logo

హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..

ఇతర దేశాల నుంచీ.. కువైట్, ఖతార్, సౌదీ ఆరేబియా తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినవారు కూడా ఇక్కడి ఫలితాలపై పందేలకు సై అంటున్నారు.

Updated : 19 May 2024 07:35 IST

ఇతర దేశాల నుంచీ.. కువైట్, ఖతార్, సౌదీ ఆరేబియా తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినవారు కూడా ఇక్కడి ఫలితాలపై పందేలకు సై అంటున్నారు. ఇక్కడివారితో చరవాణిలో మాట్లాడుకుని పందేలు కాస్తున్నారు. ఆచంట, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు నియోజకవర్గాల్లో ఈ తరహా పందేలు అధికంగా ఉన్నాయి. నగదును కొందరి పర్యవేక్షణలో ఉంచుతున్నారు.

ఆకివీడు, భీమవరం పట్టణం, పెనుమంట్ర, న్యూస్‌టుడే: పోటీ ఏదైనా పందేలు అంటే తొలుత గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లానే. సంక్రాంతి కోడి పందేలు, క్రికెట్‌ బెట్టింగులు.. ఎన్నికల ఫలితాలు.. ఇలా ఎలాంటి జూదాలైనా మూలాలు  ఇక్కడే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. కొద్ది నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలపైనా ఇక్కడ పందేలు కాశారంటే ఉత్సుకత ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, నామపత్రాలు ఉపసంహరణ వరకు సాగిన పందేలు ఇప్పుడు అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీల వైపు మళ్లాయి. 

అంచనాలు తలకిందులై.. జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి పందేలు ప్రారంభమయ్యాయి. పోలింగ్‌ పూర్తయ్యాక కొందరి అంచనాలు తలకిందులు కావడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఓ నియోజకవర్గంలో రెబల్‌ అభ్యర్థి 40 వేలు ఓట్లు చీలుస్తారంటూ గతంలో జోరుగా పందేలు జరిగాయి. ఆయనకు పడే ఓట్లు 15 వేలకు మించవని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. చీలిక ఓట్లు 40 వేలు దాటతాయని పందేలు వేసినవారు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు ఎదురు పందెం వేద్దామన్నా ఎవరూ రావడంలేదు. రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోటీ ఉన్న చోట్ల గతంలో గెలుపు అవకాశాలపై దృష్టి సారించిన వారు ఇప్పుడు మెజార్టీలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమలో పార్టీల వారీగా వచ్చే సీట్లపై పందేలను ముగించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి అధిక స్థానాలు వస్తాయి.. సీఎం ఎవరు అవుతారనే అంశాలపైనా పందేలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు రౌండ్లు, మండలాల వారీగా మెజార్టీలపైనే ఎక్కువగా పందేలు వేస్తున్నారు.

అయిదింతలు ఇచ్చేలా.. డెల్టాలో ఓ కీలక నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి దాదాపు 40 వేల నుంచి 45 వేలు మెజార్టీ వస్తుందంటూ రూ.1కి రూ. 5 చొప్పున పందేలు కాస్తున్నారు. అధికారాన్ని తెదేపా కూటమి దక్కించుకుంటుందని హెచ్చు పందేలు జరిగాయి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, జనసేనాని పవన్‌కల్యాణ్‌లకు ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీలపై భీమవరంలో పందేలు జరగడం విశేషం. జిల్లాలో ఓ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి మెజార్టీపై పందేలు భారీగా కాస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో గెలుపుపై ఇదే తరహా పందేలు సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్తబ్ధత నెలకొనడంతో తొలుత ఉన్నంత జోరు ఇప్పుడు కనిపించడంలేదు. మహిళలు, కొన్ని సామాజిక వర్గాల ఓట్లన్నీ తమకే పడ్డాయని గతంలో డాబుగా చెప్పిన వారు సైతం ఇప్పుడు పందేల విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. అభ్యర్థులను ప్రకటించిన సమయంలో పందేలు కాసిన కొందరు ఇప్పుడు అంచనాలు తప్పడంతో బోనులో పడిన ఎలుకల్లా విలవిల్లాడుతున్నారు. 

పల్లెల్లోనూ పోటాపోటీగా.. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పందేలు జోరుగా సాగుతున్నాయి. ఆకివీడు మండలంలో కూలి పనులు చేసుకునే ఓ మహిళ ఓ పార్టీదే అధికారం అంటూ రూ. 2 లక్షలు పందేం కాయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే ప్రాంతంలో ఓ చిరు వ్యాపారి సైతం రూ.50 వేలు పందెం కాసినట్లు సమాచారం. ఉండి నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి మూడు సెంట్ల స్థలాన్ని పందెంలో పెట్టేందుకు సిద్ధపడగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నట్లు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని