logo

ఏక రూపం.. చకచకా సిద్ధం

విద్యా సంవత్సరం సమీపంలోకి వచ్చేస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి రెండు జతల ఏకరూప దుస్తులు సిద్ధం కావాల్సి ఉంది.

Published : 28 May 2024 02:43 IST

ధరిస్తే విద్యార్థులు ఇలా..  

న్యూస్‌టుడే, పాత తాండూరు, బషీరాబాద్‌: విద్యా సంవత్సరం సమీపంలోకి వచ్చేస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి రెండు జతల ఏకరూప దుస్తులు సిద్ధం కావాల్సి ఉంది. దీంతో విద్యార్థి పాఠశాలకు మొదటి రోజే కొత్త దుస్తులు, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలతో వచ్చేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూన్‌ 10వ తేదీ లోపే కచ్చితంగా కుట్టిన ఏకరూప దుస్తులను ఉపాధ్యాయులకు మహిళా సంఘాల సభ్యులు అప్పగించనున్నారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారి, డీఈఓ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.

1.15 లక్షల మందికి అందించాలనేది లక్ష్యం

జిల్లాలోని 20 మండలాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,325 ఉన్నాయి. వీటిలో 1,22,728 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడులతో పాటు కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకు ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు జతల ఏకరూప దుస్తులను అందజేస్తోంది. 

  • 2022-23 సంవత్సరానికి గాను 53,058 మంది బాలురు, 54,730 మంది బాలికలకు ఏకరూప దుస్తులను అందించనున్నారు. ఈసారి సుమారు 1.15లక్షల మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. 

ప్రైవేటుకు దీటుగా.. ఆకర్షణీయంగా..

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఏకరూప దుస్తుల డిజైన్‌ను గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. గతంలో కుట్టు విషయంతో కొంత ఇబ్బందులొచ్చినా.. ఈసారి దర్జీలకు అవగాహన కల్పించి మహిళా సంఘాల సభ్యుల చేత ఏ విధంగా కుట్టాలనే పూర్తి వివరాలను తెలియజేయడంతో చక్కని ఆకర్షణతో కుట్టు కొనసాగుతోంది. 
ః 1-3తరగతులకు, 4-5వరకు, 6-12 తరగతులకు బాలికలకు విడి రకాలుగా, 1-12 తరగతుల వరకు బాలురకు కొలతల ఆధారంగా, వయసుల వారీగా కుట్టాల్సి ఉంటుంది. అమ్మాయిలకు, చిన్నారులకు షర్టు, గౌను, పట్టీలు పెట్టి చక్కగా కుట్టడం, పెద్ద వారికి కాలర్‌ పట్టీలు, కోట్, చొక్కా, జేబులు, భుజాలపై క్లాప్స్, చేతి భాగంలో క్లిప్పులు కుట్టాలి. బాలురకు రెండు జేబులు, కాలర్‌ పట్టీలు, చూసేందుకు చక్కగా కనిపించేలా కొలత సరిగ్గా చూసి కుట్టాల్సి ఉంటుంది. 

రూ.50 ఏం సరిపోతుంది

ఖర్చు, పని భారం పెరుగుతోందని ఒక జతకు రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 ఇస్తే ఏం సరిపోతాయని మహిళా సంఘ సభ్యులు పేర్కొంటున్నారు. కనీసం రూ.200 చెల్లించాలని కోరుతున్నారు. కాగా, పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేయిస్తామని, చదువులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.


పది రోజుల్లో ఇస్తాం..

ఏకరూప దుస్తులు పది రోజుల్లోగా ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తాం. ఒకేసారి ఎక్కువ వస్త్రాన్ని కత్తిరించేందుకు యంత్రం ఉపయుక్తంగా ఉంది. దీంతో కటింగ్, కుట్టు విషయంలో సమయం వృథా కాకుండా త్వరగా పనులు జరుగుతున్నాయి. కుట్టు ఊడిపోకుండా నాణ్యమైన దారం వాడుతున్నాం. మాకిచ్చే కూలీ పెంచితే బాగుంటుంది.

విమల, మహిళా సంఘం సభ్యురాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని