logo

ప్లాట్ల పేరుతో విశ్రాంత ఎస్సైకి టోకరా

ప్లాట్లు విక్రయిస్తామని రూ.లక్షలు ఓ విశ్రాంత ఎస్సై నుంచి దండుకుని మోసానికి పాల్పడిన సంస్థ నిర్వాహకులపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 28 May 2024 02:38 IST

ఫిలింనగర్‌: ప్లాట్లు విక్రయిస్తామని రూ.లక్షలు ఓ విశ్రాంత ఎస్సై నుంచి దండుకుని మోసానికి పాల్పడిన సంస్థ నిర్వాహకులపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో నివసించే ఈడిగ శ్రీశైలం పోలీస్‌ శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2020లో పదవీ విరమణ పొందారు. అనంతరం ఓపెన్‌ ప్లాట్‌ కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ట్రివిస్టా వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగరాజుతో పరిచయం ఏర్పడింది. దీంతో తమ కంపెనీకి సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరివాల్‌ గ్రామంలో వెంచర్‌ ఉందని అందులో 216, 217, 218 ప్లాట్లను కొనుగోలు చేయాలని సూచించాడు. అతడి మాటలు నమ్మిన శ్రీశైలం ఆ వెంచర్‌ను మరికొందరితో కలిసి కొన్నాళ్ల క్రితం సందర్శించి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు ప్లాట్లకు రూ.20లక్షలు సంస్థ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరామవర్మ, ప్రమీల, శ్రీనివాస్‌లకు మేనేజర్‌ నాగరాజు సమక్షంలో చెక్కుల రూపంలో చెల్లించారు. ప్లాట్లను మాత్రం ఆయనకు సంస్థ రిజిస్ట్రేషన్‌ చేయలేదు. దీంతో తాను చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఫిల్మ్‌నగర్‌లోని సంస్థ నిర్వాహకులను కోరారు. ఈ మేరకు నిర్వాహకులు అతడికి చెక్కు ఇచ్చినప్పటికీ సంబంధిత చెక్‌ బౌన్స్‌ అయ్యింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని