logo

చూశాం పోలిక ఇక చాలు పాలకా!

వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది.

Published : 18 Apr 2024 05:18 IST

విద్యావ్యవస్థను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
‘నాడు-నేడు’పనులే తార్కాణం
భారీగా కడుతున్నామంటూ జగన్‌ సర్కార్‌ గొప్పలు
నిధులు లేక ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలే
ఈనాడు, విశాఖపట్నం

పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేనమామగా అనేక విద్యా కార్యక్రమాలు అమలు చేస్తున్నా. ‘నాడు-నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నాం.

- 2021లో నాడు-నేడు రెండో విడత పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సీఎం జగన్‌

వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. పనులు పూర్తి కాకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయంటూ ప్రచారం చేస్తున్నారు. మూడు విడతల్లో పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ, రెండో విడత పనులు సైతం చాలా చోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే.. తామే అంతా చేస్తున్నామంటూ వైకాపా నాయకులు హడావుడి చేస్తున్నారు. నాలుగేళ్లుగా పనులు జరుగుతుండటంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులు పనిదినాల్లో చేపట్టడంతో చదువులపై దృష్టి  పెట్టలేకపోయారు.


పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే అని చెప్పిన సీఎం.. వైకాపా పాలనలో విద్యార్థుల బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నా పట్టించుకోలేదు.


రూ.కోట్లతో పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుస్తామంటూ సీఎం ఊదరగొట్టారు. చివరికి పిల్లలు కూర్చునేందుకు కనీసం భవనాలు లేకుండా చేసిన ఘనత మూటగట్టుకున్నారు.భవనాలకు పార్టీ జెండాలను పోలిన రంగులు వేయించడంపై పెట్టిన శ్రద్ధ.. విద్యాశాఖపై పెట్టలేదు.


నిధుల కొరతతో..

‘నాడు-నేడు మన బడి’ పథకం పనులకు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. పలుచోట్ల పాత తరగతి గదులు కూల్చేసి వాటి స్థానంలో అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. పాత భవనాలను నేలకూల్చి.. వాటిలోని సామగ్రిని మరో గదిలో భద్రపరిచారు. అదనంగా మూడు గదుల నిర్మాణానికి పనులు ప్రారంభించినా.. నిధుల కొరతతో మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రతి పాఠశాలలో తొలి విడత నిధులతో అదనపు గదుల నిర్మాణాలు ప్రారంభించారు. ఆ తర్వాత నిధుల్లేక పోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. సరిపడా తరగతి గదులు లేకపోవడం, కొత్త భవనాలు పూర్తికాకపోవడంతో చాలా చోట్ల విద్యార్థులు ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో ఒకే గదిలో రెండు, మూడు తరగతులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల అదనపు గదుల నిర్మాణం పునాది దశ దాటడం లేదు.


పునాదుల దశలోనే అధికం..

తొలి దశలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని 165 పాఠశాలల్లో 9 రకాల పనులకు రూ.52.38 కోట్లు కేటాయించారు. రెండో దశలో విశాఖ జిల్లాలోని 314 పాఠశాలల్లో అదనపు తరగతులతోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు రూ.133.41 కోట్లు కేటాయించారు. తర్వాత మళ్లీ కొన్ని పాఠశాలల్లో అదనపు గదులు అవసరం లేదని తేల్చారు. అప్పటికే ఆయా చోట్ల పనులు ప్రారంభించేశారు. వాటి గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రెండో దశలో 309 పాఠశాలల్లో రూ.114.81 కోట్లతో ప్రహరీ, అదనపు తరగతి గదులు నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్లు మాత్రమే విడుదల చేశారు. చాలా చోట్ల భవనాలు పునాదుల దశలోనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని