logo

ఆగండి.. భోజనం ఉందండీ!!

వైకాపా కీలక నేతలుగా చెప్పుకునే విజయసాయిరెడ్డి ...వైవీ సుబ్బారెడ్డి హాజరవుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనూ ప్రజలను నిలబెట్టేందుకు భోజనాల ప్రస్తావన తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే.. జనం ఆ సభల్లో ఆగని దుస్థితిని నాయకులు కళ్లారా చూస్తున్నారు.

Published : 03 Apr 2024 03:28 IST

ప్రసంగాలు ఆలకించాలని ప్రజలకు విన్నపాలు
సభలు, ర్యాలీల్లో వైకాపా నేతల ప్రయాస

ఈనాడు-విశాఖపట్నం: వైకాపా కీలక నేతలుగా చెప్పుకునే విజయసాయిరెడ్డి ...వైవీ సుబ్బారెడ్డి హాజరవుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనూ ప్రజలను నిలబెట్టేందుకు భోజనాల ప్రస్తావన తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే.. జనం ఆ సభల్లో ఆగని దుస్థితిని నాయకులు కళ్లారా చూస్తున్నారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సభలో ‘ఎవరూ వెళ్లొద్దు.. భోజనాలున్నాయి’ అంటూ మైకులో మొత్తుకున్నారు. ఇటీవల పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో విజయసాయిరెడ్డి ప్రసంగించే ముందు జనాలు వెళ్లిపోకుండా భోజనాలున్నాయంటూ నిలబెట్టేందుకు ప్రయత్నించి  విమర్శలపాలైన వీడియో గుర్తొచ్చినట్లుంది... ఇంకేముంది? ముత్తంశెట్టి ‘భోజనాలున్నాయంటూ ప్రత్యేకంగా మైకులో చెప్పొద్దు’ అంటూ హెచ్చరించడం మరోసారి వైరల్‌గా మారింది.

వైకాపా అభ్యర్థుల ఆపసోపాలు:  దక్షిణ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రచారంలో జనాలుండటం లేదు. దీంతో ఏయే వార్డుల్లో పర్యటన చేస్తారో..ఆ వార్డు అధ్యక్షులకు జనసేకరణ బాధ్యత అప్పగించారు. ప్రచారం వెంట నడిచినందుకు రూ.250 చొప్పున ఇస్తున్నారు. ఆఖరికి ఎండలో జనాలు దొరక్క ప్రచారాల్లో చిన్నారులను వెంటపెట్టుకుని నడవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • తూర్పులో ఎక్కడ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ సమావేశం పెట్టినా ముందురోజే ఆ ప్రాంతంలోని స్థానికులకు ‘మేం సిద్ధం-మా బూత్‌లు సిద్ధం’ పేరుతో టోకెన్లు ఇస్తున్నారు. భోజనాలు అయ్యాక, టోకెన్లు తిరిగి ఇస్తే రూ.వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.  ఇటీవల పెదజాలారిపేటలో భోజనాలు ఏర్పాటు చేస్తే జనం రాకపోవడంతో మిగిలిన ఆహారాన్ని సముద్రంలో పారేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
  • ‘మహిళలందరికి విజ్ఞప్తి...మీటింగ్‌కు సమయం అవుతుంది. త్వరగా రండి’ అంటూ డ్వాక్రా గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి భీమిలి వైకాపా అభ్యర్థి ప్రచారాలకు జనసేకరణ చేసేందుకు వెలుగు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
  • విశాఖ పశ్చిమంలో వైకాపా అభ్యర్థి ఆర్పీలకు డబ్బులిచ్చి, ప్రచారానికి మహిళలను తీసుకొచ్చే బాధ్యత అప్పగిస్తున్నారు. అయితే ఒత్తిడితో వస్తున్నారే కానీ, వెంటనే వెనుదిరుగుతున్నారు. మరో రెండు రోజుల్లో భారీ ప్రచారాలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పాల్గొనే వారికి బిర్యానీ, డబ్బులు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మంగళవారం 40 వార్డులో వాలంటీరు మాలతి వైకాపా నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే...బుధవారం రాజీనామా చేస్తానని చెబుతున్నట్లు సమాచారం. 58 వార్డులో రామ్‌నగర్‌లో పలువురు మంగళవారం రాత్రి ప్రచారం చేస్తూ..85 ఏళ్లు దాటిన వృద్ధుల వివరాలు, ప్రతి ఇంటిలో ఓటర్ల వివ రాలు  ప్రత్యే కంగా రాసుకోవడం గమనార్హం.అలాగే ఇళ్ల గోడలపై స్టిక్కర్లు అతికించారు.
  • అక్కిరెడ్డిపాలెం, వడ్లపూడి, కూర్మన్నపాలెంలో మూడు రోజులుగా గాజువాక వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రచారం మొదలు పెట్టారు. సిటింగ్‌ ఎమ్మెల్యే తిప్పల, అలాగే  చందు వర్గాలు అమర్‌నాథ్‌కు టికెటు కేటాయించడం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో అమర్‌నాథ్‌ అనకాపల్లి నుంచి అనుచరగణంతోపాటు, కార్యకర్తలను తీసుకువచ్చి భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. వర్గపోరుతో స్థానికంగా జనాలు రాకపోయినా, ప్రచారం నిండుగా కనబడటానికి కొత్త ఎత్తుగడగా భావిస్తున్నారు.

అనుమతుల్లేకున్నా కళ్లప్పగించి చూస్తూ: చాలా చోట్ల వైకాపా బహిరంగ సభలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతులు ఉండటం లేదు. భీమిలి పరిధిలో సోమవారం జరిగిన సభకు అనుమతుల్లేవని సమాచారం. అయితే అధికారులు గట్టిగా ప్రశ్నించాలన్నా జంకాల్సిన పరిస్థితి. ఎక్కడ రౌడీ మూకలు దాడులకు తెగబడుతారో అని కళ్లప్పగించి చూశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నియమావళి ఉన్నప్పటికీ దర్జాగా డబ్బులు, కానుకలు వైకాపా అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వీటిపై ఎన్నికల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని