logo

పారితోషికం మరిచిపోయారా సారూ..!

ఎన్నికల విధుల్లో చాకిరి చేయించుకుని, పారితోషికంగా చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు.

Updated : 21 May 2024 09:12 IST

ఆశా కార్యకర్తల ఆవేదన

పోలింగ్‌ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తూ... (పాతచిత్రం)

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో చాకిరి చేయించుకుని, పారితోషికంగా చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. ఈనెల 13న జిల్లా వ్యాప్తంగా 1991 పోలింగ్‌ కేంద్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 925 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తుంటే వారిలో 850 మందిని ఎన్నికల విధులకు నియమించారు. పోలింగ్‌ కేంద్రాల ఆవరణలో వీరి సేవలను వినియోగించుకున్నారు. నడవలేని వృద్ధులను మూడుచక్రాల వాహనాల్లో పోలింగ్‌ కేంద్రం లోపలికి తీసుకెళ్లడం, ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకు రావడం వంటి పనులు చేశారు. వీటితో పాటు మండుటెండలో ఓటు వేసేందుకు వచ్చిన వారిలో అస్వస్థతకు గురైన వారికి సపర్యలు చేయడం, వైద్య సేవలు అందించడం చేశారు. ‘ఎండను సైతం భరించి సేవలందించామని, ప్రతి ఒక్కరూ 14 గంటల నుంచి 15గంటల సేపు కష్టపడ్డారని, అయితే ఇంత వరకు పారితోషికం ఇవ్వలేద’ని ఆశాలు వాపోయారు. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు అందజేశారని, తమ వరకు వచ్చేసరికి రిక్తహస్తం చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.10వేలతో జీవనం సాగిస్తున్న తమను అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని వాపోతున్నారు. ఈనెల 16న కలెక్టర్‌ మల్లికార్జునను కలిసి టీఏ, డీఎలు అందజేయాలని కోరామని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షురాలు పి.మణి తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించాలని కోరారు.

పోలింగ్‌ కేంద్రంలోకి వృద్ధుడిని వీల్‌ఛైర్‌పై తీసుకెళుతూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని