logo

అవకాశాలున్నా అభివృద్ధి లేదు

మచిలీపట్నం నియోజకవర్గ పరిధి అభివృద్ధి నిమిత్తం చేతికంది వచ్చిన కోట్లాది రూపాయల నిధులను సకాలంలో వినియోగించుకోలేక పోవడం విమర్శలకు తావిస్తోంది.

Published : 01 Apr 2023 04:46 IST

అక్కరకు రాని రూ.కోట్ల నిధులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: మచిలీపట్నం నియోజకవర్గ పరిధి అభివృద్ధి నిమిత్తం చేతికంది వచ్చిన కోట్లాది రూపాయల నిధులను సకాలంలో వినియోగించుకోలేక పోవడం విమర్శలకు తావిస్తోంది.
దేశం మొత్తం మీద జనాభా తక్కువగా ఉన్న ఏకైక నగరపాలక సంస్థగా మచిలీపట్నం ముద్ర వేసుకోవాల్సి వచ్చిందంటే అందుకు ఆశించిన అభివృద్ధి లేకపోవడమే కారణం. కాలానుగుణమైన ప్రగతిని అందిపుచ్చుకోకపోవడంతో సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న ప్రధాన సమస్యలకు నేటికీ శాశ్వత పరిష్కారం దక్కలేదు.


పట్టాలెక్కని  ప్రతిపాదనలు

సముద్ర తీర ప్రాంతం కావడంతో వ్యవసాయ పరమైన వృద్ధి లోపించడం, పారిశ్రామిక ఆనవాళ్లు లేకపోవడంతో స్వాతంత్య్రానికి పూర్వమే కాస్మోపాలిటన్‌ నగరంగా వెలుగొందిన మచిలీపట్నం పురపాలక స్థాయి నుంచి కార్పొరేషన్‌గా వర్గోన్నతి పొందేందుకు దశాబ్దాల కాలం పట్టినా ఇప్పటికీ అందుకు తగ్గ హంగులు కరవయ్యాయి.ఇతరత్రా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వచ్చిన అవకాశాలనూ సాకారం చేసుకోవడంలో వైఫల్యం చెందడం చర్చనీయాంశం అవుతోంది. నగరంలో స్టేడియం నిర్మాణం కోసం 1970, 1981 సంవత్సరాల్లో చేసిన ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. గత ప్రభుత్వ హయాంలో క్రీడా స్టేడియం నిర్మాణం కోసం భూమి సేకరించి క్రీడాప్రాధికార సంస్థకు అప్పగించారు. ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయించి భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌కుంబ్లే చేతుల మీదగా 2018 సంవత్సరంలో చేయించిన శంకుస్థాపన కార్యక్రమం చివరకు ఆరంభ శూరత్వానికే పరిమితమైంది. ఇటీవలే నగరానికి వచ్చిన శాప్‌ ఛైర్మన్‌ రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తే క్రీడాభివృద్ధి కోసం తగు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసినా స్థానికంగా ఎటువంటి కదలిక లేదు. జిల్లాకు ఓ విశ్వవిద్యాలయంలో భాగంగా మచిలీపట్నంలో ఏర్పాటైన కృష్ణా వర్సిటీకి సంవత్సరాలు దొర్లుతున్నా తగు హంగులు ఏర్పాటు కాకపోవడంతో విశ్వవిద్యాలయంలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు.


పాలకుల  నిర్లక్ష్యం

ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు డా. పట్టాభి సీతారామయ్య పేరుతో కమ్యూనిటీ భవనం, మ్యూజియం, లైబ్రరీ తదితరాల ఏర్పాటుకు గత ఏడాది యూనియన్‌ బ్యాంకు రూ.40 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. భవన నిర్మాణ కోసం రెండు ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించినా ఎటువంటి కదలిక లేదు. జిల్లా పరిషత్‌లో రెండు నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎంపీ ఆరు నెలలుగా భవన నిర్మాణానికి నెలల తరబడి అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని నిగ్గదీశారు. జనవరి నెలాఖరుకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌, అధికారుల సాక్షిగా నగర కమిషన్‌ ఇచ్చిన హామీ నీటిమూటే అయ్యింది. జామియా మసీదు అభివృద్ధి నిమిత్తం రూ.25 లక్షల ఎంపీ నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నాయి. పనులు ప్రారంభించే విషయంలో ఎవరూ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఆ నిధులు ఉంటాయో.. ఇతర పనులకు కేటాయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నా వాటిని దక్కించుని మంగినపూడి బీచ్‌, తదితర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చన్న ఆకాంక్ష చూపే వారే కరవయ్యారు.గత కాలపు వైఫల్యాలను పక్కన పెట్టినా తాజాగా వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకునే విషయంలో నగర పాలకవర్గం ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విషయం నగరవాసులకు అంతుబట్టడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని