logo

ఫలితాలెలా ఉన్నా సంయమనం పాటించాలి

ఎన్నికల్లో ఫలితాల తరువాత నాయకులు గెలుపోటముల్లో భావోద్వేగాలను నియంత్రించుకుని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఎస్పీ మురళీకృష్ణ సూచించారు.

Updated : 25 May 2024 10:20 IST

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఫలితాల తరువాత నాయకులు గెలుపోటముల్లో భావోద్వేగాలను నియంత్రించుకుని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఎస్పీ మురళీకృష్ణ సూచించారు. అడ్డురోడ్డులో శుక్రవారం పాయకరావుపేట నియోజకవర్గ రాజకీయ నాయకులకు శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. రాజకీయ నాయకులు, ప్రజల సహకారంతో జిల్లాలో శాంతియుత వాతావరణంలో పోలింగ్‌ పూర్తిచేశామని తెలిపారు. లెక్కింపునకు కూడా సహకరించాలని కోరారు. ఫలితాల రోజు ర్యాలీలు, సంబరాలు, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉందన్నారు. నాయకులెవరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆదేశించారు. గ్రామాల్లో నాయకులే ఈమేరకు ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే ప్రతి ఎన్నికల్లో బైండోవర్‌ చేయడంతోపాటు ముందుగా వారినే స్టేషన్‌ తరలిస్తామన్నారు. ఇప్పటికే అనధికార వాహనాలు సీజ్‌ చేస్తున్నట్లు వివరించారు. లెక్కింపు రోజున అనుమతి పాసులు ఉన్నవారిని లోపలికి అనుమతి ఇస్తారని, మొబైల్‌ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. జిల్లా మొత్తం  బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ మోహన్, సీఐలు అప్పన్న, విజయ్‌కుమార్, ఎస్సై విభీషణరావు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.


రావికమతం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఎస్పీ మురళీకృష్ణ సూచించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడే జూన్‌ 4, ఆ తరవాత రెండు రోజుల వరకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు భావోద్వేగాలను నియంత్రించుకోవాలన్నారు. విద్వేషాలు, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఘర్షణలకు దిగకుండా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. చోడవరం నియోజకర్గంలోని నాలుగు మండలాలకు చెందిన వైకాపా, తెదేపా, జనసేన, భాజపా, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో గర్నికంలోని కల్యాణ మండపంలో శుక్రవారం సమావేశమయ్యారు. లెక్కింపు రోజున 144 సెక్షన్, 30 పోలీస్‌ చట్టం అమలులో ఉంటుందన్నారు. లెక్కింపు ముగిసిన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. డీఎస్పీ అప్పలరాజు, కొత్తకోట, చోడవరం సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాసరావు, ఎస్సైలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని