logo

కేజీహెచ్‌కు నకిలీ నియామకపత్రాల బెడద

కేజీహెచ్‌కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు

Published : 02 Dec 2023 04:22 IST

తాజాగా మరొకటి రాక

 వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ కొనసాగుతుండగానే శుక్రవారం తపాలాశాఖ ద్వారా మరో నకిలీ ఆర్డరు ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి కార్యాలయానికి చేరింది. ఈ పత్రాన్ని పరిశీలించిన ఆసుపత్రి మేనేజరు శర్మ నకిలీగా గుర్తించి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి పంపారు. పి.సుధామాధురి అనే మహిళను పొరుగుసేవల కింద కేజీహెచ్‌ ఎన్‌బీఎస్‌యూలో స్టాఫ్‌ నర్సుగా నియామకం చేసినట్లు ఆర్డరు కాపీలో ఉంది. కేజీహెచ్‌లో ఎన్‌ఎస్‌బీయూ విభాగమే లేదు. స్పెషల్‌ నియోనెటాల్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ) మాత్రమే ఉంది. పొరుగు సేవల కింద నియమితులయ్యే అభ్యర్థులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కేటాయిస్తే కేజీహెచ్‌ వైద్యాధికారులు పోస్టింగ్‌లు ఇస్తారు. ఇందుకు భిన్నంగా సుధామాధురి నియామక ఆర్డరు వచ్చింది. దీంతో కేజీహెచ్‌ అధికారులు అప్రమత్తమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ అధికారులను సంప్రదించారు. ఆర్డరు కాపీలో ఉన్న సంతకాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులవి కావని నిర్ధారించారు.

 ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులుగా నియమిస్తున్నారు. ఆయా నియామకాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేజీహెచ్‌ వైద్యాధికారుల సంతకాలను తారుమారు చేసి నకిలీ పత్రాలతో ఉద్యోగాల కోసం వస్తే, ఇప్పుడు జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం పేరుతో రావడం ఆరోగ్యశాఖలో కలకలం రేపుతోంది. కొంత మంది నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల్లో అభ్యర్థుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటువంటి వ్యవహారాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కేజీహెచ్‌ అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుశాఖ త్వరగా విచారణ జరిపి నకిలీ ఆర్డర్లు సృష్టిస్తున్న వారి గుట్టురట్టు చేయాల్సి ఉంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు దళారులను ఆశ్రయించి నష్టపోయినట్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని