logo

డ్రోన్‌ యంత్రం... అన్నదాతలకు ఉపయుక్తం

జిల్లాలో చాలా మంది రైతులు పదుల ఎకరాల్లో టమోట, వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తుంటారు.

Published : 03 Feb 2023 00:50 IST

పురుగు మందుల పిచికారీకి అనుకూలం
ఇంజినీరింగ్‌ విద్యార్థుల అద్భుత సృష్టి

విద్యార్థులు తయారు చేసిన అగ్రికల్చర్‌ డ్రోన్‌ స్ప్రేయర్‌

మదనపల్లె విద్య, మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : జిల్లాలో చాలా మంది రైతులు పదుల ఎకరాల్లో టమోట, వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఈ పంటలకు చీడపీడల నివారణకు పురుగు మందులు పిచికారి చేసేందుకు కూలీలు దొరక్క వేచి ఉండాల్సి వచ్చేది. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరకడం కష్టం అవుతోంది. ఒకవేళ ఎవరైనా కూలీకి వచ్చినా రోజుకు ఎకరం, రెండెకరాల్లో మాత్రమే మందులు పిచికారి చేస్తారు. దీని వల్ల పంట పెట్టిన రైతుకు ఎక్కువ ఖర్చు వస్తోంది. దీంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. సకాలంలో మందులు పిచికారీ చేయకపోవడం వల్ల పంట నష్టం కూడా పెరిగిపోతోంది. ఖర్చు పెరగడంతో పాటు పంట నష్టపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి రైతులకు ఖర్చును ఎలాగైనా తగ్గించాలన్న లక్ష్యంతో మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల రెండో సంవత్సరం మెకానికల్‌ విభాగం విద్యార్థులు కె.మహమ్మద్‌ అజంతుల్లా, పి.మహమ్మద్‌ వసీమ్‌, ఎస్‌.అప్రోజ్‌, ప్రతాప్‌కుమార్‌లు బృందంగా ఏర్పడి హెచ్‌వోడీ ముప్పా లక్ష్మణరావు, డ్రోన్‌ ఎక్స్‌ఫర్ట్‌ గోపి రాజా సాయంతో అగ్రికల్చర్‌ డ్రోన్‌ స్ప్రేయర్‌ను తయారు చేశారు.

రైతులకు ఎంతో ఉపయోగం

విద్యార్థులు తయారు చేసిన డ్రోన్‌ స్ప్రేయర్‌ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేసి వాటికి మందులు పిచికారీ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. దీనికి తోడు పురుగు మందులు పిచికారీ చేయాలంటే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పురుగు మందులు పిచికారీ చేసేందుకు ఈ డ్రోన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే అయిదు లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రోన్‌ కాబట్టి ఏ ప్రాంతానికైనా మందులు సరఫరా చేయాలన్నా చాలా ఉపయోగపడుతుంది.

బహుళ ప్రయోజనకారి

విపత్తులు సంభవించిన సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మందులు, తినుబండారాలు అందజేసేందుకు ఈ డ్రోన్‌ ఉపయోగపడుతుంది. దీన్ని విద్యార్థులు రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేశారు. పెద్ద పెద్ద భూ స్వాముల నుంచి చిన్న రైతులు ఈ యంత్రాన్ని వినియోగించుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు చిన్నరైతులు కలసి ఈ యంత్రాన్ని తీసుకుంటే నిముషాల వ్యవధిలో పంటలకు మందులు పిచికారీ చేయవచ్చు. అలాగే వేరే రైతులకు మందులు పిచికారీ కోసం బాడుగకు ఇచ్చుకోవచ్చునని విద్యార్థులు అంటున్నారు.

ఏవిధంగా తయారు చేశారంటే...

మిట్స్‌ కళాశాల విద్యార్థులు డ్రోన్‌ స్ప్రేయర్‌ తయారీ కోసం 3,300 కేవీ మోటార్లు 6, 24 వోల్టుల బ్యాటరీలు, 18 ఎంపీ విద్యుతు అనుసంధానం చేసి డ్రోన్‌ను తయారు చేశారు. ఈ డ్రోన్‌కు అయిదు లీటర్ల క్యాను అమర్చి దాని ద్వారా మందు పిచికారి అయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా 15 నుంచి 20 నిమిషాల్లో ఎకరం పొలంలో పురుగు మందులను పిచికారీ చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని