logo

సుఖీభవ!

దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది.. అయినా మహిళలపై అనాగరిక, ఆటవిక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆమెను గృహ హింస, అక్రమ రవాణా, వరకట్న వేధింపులు తదితర ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.

Updated : 03 Feb 2023 06:35 IST

బాధిత మహిళలకు భరోసా

సఖి.. మహిళలకు అండగా ఉంటోంది. ఆపదలో రక్షణ కల్పిస్తోంది.. అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది.. న్యాయసలహాలు ఇప్పిస్తోంది.. సమస్యలు పరిష్కరిస్తోంది.. జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలను తొలగిస్తోంది..సుఖిభవ అని దీవిస్తోంది..

వరంగల్‌క్రైం, జులైవాడ, న్యూస్‌టుడే: దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది.. అయినా మహిళలపై అనాగరిక, ఆటవిక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆమెను గృహ హింస, అక్రమ రవాణా, వరకట్న వేధింపులు తదితర ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వివిధ రకాల హింసల నుంచి తక్షణమే రక్షణ కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థ సహకారంతో హనుమకొండలో సఖి కేంద్రాన్ని 2017 డిసెంబరులో ఏర్పాటు చేశారు. 24 గంటలు పని చేసే ఈ కేంద్రంలో 14 మంది మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా వేధింపులు, దాడులకు గురైతే ధైర్యంగా ఈ కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో పోలీసు, వైద్య సేవలతో పాటు న్యాయ సహాయం అందిస్తారు. భార్యాభర్తల విషయంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. 181 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే కేంద్రం నిర్వాహకులు స్పందించి బాధిత మహిళలకు సహాయం అందిస్తున్నారు.


పోలీసు ప్రాసిక్యూషన్‌ సర్వీసు

బాధిత మహిళలకు పోలీసు అధికారులు రక్షణ ఇవ్వడంతో పాటు వారికి కేసుకు అవసరమైన సలహాలు ఇస్తారు. సంబంధిత ఠాణాల్లో కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటారు. అవసరమైన సాక్షులను కోర్టులో ప్రవేశపెడతారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటూ కేసు పూర్తయ్యే వరకు సహకారం అందిస్తారు.


వైద్య సదుపాయం

సఖి కేంద్రం ఆవరణలోనే వైద్యం అందించేందుకు ప్రత్యేక గది ఉంటుంది. ఆపద నుంచి బయటపడి ఇక్కడికి వచ్చిన వారికి ప్రాథమికంగా వైద్యం చేస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్తారు.


కౌన్సెలింగ్‌

కౌన్సెలింగ్‌ ఇస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్‌ దామోదర్‌

బాధితుల్లో మానసిక ధైర్యం నింపి వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు. ఇందుకోసం అవసరమైన కౌన్సెలింగ్‌ ఇస్తారు. మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉండి పూర్తి సహాయం అందిస్తారు.


తక్షణ న్యాయం, సలహాలు

సఖి/వన్‌స్టాప్‌లో ఉచితంగా న్యాయసలహాలు ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా న్యాయనిపుణులు ఉంటారు. నిందితులకు శిక్ష పడేలా ప్రయత్నిస్తారు. అవసరమైన సాక్ష్యాల పరిశీలన, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని సత్వరం నాయ్యం అందేలా చూస్తారు. తక్షణ న్యాయం జరిగేలా విచారణ ఉంటుంది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుకు రాకుండానే బాధితులతో మాట్లాడిస్తారు. వారు చెప్పే అంశాలను కోర్టులో నమోదు చేస్తారు. దీని వల్ల త్వరితగతిన న్యాయం జరుగుతుంది.


పునరావాస కేంద్రం

సఖి పునరావాస కేంద్రం గా ఉపయోగపడుతోంది. ఇందులో ఉండే వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ రకలైన కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.

* వరంగల్‌ ములుగు రోడ్డుకు చెందిన యువతికి ఎల్‌బీనగర్‌కు చెందిన యువకుడితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ఆమె సఖి కేంద్రాన్ని సంప్రదించారు. నిర్వాహకులు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో ఇద్దరు ఒక్కటయ్యారు.
* హనుమకొండలోని ఉద్యోగి కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. బాధితురాలు సఖి కేంద్రానికి తన సమస్యను వివరించారు. అతన్ని పిలిచి వరకట్న వేధింపుల చట్టం గురించి వివరించారు. కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు.
* వరంగల్‌లోని ఓ ఉద్యోగి తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. భార్యను వేధిస్తున్నాడు. ఆమె సఖి కేంద్రాన్ని ఆశ్రయించగా, కౌన్సెలింగ్‌ ఇచ్చి భర్తలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.


అవగాహన కల్పిస్తున్నాం

- సబిత, జిల్లా సంక్షేమ అధికారి

సమాజంలో వివక్షకు గురైన మహిళలకు సఖి కేంద్రం ద్వారా చేయూత ఇస్తున్నాం. బాధితులకు ఐదు రోజుల పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తున్నాం. నేరుగా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 181 ద్వారా సమాచారం ఇస్తే సహాయం అందిస్తాం. సఖి కేంద్రం గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు