logo

బిక్కుబిక్కుమంటున్న పాల్వాయి గేటు.. పిన్నెల్లి తీరుపై సర్వత్రా ఆగ్రహం

గడప గడపకు కార్యక్రమం ద్వారా ఊర్లోకి వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి గ్రామస్థులు పూలతో స్వాగతం పలికారు.

Updated : 24 May 2024 09:07 IST

పోలింగ్‌రోజున జరిగిన ఘటనలతో గ్రామం విడిచిన పురుషులు
మహిళలను బూతులతో దూషించిన ఎమ్మెల్యే పిన్నెల్లి
ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, రెంటచింతల, గురజాల

 మహిళలను బెదిరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి

గడప గడపకు కార్యక్రమం ద్వారా ఊర్లోకి వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి గ్రామస్థులు పూలతో స్వాగతం పలికారు. కానీ నేడు అదే ఎమ్మెల్యే మహిళలని చూడకుండా ఓ ప్రజాప్రతినిధినని మరిచి వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో బెదిరించాడు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరుపై పాల్వాయిగేటు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌రోజున గ్రామస్థులపై దాడులు చేయడంతో ప్రస్తుతం ఊర్లో పురుషులెవ్వరూ లేరు. వైకాపా అల్లరిమూకలు దాడులకు పాల్పడతాయని తలోచోట తలదాచుకుంటున్నారు. కుటుంబపెద్ద ఎక్కడో దూరంగా ఉండడంతో స్థానిక మహిళలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇలా ఎంతకాలం భయపడుతూ గడపాలో అంటూ ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పాల్వాయిగేటు గ్రామం పోలీసు పహారాలోకి వెళ్లింది. ఏ క్షణాన ఎటు వైపు నుంచి ఎవరు దాడి చేస్తారేమోనని మహిళలంతా భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. చిన్న గ్రామం కావటం.. గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిలో ఉండటం.. ఇళ్ల వెనుకభాగంలో ఎటువంటి రక్షణ లేకపోవడంతో భయం మరింత పెరిగింది. భారీ వాహనాలతో ప్రత్యర్థులు వచ్చి ఒక్కసారిగా గ్రామంపై పడతారనో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13న పోలింగ్‌ జరగడం, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలకొట్టడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత రోజు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి పరామర్శల నెపంతో కారంపూడిలో బీభత్సం సృష్టించారు. అనంతరం పాల్వాయిగేటుపై దాడులు చేసే అవకాశం ఉందని గ్రహించి తెదేపా నాయకులు గ్రామం విడిచి వెళ్లారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకూ మహిళలు భయంతో జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పోలీసు పికెట్‌ కొనసాగుతున్నా వీరిలో ధైర్యం రావడంలేదు. మండల పరిధిలోని ఘటనలు గుర్తు చేసుకుంటూ తమ గ్రామం వారిపై కూడా దాడులకు పాల్పడతారేమోనని భయపడుతున్నారు. పాల్వాయిగేటు గ్రామాన్ని అంతం చేస్తానంటూ రామకృష్ణారెడ్డి చేసిన బెదిరింపులు తమ చెవుల్లో వినిపిస్తూన్నే ఉన్నాయని ప్రాణభయంతో గడుపుతున్నామని మహిళలు ఆవేదన వెలిబుచ్చారు.

పెద్ద సంఖ్యలో రెండు పార్టీలకు చెందిన నేతలు రహస్య ప్రదేశాలకు తరలివెళ్లారు. దీంతో ఎవరికి ఎటువంటి ఆపద పొంచి ఉందోనని ఆందోళనలో ఉన్న వృద్ధులు టీవీల ముందు పడిగాపులు కాస్తున్నారు. నిరంతరం మాచర్ల వార్తలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పటికప్పుడు తమకుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో? ఏమైనా అరెస్టు చేశారా? లాంటి సమాచారం తెలుసుకుంటున్నారు. పొలం పనులకు వెళ్లటం, గేదెలకు మేత తేవటానికి కూడా జంకుతున్నారు.

తెదేపాకు ఓట్లు పడుతున్నాయనే అసహనంతో..

పాల్వాయిగేటులో రెండుసార్లు వైకాపా సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు గెలుపొందారు. దీంతో వైకాపా మద్దతు గ్రామంగా ప్రతి ఒక్క వైకాపా నేత భావించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్వాయిగేటుకు ఎమ్మెల్యే పిన్నెల్లి వస్తే మహిళలు పూలతో స్వాగతం పలికారు. కాని పోలింగ్‌నాడు తెదేపాకే అధికసంఖ్యలో ఓట్లు పడుతున్నాయని వైకాపా నేతల సమాచారంతో ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంలు ధ్వంసం చేయడం, అతని వర్గీయులు బూత్‌ల వద్ద దాడులకు పాల్పడటం మహిళలను అసభ్యపదజాలంతో దూషించి వేలెత్తి బెదిరించటంతో గ్రామస్థులు కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకే ఆసక్తి చూపటంలేదని గ్రామస్థుడు అర్జునరావు వెల్లడించారు.

ఎన్నికల రోజు ఈవీఎం ధ్వంసం ఘటనలో వైకాపా, తెదేపా నేతలు గ్రామం విడిచారు. ప్రస్తుతం దూరప్రాంతాల్లో తలదాచుకున్నారు. కారంపూడి ఘటన రోజు రక్షణగా ఇతర గ్రామాల మిత్రులు, పార్టీ నేతలు గ్రామంలో నిద్రించారు. అయినా భయం వీడకపోవటంతో ఎన్నికల రోజుల్లో హుషారుగా పనిచేసిన రెండు పార్టీల నేతలందరూ నేడు గ్రామంలో కనిపించని పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని