకు ఎన్నికైన తొలి భారతీయ చలనచిత్ర నటుడు. మొదట డీఎంకేలో ఉన్నా తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. ఎంజీఆర్‌ మరణానంతరం ఆ పార్టీ నుంచి వైదొలగి ఎం.జి.ఆర్‌.ఎస్‌.ఎస్‌.ఆర్‌ కళగం పేరిట సొంత పార్టీ ప్రారంభించారు. అన్నాడీఎంకే పగ్గాలు జయలలిత చేతికి వచ్చిన తర్వాత మళ్లీ ఆ పార్టీలో విలీనమయ్యారు. అక్కడా ఇమడలేక బయటకొచ్చి తిరునావుక్కరసర్‌తో కలిసి కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.


ఎంజీ రామచంద్రన్‌

ఎంజీ రామచంద్రన్‌: డీఎంకేలో కరుణానిధితో ఏర్పడిన విభేదాలతో ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. 1972లో అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (ఏడీఎంకే)ను ప్రారంభించి తర్వాత దానిని అనైత్తిందియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే)గా చేశారు. తొలి ఎన్నికల్లోనే విజయ దుందుభి మోగించిన ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంతో ఎంజీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కన్నుమూశాక పార్టీలో పలుమార్లు చీలికలు వచ్చినా ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా మనుగడ సాగిస్తోంది.


శరత్‌కుమార్‌

శరత్‌కుమార్‌: 1996లో డీఎంకేలో చేరి తిరునెల్వేలి ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ పదవులు అలంకరించారు. 2006లో డీఎంకే నుంచి వైదొలగి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు రాధికను అన్నాడీఎంకే నుంచి తొలగించడంతో ఆమె భర్త శరత్‌కుమార్‌ కూడా బయటికొచ్చారు. 2007లో సమత్తువ మక్కళ్‌ కట్చిని ప్రారంభించారు. 2011, 2016 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. జయలలిత కన్నుమూశాక అన్నాడీఎంకేలో నెలకొన్న గందరగోళ పరిస్థితులతో కూటమి నుంచి బయటకొచ్చేశారు. ఇటీవల పార్టీని భాజపాలో విలీనం చేయడం గమనార్హం.


విజయకాంత్‌: పార్టీ ప్రారంభించడానికి ముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకాంత్‌ అభిమాన సంఘం నిర్వాహకులు పోటీ చేసి కొన్ని స్థానాల్లోనూ గెలిచారు. 2005లో దేశియ ముర్పోక్కు ద్రావిడ కళగం(డీఎండీకే)ను విజయకాంత్‌ ప్రారంభించారు. ఆరేళ్లలోనే ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. 20, 30 ఏళ్లుగా రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్నా పలువురికి అందని ఆ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. జయలలితతో విజయకాంత్‌కు శత్రుత్వం, అనారోగ్య సమస్యలు తదితర కారణాలతో పార్టీ ప్రాభవం క్రమేణా తగ్గుముఖం పట్టింది. విజయకాంత్‌ మృతి తర్వాత ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడిపిస్తున్నారు.


కమల్‌హాసన్‌: 2018లో మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ప్రారంభించారు. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేసింది. పెద్దగా రాణించకున్నా అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్య గెలుపు అవకాశాలను ప్రభావితం చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతు ప్రకటించారు. వచ్చే ఏడాది రాజ్యసభకు బెర్తు ఖరారు చేసుకున్నారు.


శివాజీ గణేశన్‌

శివాజీ గణేశన్‌: కాంగ్రెస్‌లో సుమారు 30ఏళ్లు ఉన్నారు. ఎంజీఆర్‌ మృతి తర్వాత అన్నాడీఎంకేలో చీలికలు రాగా జానకీ రామచంద్రన్‌ వర్గానికి మద్దతివ్వాలని తన పార్టీ అధిష్ఠానానికి సూచించారు. జయలలితకు మద్దతు ఇవ్వడంతో పార్టీ నుంచి బయటకొచ్చారు. 1989లో తమిళగ మున్నేట్ర మున్నని పేరిట పార్టీ ప్రారంభించారు. జానకి వర్గంతో కూటమి ఏర్పాటు చేసి శాసనసభ ఎన్నికల బరిలోకి దిగారు. ఓటమి చెందారు. రెండేళ్లలో పార్టీని రద్దు చేసి జనతా పార్టీలో చేరారు. కొన్నాళ్ల తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు.


భాగ్యరాజ్‌

భాగ్యరాజ్‌: మొదటి నుంచి ఎంజీఆర్‌ వీరాభిమాని. ఎంజీఆర్‌ చనిపోయాక అన్నాడీఎంకే నుంచి వైదొలగారు. 1989లో ఎంజీఆర్‌ మక్కళ్‌ మున్నేట్ర కళగం పేరిట పార్టీ మొదలుపెట్టారు. ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో రెండేళ్లలో పార్టీని రద్దు చేసి డీఎంకేలో చేరారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అన్నాడీఎంకే వైపు మొగ్గారు. తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుని మళ్లీ కెమెరా ముందుకెళ్లారు.


టి.రాజేందర్‌

టి.రాజేందర్‌: డీఎంకేలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రచారకర్త స్థాయికి ఎదిగారు. పార్టీలోని కొందరు నేతలతో ఏర్పడిన విభేదాలతో డీఎంకే నుంచి 1991లో తప్పుకున్నారు. తాయగ మరుమలర్చి కళగం పేరిట పార్టీ ప్రారంభించి ఆ ఏడాది ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఓటమి పాలవటంతో తర్వాత దానిని రద్దు చేసి డీఎంకే మద్దతివ్వడం మొదలుపెట్టారు. మళ్లీ ఆ పార్టీ నుంచి తప్పుకొని 2004లో లక్ష్య ద్రావిడ మున్నేట్ర కళగం పేరిట పార్టీ ప్రారంభించారు. 2013లో రద్దు చేసి డీఎంకేలో చేరారు.


కార్తిక్‌

కార్తిక్‌: ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009లో నాడాళుం మక్కళ్‌ కట్చి ప్రారంభించారు. అప్పట్లో ఎన్డీయే కూటమిలో చేరి తేని, విరుదునగర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసినా గెలుపు వరించలేదు. 2018లో పార్టీని రద్దు చేసి ‘మనిద ఉరిమై కాక్కుం కట్చి’ పేరిట పార్టీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి మద్దతు ప్రకటించారు.


మన్సూర్‌ అలీఖాన్‌

మన్సూర్‌ అలీఖాన్‌: మొదట్లో పీఎంకేకు మద్దతుగా ఉన్నారు. తర్వాత పుదియ తమిళగం పార్టీలో చేరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ తరఫున పోటీ చేశారు. తమిళ్‌ దేశియ పులిగళ్‌ పేరిట పార్టీని నడిపించిన ఆయన 2021లో ఇండియా జననాయగ పులిగళ్‌గా పార్టీ పేరు మార్చారు. ప్రస్తుతం వేలూర్‌ నుంచి బరిలో ఉన్నారు.


కరుణాస్‌

కరుణాస్‌: 2016లో ముక్కులత్తోర్‌ పులిపడై పార్టీ ప్రారంభించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ప్రకటించారు.


సీమాన్‌

సీమాన్‌: మొదట్లో ద్రావిడర్‌ కళగంతో కలిసి పెరియార్‌ సిద్ధాంతాలు ప్రచారం చేశారు. తర్వాత నామ్‌ తమిళర్‌ ఉద్యమాన్ని ప్రారంభించి తర్వాత దానిని పార్టీగా ప్రకటించారు. 2011 శాసనసభ, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, అన్నాడీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. 2016, 2021 శాసనసభ, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం గమనార్హం. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు లేకున్నా రాష్ట్రంలో గుర్తించదగ్గ స్థాయిలో ఉంది.

అప్పట్లో సిద్ధాంతాల ప్రచారానికి.. స్వాతంత్య్ర ఉద్యమ సిద్ధాంతాలను ప్రజల చెంతకు చేర్చడానికి కళారంగాన్ని శక్తివంతమైన మాధ్యమంగా నాడు మలచుకున్నారు. మొదట్లో నాటకాల ద్వారా తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. మూకీ చిత్రాలు మాటలు నేర్చడంతో స్టేజీ కళాకారులు కాస్త చిత్రరంగంలోకి ప్రవేశించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో జైలుకెళ్లిన ఎంజీ నటరాజన్‌ పిళ్లై, కల్లు దుకాణం ఉద్యమంలో అరెస్టైన ఎస్వీ సుబ్బయ్య భాగవతర్‌, తిరునెల్వేలిలో అంటరానితనం నిర్మూలన ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన సుందరమూర్తి ఓదువార్‌ తదితరులు ప్రారంభకాల తమిళ చిత్రాల కథానాయకులు కావడం గమనార్హం. స్వాతంత్య్ర సంగ్రామంలో కాంగ్రెస్‌ ముమ్మరంగా పాల్గొనడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టినవారిలో ఆ పార్టీకి చెందినవారే ఎక్కువ. కాంగ్రెస్‌ తరఫున వేదిక ప్రచారాలను ఏళ్ల తరబడి నిర్వహించిన నాటక కళాకారుడు ఎం.వి.మణి, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పాటలు పాడి జైలుకెళ్లిన ఎస్‌.దేవుడు అయ్యర్‌, జాతీయవాద కార్యకలాపాలకు జైలుకెళ్లిన నాటక కళాకారిణి ఎం.ఆర్‌.కమలవేణి తదితరులూ తమ ఉద్యమ సిద్ధాంతాల ప్రచారం కోసం వెండితెరపైకి వచ్చారు. దక్షిణ భారతదేశ నాటి చిత్రపరిశ్రమ దిగ్గజం, కాంగ్రెస్‌ సానుభూతిపరుడైన జనరల్‌ పిక్చర్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎ.నారాయణన్‌ స్వాతంత్య్ర సంగ్రామానికి సినీ పరిశ్రమను విరివిగా వాడారు. నాటి కాంగ్రెస్‌ ఘటనలను న్యూస్‌ రీల్స్‌, డాక్యుమెంటరీలుగా రూపొందించి వాటిని విదేశాల్లోని సినీ కేంద్రాలకు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని