logo

కలుషిత ఆహారంతో కలకలం!

యోగి వేమన విశ్వవిద్యాలయంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. వారం రోజులుగా పరిస్థితి దారుణంగా ఉన్నా బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Published : 23 Feb 2024 02:42 IST

వారం నుంచి సమస్య ఉందంటున్న వైవీయూ విద్యార్థులు
పరిస్థితి చేయి దాటిపోవడంతోనే ఆసుపత్రులకు తరలింపు
- న్యూస్‌టుడే, వైవీయూ (కడప)

రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

యోగి వేమన విశ్వవిద్యాలయంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. వారం రోజులుగా పరిస్థితి దారుణంగా ఉన్నా బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ విద్యార్థులు తమ సమస్యలపై నిరసన గళం వినిపించేవారు. 2019, ఆగస్టులో మెస్‌ ఛార్జీలు పెంచారని, ఆహారంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారిపై నాటి వైవీయూ అధికారులు జులుం ప్రదర్శించారు. పోలీసులతో కుమ్మక్కై రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వంద మందిపై కేసులు పెట్టి బెదిరించారు. దీంతో తమ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందని విద్యార్థులు వెనక్కు తగ్గారు. అప్పటి నుంచి అదే పరిస్థితి కొనసాగుతోంది.

పలువురు విద్యార్థులకు అస్వస్థత.. : వారం రోజులుగా విశ్వవిద్యాలయంలో కలుషిత ఆహారం సమస్య ఉన్నా బయటకు చెబితే తమపై ఏం చర్యలు తీసుకుంటారో అని విద్యార్థులు మిన్నకుండిపోయారు. బాలుర వసతి గృహంలో ఐదుగురు విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ అయిందని, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారని సహచరులు చెబుతున్నారు. విద్యార్థినులు  వారం నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతూ ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. సమస్య తీవ్రత పెరగడంతో బుధవారం రాత్రి బాధితులు రిమ్స్‌కు వెళ్లారు. మరికొంతమంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారు. గురువారం తెల్లవారుజామున, 10 గంటల అనంతరం కూడా పదుల సంఖ్యలో రిమ్స్‌కు వచ్చారు. మరోవైపు గురువారం రాత్రి మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురై వర్సిటీ ఆరోగ్యకేంద్రానికి వచ్చారు. తాను తిన్న పెరుగన్నంలో పురుగు వచ్చిందని ఓ విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేసింది.

యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు

విద్యార్థుల ఆందోళన.. : కలుషిత ఆహారం ఘటన నేపథ్యంలో యోగి వేమన విశ్వవిద్యాలయం గురువారం నిరసనలతో అట్టుడికింది. విద్యార్థులందరూ రహదారిపై బైఠాయించారు. వసతి గృహంలోని అసౌకర్యాలపై  అధికారులకు తెలిసినా ఎటువంటి స్పందన లేదని,  సరిగా లేని ఆహారం వండిపెడుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పినా వారు వినలేదు. చివరికి వీసీ వచ్చి వారితో మాట్లాడి, సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


రెండు రోజులుగా అనారోగ్యం

రెండు రోజులుగా ఆరోగ్యం సరిగా లేదు. బుధవారం మధ్యాహ్నం పెరుగన్నం మాత్రమే తిన్నా. వైవీయూలోని ఆరోగ్యకేంద్రంలో చూపించుకున్నా. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో  రాత్రే రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చా.

కావ్య, విద్యార్థిని


బాగా ఇబ్బంది పడ్డాను

మూడు రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. తగ్గిపోతుందిలే అనుకున్నా. బుధవారం నుంచి సమస్య ఎక్కువ కావడంతో వైవీయూలో ఆరోగ్యం కేంద్రానికి వెళ్లా. అక్కడ చూపించుకున్నా తగ్గలేదు. దీంతో రిమ్స్‌కు వచ్చాం. ఇంకా నీరసంగానే ఉంది.

శిరీష, విద్యార్థిని


చాలామందికి అస్వస్థత

నాకు బుధవారం నుంచి ఆరోగ్యం బాగాలేదు. వాంతులు, విరేచనాలు ఎక్కువయ్యాయి. దీంతో రిమ్స్‌కు వచ్చా. ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. ఇప్పుడు కొంచెం బాగుంది. చాలామంది అస్వస్థతకు గురయ్యాం.

వసంత, విద్యార్థిని


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని