logo

తొలిసారి బరి.. ఎంపీ పీఠంపై గురి

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌ డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ను ఎంపిక చేయడంతో కొన్నాళ్ల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Published : 13 Apr 2024 03:39 IST

ఈనాడు, వరంగల్‌ న్యూస్‌టుడే, బాలసముద్రం

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌ డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ను ఎంపిక చేయడంతో కొన్నాళ్ల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తుండటం గమనార్హం.. వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు భారాసనే అభ్యర్థిగా కడియం శ్రీహరి తనయ కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో భారాసకు అభ్యరి ఎంపిక  కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తొలుత తాను భారాస నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ, పార్టీ అధిష్ఠానం టికెట్టు ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు రావడంతో అనూహ్యంగా భాజపాలోకి వెళ్లి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక భారాస నుంచి ఎవరిని పోటీలో నిలుపుతారనేది వారం, పది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ భారాసలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఆచితూచి, అన్ని కోణాల్లో ఆలోచించిన గులాబీ అధినేత కేసీఆర్‌ చివరకు వివాదరహితుడిగా పేరున్న జడ్పీ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ను పార్టీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. దీంతో వరంగల్‌ స్థానం నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లయింది.


ఇద్దరూ వైద్యులే...

వరంగల్‌ భారాస అభ్యర్థిగా ఖరారైన డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ ఆయుర్వేద వైద్యుడు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్‌ కడియం కావ్య సైతం వైద్యురాలే.. ఎంబీబీఎస్‌, ఎండీ పాథాలజీ పూర్తి చేసి కొన్నాళ్లు వర్ధన్నపేటలో అనంతరం హనుమకొండలోని ప్రతిమ రిలీఫ్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.  


నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

హనుమకొండ జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా 2019లో ఎన్నికైన డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ను అప్పటి భారాస వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అభినందిస్తున్న దృశ్యమిది.. ఇప్పుడు వీరిద్దరూ లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులు.. సుధీర్‌కుమార్‌ భారాస నుంచి పోటీ చేస్తుండగా, అరూరి భాజపా నుంచి బరిలో దిగారు. నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులయ్యారు. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌ కూడా ఉన్నారు.


జడ్పీ ఛైర్మన్‌కు అవకాశం

భారాస నుంచి బరిలో ఉన్న సుధీర్‌కుమార్‌ జన్మస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామం. ఆయుర్వేద వైద్యుడిగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో స్థిరపడి ఆసుపత్రి ఏర్పాటు చేసి సేవలందించారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, కాకతీయ డిగ్రీ ప్రభుత్వ కళాశాల హనుమకొండలో డిగ్రీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఏఎంఎస్‌ చదివారు. యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో ఎండీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1995-2000 వరకు భీమదేవరపల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా పని చేశారు. 2001-2006 వరకు కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు అనుచరుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి కేసుల పాలయ్యారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లారు. బైండోవర్‌ కేసులు ఎదుర్కొన్నారు. 2019లో జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో ఎల్కతుర్తి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు.


గెలుపు ఎవరిదో..!

వరంగల్‌ నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు లోక్‌సభ బరిలో దిగడం ఇదే మొదటిసారి.. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. తండ్రి శ్రీహరికి శాసనసభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తూ ఆయన్ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు లోక్‌సభకు పోటీచేసేందుకు కమలం నుంచి అవకాశం దక్కించుకున్నారు. భారాస అభ్యర్థి పోటీ చేయడం ఇదే ప్రథమం.. ఇలా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తొలిసారి బరిలో నిలుస్తూ ఎంపీ స్థానంపై గురి పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు