logo

GHMC: అత్యవసరం పేరుతో..బల్దియాకు టోకరా

Eenadu icon
By Telangana Dist. Team Updated : 15 Dec 2024 06:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

శస్త్రచికిత్స చేయించుకోవాలంటూ అడ్డదారిలో బిల్లులు
ఏడాదిలో రూ.1,025 కోట్ల బిల్లులపై అనుమానాలు
ఈనాడు, హైదరాబాద్‌

సాధారణ అనారోగ్య సమస్యలను ప్రాణాంతక వ్యాధులంటూ.. అడ్డదారిలో బిల్లులు పొందిన గుత్తేదారులపై జీహెచ్‌ఎంసీ (GHMC) దృష్టిపెట్టింది. ఆరు నెలల్లో సుమారు రూ.162 కోట్లు మంజూరయ్యాయని అంచనా. అందులో సగానికిపైగా బిల్లులు నకిలీ చీటీలతో ఆమోదం పొందినట్లు సమాచారం. గుండెకు శస్త్రచికిత్స అవసరమని, స్టంట్లు వేయాలని, ఇతరత్రా కారణాలతో వైద్యుల నుంచి చికిత్సకు సిఫార్సు లేఖలు తీసుకోవడం, వాటిని అధికారులకు చూపించి రూ.కోటి నుంచి రూ.5కోట్ల వరకు బిల్లులు తీసుకున్న గుత్తేదారులు భారీగా ఉన్నారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా, ఇతరత్రా ఫిర్యాదులతో నిలిచిన పనులకు సంబంధించిన పాత బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు పలువురు ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

తోటి గుత్తేదారులతో ఒప్పందాలు..: బిల్లులను సమర్పించే తేదీ ఆధారంగా.. గుత్తేదారులకు వరుస క్రమంలో బిల్లులు చెల్లించే విధానం కొన్నేళ్లుగా అమలవుతోంది. వేగంగా పనులు చేసి, వెంటనే బిల్లులు పొందడం కోసం.. కొందరు కాంట్రాక్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. తోటి గుత్తేదారులు ఎవరైనా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిస్తే.. వెంటనే అతనికి రూ.లక్ష నుంచి రూ.5లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతోన్న గుత్తేదారులు తమ సంస్థలో భాగస్వామి అంటూ నకిలీ రికార్డులు సృష్టిస్తున్నారు. మా వ్యాపార భాగస్వామికి గుండె ఆపరేషన్‌ అవసరమంటూ.. ఆర్థిక విభాగం, బల్దియా కమిషనర్‌ను సంప్రదించడం, మానవీయ కోణంలో ఆయా అధికారులు వాటిని ఆమోదించడం ఏడాదిగా సాగింది.

వాటిలో పాత బిల్లులు..

జులై 2023 నుంచి ఈ ఏడాది డిసెంబరు మొదటి వారం వరకు నెలలవారీగా చెల్లించిన బిల్లుల విలువ రూ.1025కోట్లు. అందులో.. అర్హతలేని పాత బిల్లులు కూడా ఉన్నాయంటూ తాజాగా అధికారులకు ఫిర్యాదులందాయి. దాంతో ఫైనాన్స్‌ అధికారులు నెలలవారీగా ఆమోదం పొందిన బిల్లుల వివరాలపై దృష్టిపెట్టారు. సహాయ ఇంజినీర్ల నుంచి కార్యనిర్వాహక ఇంజినీర్ల వరకు.. వారి పరిధిలోని బిల్లులు ఎప్పటివనే వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ ఇలంబర్తి యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయా బిల్లులకు నిధులను ఇంకా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. 

Tags :
Published : 15 Dec 2024 06:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని