logo

ఉపాధి హామీ పనులపై వివాదం

గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 20 May 2024 03:54 IST

గోవాడ మాజీ సర్పంచితో కూలీల వాగ్వాదం

మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్, ఇరువర్గాల వారితో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు మోద గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. ఆదివారం పనులకు రావద్దని కూలీలకు చెప్పారు. దీంతో కూలీలంతా కొంతమంది నాయకులతో కలిసి మాజీ సర్పంచి ఇంటికి వెళ్లి నిలదీశారు. పనులు ఆపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పనుల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని, వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలంటూ ఫిర్యాదు చేశామని లక్ష్మణకుమార్‌తోపాటు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం రామఅప్పారావు, ఏడువాక నూకరాజు, కరణం శేఖర్, బండి గోపి చెప్పారు. దీంతో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. లక్ష్మణకుమార్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సూర్యనారాయణ, సిబ్బంది అక్కడకు చేరుకొని సర్దిచెప్పారు. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని, ఎటువంటి గొడవలకు దిగవద్దని కూలీలకు సూచించారు. గ్రామంలో ప్రస్తుతం పోలీసుల గస్తీ కొనసాగుతోంది. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గోవాడ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన కూలీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని