logo

ఆక్వా రంగానికి ఊరట

జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఆక్వా ఒకటి. రొయ్యల మేతలు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగి మార్కెట్లో రొయ్యల ధరలు పతనమై సాగుదారులు సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.

Updated : 02 Feb 2023 09:54 IST

రొయ్యల మేత ముడి పదార్థాల దిగుమతిపై పన్ను తగ్గింపు

పరిశ్రమ నిర్వాహకులు ధర తగ్గిస్తేనే రొయ్య రైతుకు మేలు

జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఆక్వా ఒకటి. రొయ్యల మేతలు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగి మార్కెట్లో రొయ్యల ధరలు పతనమై సాగుదారులు సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. రొయ్యల మేత తయారీకి ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని పది నుంచి పదిహేను శాతం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పన్ను తగ్గింపు గురువారం నుంచి అమలులోకి రానున్నది. ఈ మేరకు రొయ్యల మేత ధరలు కంపెనీలు తగ్గిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది.

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లా నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో అక్వా, గ్రానైట్ రంగాలదే సింహభాగం. రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల చెరువులపై సరఫరా చేస్తున్న కరెంటుపై రాయితీ తగ్గించటం వల్ల సాగుదారులపై ఛార్జీల భారం మూడు రెట్లు పెరిగింది. రొయ్యల సాగులో 70 శాతం ఖర్చు మేతకే అవుతుంది. రెండేళ్లలో 25 కేజీల బస్తా ధర రూ.400కు పైగా పెరిగింది. 2021 మార్చిలో రూ.1730గా ఉన్న ధర ప్రస్తుతం రూ.2160కు చేరుకుంది. సాగులో వినియోగించే మందుల ధరలు 30 శాతం పెరిగాయి. టన్ను మేత రూ.10 వేలు పెంచటం వల్ల మూడు నెలలు సాగు చేసే వనామీ రకం రొయ్యలకు ఎకరాకు రూ.30 వేలకు పైగా భారం సాగుదారులపై పడింది. విదేశాలకు ఎగుమతులు తగ్గటం, కంపెనీలు కలిసి కోత వేయటం వల్ల మార్కెట్లో రొయ్యల ధర 40 శాతం పడిపోయింది. వంద కౌంట్ రూ.170కు పడిపోయింది. ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి లేకపోవడంతో ధరను రూ.240కు తాత్కాలికంగా పెంచారు. వంద కౌంట్ రొయ్యల ఉత్పత్తికి రైతుకు రూ.280 వరకు ఖర్చు అవుతోంది. కనీసం రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. మూడు నెలలుగా ధరలు పతనమై ఆక్వా సాగుదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగు చేయడానికి జంకుతున్నారు. ఈ ఏడాది రొయ్యల ఉత్పత్తి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. రొయ్యల మేత తయారీకి వినియోగించే ముడి పదార్థాలను విదేశాల నుంచి కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. బడ్జెట్లో కేంద్రం వీటిపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 15 శాతానికి తగ్గించింది. రొయ్యల మేత ధరలు సైతం ఇదే రీతిలో తగ్గడానికి అవకాశం ఏర్పడింది. అదే జరిగితే రైతులు, హేచరీల యజమానులకు కొంత మేర లబ్ధి కలుగుతుంది. కేంద్ర ఇచ్చిన రాయితీ తమకు మేలు చేసేలా మేత ధరలు తగ్గించాలని రొయ్య రైతులు కోరుతున్నారు.


వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో కదలిక

బాపట్లలో వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ప్రకటించింది. ఐదు వందల పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల కోసం పట్టణ శివారున జమ్ములపాలెం రోడ్డులో 53 ఎకరాల భూమి కేటాయించారు. రూ.510 కోట్లు మంజూరు చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. 20 నెలల క్రితమే వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణానికి వర్చువల్‌గా సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. రెండు కళాశాలల ఏర్పాటునకు ఇన్నాళ్లూ కేంద్రం నుంచి అనుమతి లేదు. నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవలే భవనాలకు స్తంభాలు నిర్మించే పనులు ప్రారంభించారు. తాజాగా కేంద్ర బడ్జెట్లో కొత్త వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటునకు పచ్చజెండా ఊపారు. కేంద్రం అనుమతి లభిస్తే రెండు కళాశాలల నిర్మాణానికి నిధులు విడుదలవుతాయి. భవనాల నిర్మాణం వేగంగా పూర్తయ్యి ఆసుపత్రి, కళాశాలలు రెండేళ్లలో ప్రారంభించడానికి అవకాశం లభిస్తుంది. ఐదొందల పడకల ఆసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల ప్రారంభమైతే జిల్లావాసులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.


సాగుకు చేదోడు

రైతులకు రసాయన ఎరువుల వాడకం ద్వారా పెట్టుబడి వ్యయం పెరిగి గిట్టుబాటు కాకపోవడంతో వాటి వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం బడ్జెట్‌లో పీఎం-ప్రణామ్‌ పథకాన్ని ప్రకటించింది. ఇందులో ప్రకృతి సాగు ప్రోత్సహించడంలో భాగంగా కోటిమంది రైతులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రకృతి సాగు చేపట్టేవారికి ఇది ప్రయోజకరం. బయో ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్ల ఏర్పాటు వల్ల ప్రకృతి సాగుకు ఉత్పాదకాల లభ్యత పెరిగి సేంద్రీయసాగు పుంజుకోనుంది. సాగు పద్ధతులను ఆధునికీకరించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు. దీంతో సాగు కొత్తపుంతలు తొక్కనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 48వేల మంది రైతులు ప్రకృతి సాగులో ఉన్నారు. నాణ్యమైన పత్తి దిగుబడిని పెంచడానికి ప్రభుత్వం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తారు. మూడు జిల్లాల పరిధిలో 2లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతున్నందున రైతులకు ప్రయోజనకరం. మూడు జిల్లాల్లో ఉద్యానపంటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ పథకం ద్వారా నాణ్యమైన మొక్కల లభ్యత పెరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 164 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిని కంప్యూటరైజ్డ్‌ చేయడానికి కేంద్రం నిధులు కేటాయించింది. దీంతో పీఏసీఎస్‌ల్లోనూ డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన ద్వారా బాపట్ల జిల్లాలో తీరప్రాంతంలో ఉన్న వేలమంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. మత్స్యరంగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం వల్ల హేచరీలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహం లభించనుంది. ఇవి పెరిగితే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.


* జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం: 22 వేల ఎకరాలు

* రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీలు: 17

* ప్రాసెసింగ్‌ ప్లాంట్లు: 7

* ఉత్పత్తి అవుతున్న రొయ్యల విలువ: రూ.2000 కోట్లు

* ఏటా ఉత్పత్తి అవుతున్న రొయ్యలు: 80 వేల టన్నులు

* విదేశాలకు ఎగుమతి అవుతున్న రొయ్యల విలువ: రూ.1500 కోట్లు


ప్రయోజనం రైతులకు అందేలా చూడాలి

రొయ్యల మేత ధరలు గత రెండేళ్లలో విపరీతంగా పెరిగాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడిపదార్థాల ధరలు పెరిగాయని కంపెనీలు మేత ధర పెంచుతున్నాయి. కేంద్రం బడ్జెట్లో మేత తయారీకి వాడే ముడిపదార్థాలపై పన్ను తగ్గించింది. ఆ మేరకు తయారీ ఖర్చు తగ్గుతుంది. కేంద్రం బడ్జెట్లో కల్పించిన లబ్ధి కేవలం కంపెనీలకే కాకుండా రైతుల వరకు చేరేలా చర్యలు తీసుకోవాలి.

శరత్‌, ఆక్వా రైతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని