logo

పల్లెటూరి జీవనం.. జగమెరిగేలా!

ఒకప్పుడు సినిమా కథలు సింహభాగం పల్లెటూరు.. కుటుంబాలు.. అనుబంధాల చుట్టూనే తిరిగేవి. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక కథల జోరు పెరిగింది.

Published : 05 Mar 2023 05:08 IST

కౌటాల గ్రామీణం(సిర్పూరు), న్యూస్‌టుడే: ఒకప్పుడు సినిమా కథలు సింహభాగం పల్లెటూరు.. కుటుంబాలు.. అనుబంధాల చుట్టూనే తిరిగేవి. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక కథల జోరు పెరిగింది. మెట్రో జీవనశైలి, విదేశీ నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శన నిర్మాతలు. అప్పుడప్పుడు పల్లెటూరి కథలు వచ్చి వెళ్లేవి. తాజాగా ఈ పోకడల్లో మార్పు కనిపిస్తోంది. మట్టి మనుషుల కథలు వెండితెరపై సందడి చేస్తున్నాయి. ఇటీవల విడుదలై బలగం సినిమా ఈ కోవకే వస్తుంది. ఇప్పుడు ఆదివాసీ గిరిజన జిల్లా అయిన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని చింతలమానెపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన దిందా కేంద్రంగా ఓ చిత్రం ఇప్పుడు వెండితెరకు పరిచయం కానుంది. ఆ చిత్రమే ‘జగమెరిగిన సత్యం..’ ఇందులో దిందా గ్రామాన్నే ప్రధాన ఆయువుపట్టుగా తీసుకున్నట్లు దర్శకుడు తెలిపారు.

ఇక్కడి ప్రజల నేపథ్యం.. అమాయకత్వం.. వెనుకబడిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని కౌటాల, చింతలమానెపల్లి, మహారాష్ట్రలోని అహేరీ, ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఈ సినిమా సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా దర్శకుడు పాలె తిరుపతి సైతం పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయి గ్రామానికి చెందినవాడు కావడంతో ఈ ప్రాంతంలో జరిగిన యదార్థ ఘటనలు వెండితెర ద్వారా బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది.

గ్రామీణ నేపథ్యం.. కళ్లకు కట్టినట్లుగా...

కుమురం భీం ఆసిఫాబాద్‌లోని మహారాష్ట్ర సరిహద్దులో 1994లో గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు, ఇప్పటికీ ఆచరణలో ఉన్న కొన్ని కట్టుబాట్లు.. ఆచారాలను ప్రధానంగా తీసుకొని ఈ చిత్రం రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. దిందా గ్రామ సమీపంలోని వాగు, గూడెం ప్రాణహిత నది వంతెన, పెంచికల్‌పేట్‌ పెద్దవాగు, కౌటాల బస్టాండు, మహారాష్ట్రలోని అహేరిలో ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రేమ సన్నివేశాలు, సంస్కృతి, సంగీతం, భావోద్వేగాల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు పాలె తిరుపతి వివరించారు. ఈ చిత్రంలోని పలు సన్నివేశాల్లో నటించేందు(బ్యాక్‌గ్రౌండ్‌)కు దిందా గ్రామస్థులకు అవకాశం కల్పించారు. బతుకమ్మ పాటను గాయకురాలు మంగ్లీ పాడగా.. విరాటపర్వం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన బొబ్బిలి సురేష్‌ ఈ చిత్రానికి కూడా స్వరాలు అందించారు. హీరోగా రవితేజ మేనల్లుడు అవినాష్‌ వర్మ, హీరోయిన్‌గా ఆద్యారెడ్డిలను తొలిసారి పరిచయం కానున్నారు. తాను తీసిన మొదటి చిత్రం ఇదేనని ప్రేక్షకులు ఆశీర్వదించాలని దర్శకుడు తిరుపతి కోరుతున్నారు. మార్చి నెలాఖరులో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.


ఒడుదొడుకులను ఎదుర్కొని.. దర్శకుడిగా ఎదిగి

పాలె తిరుపతి స్వగ్రామం పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయి. గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన మంచిర్యాలలో డిగ్రీ చదివాడు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. చిన్నప్పుడు తన తండ్రి పాలె ఆశన్నతో కలిసి భజన కార్యక్రమాలకు వెళ్లేవాడు. తండ్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తనకు సినిమా రంగంపై ఆసక్తి పెరిగిందని చెబుతున్నాడు తిరుపతి. సినీరంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లిన ఆయనకు అందరిలాగే ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. అయినా పట్టువదలకుండా దర్శకత్వం విభాగంలో ఎనిమిదేళ్ల పాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన కొరియన్‌ శీర్షికన ‘అహేరి’ అనే లఘుచిత్రాన్ని రూపొందించాడు. ఈ లఘుచిత్రం విజయవంతం కావడంతో వెండితెర వైపు అవకాశం లభించింది. పూర్తి పల్లెటూరు నేపథ్యం కలిగిన ‘జగమెరిగిన సత్యం’ చిత్రంలో తన కలల ప్రయాణం ప్రారంభించారు. చిన్నతనంలో తన తండ్రి పాడిన ఓ పద్యాన్ని ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో చిత్రీకరించినట్లు చెబుతున్నారు తిరుపతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని