logo

సరిగ్గా వారం సన్నద్ధంలో యంత్రాంగం

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.

Updated : 28 May 2024 03:51 IST

కౌంటింగ్‌ ప్రక్రియపై రోజువారీ సమీక్ష
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత

హోలీమేరి కళాశాల వద్ద కలెక్టర్‌ గౌతమ్‌తో చర్చిస్తున్న సీపీ తరుణ్‌జోషి 

ఈనాడు, హైదరాబాద్‌:లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఏడురోజుల్లో ఏమేం పనులు చేయాలి? రోజువారీ ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్‌ అధికారులు వేర్వేరుగా సమాలోచనలు నిర్వహిస్తున్నారు. ఈవీఎం యంత్రాల్లో ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లలో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో వారికి వివరించారు. అన్ని  కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సాయుధ బలగాల పహారాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్‌ విధించారు.

గరిష్ఠంగా 28.. కనిష్ఠంగా 14

ఎన్నికల ఫలితాలను వీలైనంత వేగంగా విడుదల చేసేందుకు రిటర్నింగ్‌ అధికారులు  చర్యలు చేపట్టారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు  ఉదయం 8గంటలకు ప్రారంభమవనున్న దృష్ట్యా ఉదయం 6 గంటలకే టేబుళ్లు సిద్ధంగా ఉంచాలని  సూచించారు. పోలింగ్‌శాతం ఆధారంగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు గరిష్ఠంగా 28 టేబుళ్లు, కనిష్ఠంగా 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. పోలైన ఓట్లు, ఈవీఎంల ఆధారంగా టేబుళ్ల సంఖ్యను పెంచనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌  ఓట్ల లెక్కింపునకు 20 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ అధికారులతో రోజూ ఒక ప్రక్రియపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించనున్నారు. 

చేవెళ్ల ఒకే చోట

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు చేవెళ్లలోని బండారు శ్రీనివాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగనుంది. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి సంబంధించి కీసరలోని హోలిమేరీ ఇంజినీరింగ్‌ కళాశాల, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం, విల్లామేరి కళాశాలలో లెక్కింపు కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ ఓట్ల లెక్కింపు గత అసెంబ్లీ ఎన్నికల కేంద్రాల్లోనే కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని