logo

8 మందిని కరిచింది.. 10 మందిని వెంటాడింది

తెల్లాపూర్‌ పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. దారిన పోయే ప్రతి ఒక్కరిని వెంటాడి తీవ్రంగా గాయపర్చింది.

Updated : 28 May 2024 03:52 IST

వీధికుక్క దాడిలో గాయపడిన చిన్నారి 

రామచంద్రాపురం రూరల్, న్యూస్‌టుడే: తెల్లాపూర్‌ పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. దారిన పోయే ప్రతి ఒక్కరిని వెంటాడి తీవ్రంగా గాయపర్చింది. గాయపడిన పలువురిలో ఓ చిన్నారి కూడా ఉంది. అప్రమత్తమైన గ్రామస్థులు కుక్కను పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా తప్పించుకుంది. వెళ్లిపోయిందనుకొని వదిలేసిన తరువాత మళ్లీ మధ్యాహ్నం మరో ఇద్దరిని వెంబడించింది. వారు కిందపడి గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ సంగారెడ్డి.. కుక్కను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. మరో రెండు కుక్కలను కరవగా అవి మృత్యువాత పడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో పట్టుకున్న వీధి శునకాలను మున్సిపల్‌ శివారు ప్రాంతంలో వదులుతుండటంతో ఇలా జరుగుతోందని కమిషనర్‌ చెప్పారు. వాటి సంఖ్యను నియంత్రించడానికి ఆపరేషన్‌ చేయించే పనులు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు.మొత్తంగా తెల్లాపూర్‌లో తాజా ఘటనల్లో ఎనిమిది మంది వరకు కుక్కకాటుకు తీవ్రంగా గాయపడ్డారు. అది వెంబడించడంతో కిందపడి మరో 10 మంది గాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని