logo

షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?

‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్‌లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు.

Updated : 18 May 2024 09:27 IST

మాజీ ఉపకులపతుల తీరుపై విమర్శలు

ఎస్కేయూ వీసీకి కేటాయించిన కారు 

ఎస్కేయూ, న్యూస్‌టుడే: ‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్‌లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. అధికారిక విధుల నిమిత్తం వర్సిటీ కార్లను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. సొంత అవసరాలకైతే వర్సిటీ నిబంధనల ప్రకారం కి.మీకి రూ.6 చొప్పున చెల్లించాలి. రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు సుమారు లక్ష కిలోమీటర్లకుపైగా సొంత అవసరాల కోసం కార్లను వాడుకున్నారు. ఆయన రూ.6.17లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. 

  • వీసీగా ఉన్న రాజగోపాల్‌ తన అవసరాల కోసం వర్సిటీ కారును వినియోగించుకున్నారు. ఆయన రూ.75,276 వర్సిటీకి చెల్లించాల్సి ఉంది.

ఉపకులపతులుగా పని చేసిన వారు వర్సిటీ వనరులను ఇష్టారాజ్యంగా వినియోగించుకున్నారు.  బంగ్లా, కారు సదుపాయం కల్పిస్తారు. విధుల నిమిత్తం ఆ కారులో ఎక్కడికైనా వెళ్లొచ్చు. సొంత అవసరాలకు వాడుకుంటే అద్దె చెల్లించాల్సిందే. గతంలో ఉపకులపతులుగా పని చేసిన వారు  అద్దె చెల్లించలేదు. కారులో ఎక్కడికి వెళ్లినా ఆ వివరాలను లాగ్‌బుక్‌లో నమోదు చేస్తారు. సొంత పనులకు వాడితే పర్సనల్‌ వర్కు అని నమోదు చేస్తారు. ఏపీ 02 బీజే 5157 నంబరు కారును ఎస్కేయూ వీసీకి కేటాయించారు. ఆ వాహనంలో 78 వేల కి.మీకు పైగా ఆయన తిరిగారు. దాంతోపాటు రెక్టార్‌కు కేటాయించిన ఏపీ 02 బీజే 9699 నంబరు కారు 20,669 కి.మీలు, రిజిస్ట్రార్‌కి కేటాయించిన ఏపీ02 ఏఏ 5566 నంబరు గల కారు 1838 కి.మీ ఆయన కుటుంబసభ్యులు తిరిగారు. మొత్తం 1.17 లక్షల కి.మీలు రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబసభ్యులు తిరిగారు.

స.హ.చట్టంతో వెలుగులోకి..

విద్యార్థి సంఘం నాయకుడు కుళ్లాయిస్వామి ఉపకులపతుల కార్ల అద్దె బకాయిలపై స.హ.చట్టం కింద సమాచారం కోరగా రిజిస్ట్రార్‌ రాతమూలకంగా ఇచ్చారు. వర్సిటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఉపకులపతులు ఇష్టారాజ్యంగా వాడుకున్న కార్లు, అద్దె బకాయిల బాగోతం వెలుగులోకొచ్చింది. వర్సిటీకి చెల్లించాల్సిన సొమ్ముపై మాజీ ఉపకులపతులకు లేఖ రాస్తామని రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య తెలిపారు.

విచారణకు డిమాండ్‌

వర్సిటీ వాహనాల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణయ్య, కుళ్లాయిస్వామి ఎస్కేయూ వీసీ హుస్సేన్‌రెడ్డికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపకులపతులు పెళ్లిళ్లకు, విహారయాత్రలకు కార్లు వాడుకొని అద్దె చెల్లించకపోవడం దారుణమన్నారు. వెంటనే విచారణ కమిటీని నియమించి, సొమ్ము రికవరీ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు