logo

Vijayawada: విజయవాడ పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు 98 టేబుళ్లు

ఇబ్రహీంపట్నం (జూపూడి)లోని నోవా, నిమ్రా కళాశాలల్లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసి, సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

Updated : 30 May 2024 09:25 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ఇబ్రహీంపట్నం (జూపూడి)లోని నోవా, నిమ్రా కళాశాలల్లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసి, సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘ డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, పోలీసు శాఖాధికారులతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా బుధ]వారం సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టర్‌ పాల్గొని.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లకు ఒక్కొక్క దానికి 14 టేబుళ్ల చొప్పున 98 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 132 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అన్ని వసతులు సమకూర్చినట్లు వివరించారు. ఈవీఎంలు, పోస్టల్‌ బ్యాలట్‌ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి గందరగోళ పరిస్థితులకు తావులేకుండా బారికేడింగ్, పార్కింగ్‌ కల్పించినట్లు వివరించారు.

వేగవంతమైన అంతర్జాలం: ఓట్ల లెక్కింపులో రౌండ్ల వారీ ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. మీడియా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కంప్యూటర్లు, వేగవంతమైన అంతర్జాలం, ఎన్‌కోర్‌లో డేటా ఎంట్రీకి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీసీలో జేసీ పి.సంపత్‌ కుమార్, వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్, విజయవాడ, తిరువూరు, నందిగామ ఆర్డీవోలు బి.హెచ్‌.భవానీ శంకర్, కె.మాధవి, ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట, విజయవాడ పశ్చిమ ఆర్వోలు జి.వెంకటేశ్వర్లు, ఇ.కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని