logo

GHMC: మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనం షురూ

Eenadu icon
By Telangana Dist. Team Updated : 22 Nov 2024 08:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

శివారు మున్సిపాలిటీల జాబితాలో ఉన్నవి..
పురపాలకశాఖ ఉద్యోగులుగా పంచాయతీ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులోని మున్సిపాలిటీల్లోకి అక్కడున్న సమీప గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ను బాహ్యవలయ రహదారి వరకూ విస్తరించే క్రమంలో శివారు మున్సిపాలిటీలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో శివారు మున్సిపాలిటీల్లో 51 గ్రామాలను కలిపేందుకు రెండునెలల క్రితం ఆర్డినెన్స్‌ జారీచేసింది. ఇందులోని అంశాలకు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు కొద్దిరోజుల నుంచి చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీల రికార్డులు, భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులను మున్సిపాలిటీల్లోని వార్డుల ఖాతాల్లోకి చేర్చారు. ఆస్తిపన్నులను వసూలు చేస్తున్నా.. ఆయా గ్రామ పంచాయతీల పేర్లను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయకపోవడంతో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేందుకు సాధ్యం కావడం లేదు. ఇక ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్నవారు మున్సిపాలిటీ వ్యవస్థలోకి వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు, ఉద్యోగులకు బాధ్యతలు 

గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధులు నిర్వహించిన వారిని నేరుగా పురపాలకశాఖ అధికారులుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ వారు విధులు నిర్వహించిన సంవత్సరాలను సర్వీసుగా పరిగణించారు. గ్రామ పంచాయతీల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహించిన వారిని కూడా మున్సిపాలిటీ అధికారులు తీసుకున్నా... వార్డుల్లో పని విధానం, ఇతర కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని వీరికి ఉద్యోగం ఇస్తున్నారు. సర్వే లెక్కలు, గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ గ్రామాల్లో పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వీరందరికీ పురపాలకశాఖ నుంచి జీతాలు వచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల పరిధి పెరిగిన దృష్ట్యా మరికొందరు కొత్తవారిని నియమించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని మున్సిపల్‌ కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

మౌలిక వసతులపై నజర్‌

మున్సిపాలిటీల్లో విలీనమైన 51 గ్రామాల్లో మౌలిక వసతులపై మున్సిపల్‌ కమిషనర్లు దృష్టి సారించారు. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కొత్తగా విలీనమైన గ్రామాల బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అధికారులను ఆదేశించారు. తాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్లతో సరఫరా చేయాలని నిర్ణయించారు. మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి పరిమాణాన్ని తెలుసుకుని పంచాయతీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారుల ద్వారా కొత్త పైప్‌లైన్లు, పైప్‌లైన్ల సామర్థ్యం పెంచేందుకు నివేదికలు అడుగుతున్నారు. ఆయా గ్రామాల్లో మురుగునీటి ప్రవాహాన్ని ఎక్కడికి పంపించాలన్న అంశంపై ప్రణాళికలను రూపొందించి మురుగునీటి వ్యర్థాల నిర్వహణను చేపట్టనున్నారు.  

Tags :
Published : 22 Nov 2024 08:23 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని