logo

సామాజికవర్గాల ఓట్లపై గురి

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో విస్తరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ఓటర్లు ఎప్పటికప్పుడు తీర్పులో వైవిధ్యాన్ని చూపుతూనే ఉన్నారు.

Published : 14 Apr 2024 04:02 IST

‘దక్షిణం’పై పట్టుకు అభ్యర్థుల వ్యూహాలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో విస్తరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ఓటర్లు ఎప్పటికప్పుడు తీర్పులో వైవిధ్యాన్ని చూపుతూనే ఉన్నారు. ఈ ప్రాంతం 1951లో విశాఖ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేది. కొన్నాళ్లకు విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళ్లింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ మత్స్యకారులు, ముస్లింలు, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, కాపులు, యాదవ, ఎస్సీ, రెల్లి తదితర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు  ఉన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గం ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత స్థాయిలో లేరు. అయినా సాధారణ ఎన్నికల్లో ప్రతి సామాజికవర్గ ఓట్లు కీలకమే. అందుకే పార్టీల అభ్యర్థుÄలు ఏ సామాజిక వర్గాన్ని తక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్కర్ని దరిచేర్చుకొనే ప్రయత్నంలో ఉన్నారు.

వ్యూహాత్మకంగా వంశీకృష్ణ బరిలోకి..

రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఇప్పుడు సామాజికవర్గ ఓట్లపై గురిపెట్టారు. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ముందుకెళుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు బ్రాహ్మణ, మత్స్యకార అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. వ్యూహాత్మకంగా కూటమి ఆయన్ను ఎన్నికల బరిలో నిలిపింది. ఆయన తన సామాజికవర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని కలుపుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. తెదేపా, భాజపా నేతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

వాసుపల్లికి పెరుగుతున్న వ్యతిరేకత

అధికార వైకాపా తరఫున మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఇక్కడ పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. ఒకసారి ఓడిపోయారు. ప్రస్తుతం వాసుపల్లికి తన సొంత సామాజికవర్గం నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవల మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేతలు వాసుపల్లికి టికెట్‌ ఇవ్వొద్దంటూ సమావేశాలు నిర్వహించారు. పార్టీ పరంగా పలువురు కార్పొరేటర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ వారిని కలుస్తూ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పోలింగ్‌కు నెల రోజులు గడువు ఉన్నందున ఈలోపు అన్ని వర్గాల ఆదరణ పొందితే విజయతీరాలకు చేరుకోవచ్చని కూటమి నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని