logo

GHMC: బల్దియా ఎన్నికలు.. ఏడాది ఆలస్యం?

Eenadu icon
By Telangana Dist. Team Updated : 17 Dec 2024 09:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌

నిర్ణీత సమయం కన్నా బల్దియా పాలకవర్గ ఎన్నికలు ఒక ఏడాది ఆలస్యం కానున్నాయా.. ప్రభుత్వం తీరును చూస్తే అధికార వర్గాలు అవుననే అంటున్నాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గ్రేటర్‌లో విలీనం చేయడం, బల్దియాను మళ్లీ విడదీయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతోనే జాప్యం జరగనుందని అంటున్నారు. మరో వైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరింపజేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా శివారులోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనంచేస్తూ గెజిట్‌ విడుదలచేసింది.  వచ్చే జనవరిలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు జీహెచ్‌ఎంసీలో కలిసిపోతాయి. మరో ఏడాదికి జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు పూర్తవుతుంది. అనంతరం జనాభా లెక్కలు, డివిజన్ల పునర్విభజన, నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలనే అంశాలపై సర్కారు నిర్ణయం తీసుకుంటుంది. అదంతా జరిగేందుకు ఏడాది పడుతుంది. అనంతరం కొత్త మహా నగరపాలక సంస్థలు ఏర్పడుతాయి. అంటే.. ప్రస్తుత గ్రేటర్‌ పాలకమండలి గడువు పూర్తయ్యాక.. మళ్లీ జీహెచ్‌ఎంసీ పేరుతో ఎన్నికలు జరగవు. ఏడాదయ్యాక కొత్త నగరపాలక సంస్థలకే ప్రభుత్వం ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంది. నయా పాలకమండళ్లు 2027లో కొలువుదీరుతాయి.

సవాళ్ల సవారీ మొదలు

శివారు పురాలు గ్రేటర్‌లో కలిశాక పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధి 625 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. విలీనం తర్వాత విస్తీర్ణం 2,500 చ.కి.మీ వరకు పెరగనుంది. దానికి తగ్గట్టుగా  సర్కిళ్లు, జోన్ల పరిధిని నిర్ణయించాలి.

ఇదే సమయంలో డివిజన్లు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన మొదలుకావచ్చనే ఊహాగానాలున్నాయి.  2026లో జనాభా లెక్కల నివేదిక వస్తుందన్న అంచనాలు నిజమైతే పునర్విభజన ప్రక్రియ చకచకా జరుగుతుంది.

రాష్ట్రమంతా అప్పుడే..

వచ్చే జనవరితో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పాలకమండలి గడువు పూర్తవనుంది.ఆ సమయంలో నగర శివారులోని 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి, వారి ద్వారా ఆయా స్థానిక సంస్థలను గ్రేటర్‌లో విలీనం చేయాలని సర్కారు నిర్ణయించింది. తరువాతే ఆయా సంస్థల ఎన్నికలపై సర్కారు నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.


రెండా.. నాలుగా!

హా విలీనం తర్వాత జీహెచ్‌ఎంసీని ఎన్ని భాగాలు చేయాలన్న అంశంపై సర్కారు ఆలోచన చేస్తూనేఉంది. దిల్లీ మాదిరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నగరపాలక సంస్థలను ఏర్పాటుచేయాలా.. హైదరాబాద్, సికింద్రాబాద్‌ పేర్లతో ఏర్పాటు చేయాలా అని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించాల్సి ఉంది. ఓఆర్‌ఆర్‌ హద్దుగా గ్రేటర్‌ను విస్తరించినట్టే.. మూసీనది హద్దుగా నగరాన్ని విభజిస్తే.. చెరగని సరిహద్దులతో పరిపాలన జరపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

Tags :
Published : 17 Dec 2024 08:41 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని