logo

మరమ్మతులు చేపడితే.. పడావులే మాగాణులు

ప్రభుత్వం జిల్లాలోని అన్నదాతలకు సాగునీరు అందించే లక్ష్యంతో జలాశయాలను నిర్మిస్తోంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపడితే నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Published : 28 May 2024 02:57 IST

జుంటిపల్లి.. కావాలి రైతుల కల్పవల్లి
అధికారుల సందర్శనతో చిగురిస్తున్న ఆశలు 

నీళ్లు లేక అడుగంటిన జలాశయం 

న్యూస్‌టుడే, యాలాల, తాండూరు, వికారాబాద్‌: ప్రభుత్వం జిల్లాలోని అన్నదాతలకు సాగునీరు అందించే లక్ష్యంతో జలాశయాలను నిర్మిస్తోంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపడితే నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ దశాబ్దాలుగా మరమ్మతులు చేపట్టక పోవడంతో కనీసం సగం ఆయకట్టుకు కూడా నీరందించలేని స్థితిలో కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది..జుంటిపల్లి జలాశయం. తాజాగా అధికారుల సందర్శనతో అభివృద్ధి పనులు జరిగి పూర్వవైభవం ఏర్పడుతుందని రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

30 ఏళ్ల పాటు సాగు బాగు 

ఈ ప్రాజెక్టు దాదాపు 30 ఏళ్ల పాటు సాగు నీరు అందించింది. తద్వారా రైతులు జొన్న, వరి, వేరుసెనగ తదితర పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించారు. మొదట్లో 2080 ఎకరాల మేర సాగు నీరు అందించగా పర్యవేక్షణ లోపంతో ప్రస్తుతం 1200 ఎకరాలకు మించి నీరు అందించలేని దశకు చేరింది.

  • సకాలంలో మరమ్మతులు చేపట్టక పోవడంతో కుడి, ఎడమ కాలువలు 5 కిలో మీటర్ల మేర దెబ్బతిన్నాయి.
  • దాదాపు 10 కి.మీ. దూరాన ఉన్న కుడి, ఎడమ కాలువల్లో ముళ్ల తుమ్మ, గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వీటి ద్వారా అర కిలో మీటరు మేర మాత్రమే సాగు నీరు పారుతోంది. అక్కంపల్లి గ్రామంలోని రైతులకు సాగునీరు అందక ప్రతిసారి వరి పంటలు ఎండిపోయి నష్టపోతున్నారు.
  • ఎడమ కాలువ దాదాపుగా మట్టితో కూరుకు పోయింది. అగ్గనూర్, ఎన్కేపల్లి, మల్‌రెడ్డిపల్లి గ్రామాల రైతులకు చుక్క నీరు అందడంలేదు. పిల్ల కాలువలు పూర్తిగా భూమిలో కలిసిపోయాయి. 

ఉన్న కొద్దిపాటి నీరూ ఖాళీ చేశారు జుంటిపల్లి జలాశయం కుడి, ఎడుమ తూముల ఛానల్స్, రాడ్‌లు, గేర్‌బాక్స్‌లు పూర్తిగా పాడవడంతో మూడు నెలల క్రితం క్రితం వాటి మరమ్మతులకు రూ.8.50లక్షలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించాలని అధికారులు జలాశయంలో నాలుగు అడుగుల మేర ఉన్న నీటిని వృథాగా బయటికి వదిలారు. దీంతో వరి సాగు రైతులకు నీరు అందకుండా పోయింది. 

మోడల్‌ ప్రాజెక్టుగా మారుస్తారా.. 

జుంటిపల్లి ప్రాజెక్టు తూములతో పాటు కుడి, ఎడమ కాలువలను నీటి పారుదల శాఖ రిటైర్డ్‌ ఈఈ మహబూబ్‌ హుస్సేన్, తాండూరు డీఈఈ కిష్టయ్యతో కలిసి ఇటీవల పరిశీలించారు. వచ్చే ఖరీఫ్‌ కాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాలన్నారు. జుంటిపల్లిని త్వరలోనే ఒక మోడల్‌ ప్రాజెక్టుగా తయారు  చేస్తామన్నారు. ఇది నిజంగా కార్యాచరణలోకి వస్తే తమకు పండగేనని రైతులు ఆశిస్తున్నారు. 


భూములు బీడుగా పెట్టుకున్నాం: కోయిల కొండ భీములు, ఆయకట్టు రైతు జుంటిపల్లి

దాదాపు 20 సంవత్సరాలుగా జలాశయం కింద 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రాజెక్టు తూములు, కాలువలు పాడై చుక్క నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సరైన సమయంలో సాగు నీరు అందక భూములను బీడుగా పెట్టుకున్నాం.  


రూ.8కోట్లతో ప్రతిపాదనలు పంపాం: కిష్టయ్య నీటి పారుదల శాఖ డీఈఈ, తాండూరు 

జలాశయం రెండు తూములు, రెండు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ.8కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పూర్తి స్థాయిలో చేపడతాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని