logo

నోట్ల కట్టలను పాతి పెట్టి.. పోలీసులను కంగారెత్తించిన వృద్ధురాలు!

కష్టపడి సంపాదించిన సొమ్ము దాచుకుందామనుకున్నారు ఆ వృద్ధురాలు .. ఎవరి కంటపడకుండా భద్రపరచాలని ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి భూమిలో పాతిపెట్టారు.. ఊరెళ్లి వచ్చాక కనిపించకపోయేసరికి కంగారుపడి పోలీసులను ఆశ్రయించారు. వారొచ్చి ఆ సొమ్ము ఆమెకు అప్పచెప్పి వెళ్లిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో సోమవారం వెలుగుజూసింది.

Updated : 24 Jan 2024 07:18 IST

పాతిపెట్టిన నగదు సీసాను బయటకు తీసిన పోలీసులు

బయ్యారం, న్యూస్‌టుడే: కష్టపడి సంపాదించిన సొమ్ము దాచుకుందామనుకున్నారు ఆ వృద్ధురాలు .. ఎవరి కంటపడకుండా భద్రపరచాలని ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి భూమిలో పాతిపెట్టారు.. ఊరెళ్లి వచ్చాక కనిపించకపోయేసరికి కంగారుపడి పోలీసులను ఆశ్రయించారు. వారొచ్చి ఆ సొమ్ము ఆమెకు అప్పచెప్పి వెళ్లిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో సోమవారం వెలుగుజూసింది. తండాలోని ఓ పూరిగుడిసెలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు తమ్మిశెట్టి రంగమ్మ చిన్న కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా రూ. 2 లక్షల సొమ్ము జమ చేశారు.

సంక్రాంతి పండగ నేపథ్యంలో బంధువుల ఇంటికి వెళ్లాల్సి రావడంతో తన వద్ద ఉన్న సొమ్ము ఎక్కడ దాచిపెట్టాలో తెలియక నోట్లను పాలిథీన్‌ కవర్‌లో చుట్టి ప్లాస్టిక్‌ సీసాలో వేశారు. ఇంటి ఆవరణలో ఉన్న నిమ్మచెట్టు పక్కనే గొయ్యితీసి పాతిపెట్టారు. సోమవారం ఇంటికి తిరిగొచ్చిన ఆమె సొమ్ము దాచిన ప్రదేశానికి కొద్ది దూరంలో తవ్వి చూశారు. డబ్బు కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను ఆశ్రయించారు. వృద్ధురాలు, ఇంటి పరిస్థితిని చూసిన పోలీసులు, స్థానికులు తొలుత ఆమె చెప్పిన విషయాన్ని విశ్వసించలేదు.

తాను భూమిలో పాతిపెట్టిన సొమ్ము ఎవరో దొంగిలించారని వృద్ధురాలు పదేపదే చెప్పగా పోలీసులు ఇంటికి వెళ్లి ఆ స్థలంలో పరిశీలించారు. సొమ్ము కనిపించకపోవడంతో ఆమె చెప్పిన స్థలం నుంచి కొద్ది దూరం తవ్విచూశారు. ఓ ప్లాస్టిక్‌ సీసాలో రూ.2 లక్షలు కనిపించాయి. దీంతో స్థానికులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ నగదును ఎస్సై ఉపేందర్‌ వృద్ధురాలికి అప్పగించి సొమ్ము భద్రపరిచే విధానాలను వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని