logo

తియ్యని పండు.. చేదు నిజం

ఫల రాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మారుతోంది. గతంలో పండ్లను సహజ సిద్ధంగా పండించి మార్కెట్‌కు తరలించేవారు.

Updated : 27 May 2024 05:45 IST

మామిడిని కృత్రిమంగా మాగబెడుతున్న వ్యాపారులు
ఆరోగ్యంపై  తీవ్ర ప్రభావం

అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మామిడి పండ్లు

ఫల రాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మారుతోంది. గతంలో పండ్లను సహజ సిద్ధంగా పండించి మార్కెట్‌కు తరలించేవారు. ప్రస్తుతం కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారు. వీటి వినియోగంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 52 వేల ఎకరాల్లో, నూజివీడు డివిజన్‌లో 40 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు.

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే

తప్పని ముప్పు..

  • రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు బారినపడే ప్రమాదముంది. దీర్ఘకాలికంగా ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండం, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే అవకాశముంది.

  • కాల్షియం కార్బైడ్‌ ద్వారా వెలువడే ఎసిటిలిన్‌ వాయువు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి.
  • గర్భిణుల్లో హార్మోన్లు దారి తప్పుతాయి. సహజమైన పద్ధతిలో పండిన పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

దాడులు చేసిన దాఖలాలు లేవు..

ఆహార సురక్ష ప్రమాణాల చట్టం-2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగించకూడదు. కార్బైడ్‌ వాడిన పండ్లను తినడంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్ష రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిగోదావరి జిల్లాలో గత కొన్నేళ్లుగా దాడులు చేసిన దాఖలాలు లేవు. జరిమానా విధించే ధైర్యం లేదు. ఇక జైలు శిక్ష విధించడం సాధ్యమేనా? వ్యాపారుల వద్దకెళ్లి ఎలా మాగిస్తున్నారో కనీసం పరిశీలన చేసే సాహసం సైతం అధికారులు చేయడం లేదు.

పట్టింపులేని నిబంధనలు..

  • 2011 ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్‌ రసాయనాలను నిషేధించింది
  • సహజంగా పండించే ఇథిలిన్‌ను మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలిన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇంతకు మించి వినియోగిస్తే పండ్లు పై భాగం విషతుల్యమవుతుంది
  • కాయలను కొనుగోలు చేసిన వ్యాపారులు మేలిమి పండులా కనిపించేందుకు కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఆమోదించిన ఇథిలిన్‌తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్‌లో చౌకగా లభిస్తుండటంతో వీటిని వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు.

తినే ముందు ఉప్పు నీటిలో కడగాలి..

కృత్రిమంగా పండించిన పండ్లను తిన్నవారికి వాంతులు, విరోచనాలు, దాహం ఎక్కువ అవడం, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తాయి. కాల్షియం కార్బైడ్‌ కారణంగా ఆర్సీనిక్‌ పాయిజనింగ్‌ అయ్యే ప్రమాదం ఉంది. మామిడి పండ్లను తినే ముందు ఉప్పు నీటిలో ఉంచి కడగాలి. కృత్రిమంగా పండించిన పండ్లను సాధ్యమైనంత వరకు తినకపోవడం మంచిది 

డా.జె.జగన్మోహనరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, నూజివీడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని