logo

గాంధీలో రూ.35 కోట్ల వ్యయంతో అవయవ మార్పిడి శస్త్రచికిత్స కేంద్రాలు

పేద వర్గాలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు గాంధీ ఆసుపత్రిలో ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నారు.

Updated : 28 May 2024 03:56 IST

న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి: పేద వర్గాలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు గాంధీ ఆసుపత్రిలో ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అవయవాల మార్పిడి కోసం ప్రస్తుత వైద్య రంగంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలతో కూడిన హైఎండ్‌ మాడ్యులర్‌ శస్త్రచికిత్సల కేంద్రాల ఏర్పాటుకు చకచకా పనులు సాగుతున్నాయి. రూ.35 కోట్ల వ్యయంతో ఆరు ఆపరేషన్‌ థియేటర్లను నిర్మిస్తున్నారు. ఆసుపత్రి ప్రధాన భవనంలోని ఎనిమిదో అంతస్తులో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ థియేటర్లలో గుండె, మూత్రపిండం, లివర్, ఊపిరితిత్తులను మార్పిడి చేయడంతోపాటు ఆర్థోపెడిక్‌ సంబంధించిన కీళ్లమార్పిడి, ఈఎన్‌టీకి చెందిన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ల కోసం మొత్తం ఆరు ఆపరేషన్‌ థియేటర్లను తీర్చిదిద్దుతున్నారు.

ఏళ్ల కిందటే ప్రతిపాదన.. 

అవయవాల మార్పిడి కోసం ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్లను గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన 2017లో వచ్చింది. ఆసుపత్రిలో అప్పటికే ఒకటి రెండు మూత్రపిండాల మార్పిడి జరిగినందువల్ల మరిన్ని సదుపాయాలు ఉండే థియేటర్లను నిర్మిస్తే బాగుంటుందని భావించారు. అన్ని సౌకర్యాలతో చక్కటి సేవలు అందిస్తున్న గాంధీ ఆసుపత్రినే నోడల్‌ కేంద్రంగా తీసుకురావాలని తీర్మానించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న శస్త్రచికిత్స కేంద్రాలను విభాగాలవారీగా అవసరాల మేరకు వినియోగిస్తున్నారు. అవయమార్పిడి కేంద్రాల విషయంలో గుండె మార్పిడి చేయాలనుకుంటే సంబంధించిన వైద్య నిపుణులు, తర్ఫీదు పొందిన నర్సులు ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఆ వెంటనే కాలేయ మార్పిడి చేయాలనే పరిస్థితి వస్తే ఆ విభాగం వైద్యులు, సిబ్బంది సత్వరమే అందుబాటులో ఉండేలా విధివిధానాలు ఉన్నాయి. దేనికదే ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్లు ఉంటే, అందుకు సంబంధించిన వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండడమే కాకుండా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే వెసులుబాటు ఉంటుంది. ఈ దిశగా అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు. హైఎండ్‌ తరహాలో ఏర్పాటుచేసే ఈ కేంద్రాలన్నీ స్టీల్‌ కోట్‌తో ఉండడం వల్ల వాటిల్లోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉండదు. వీటిల్లో పనిచేసే వైద్యుల నుంచి వార్డుబాయ్స్‌ వరకు అనుభవం ఉన్నవారే ఉంటారు. రాష్ట్రంలో నిమ్స్‌ తర్వాత అంతటి ఆసుపత్రి లేని లోటును తీర్చేందుకు గాంధీ ఆసుపత్రినే ప్రధాన ఆసుపత్రిగా తీర్చిదిద్దే  నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి.


ఐదు నెలల్లో పనులు పూర్తి

- రాజారావు, సూపరింటెండెంట్‌

ఆసుపత్రిలోని ఎనిమిదో అంతస్తులో రూ.35 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటుచేస్తున్న అత్యాధునిక మాడ్యులర్‌ తరహా ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి వస్తే ఆసుపత్రి ప్రతిష్ఠ పెరుగుతుంది. అవయవాల మార్పిడి ఆపరేషన్లు పెరిగి రోగులకు ఎంతో ఊరట లభిస్తుంది. ఇప్పటివరకు 25 శాతంమేర పనులు పూర్తయ్యాయి. మరో ఐదు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు