logo

GHMC: రూ.వెయ్యి కొడితేనే.. ఓటీపీ

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 12 Oct 2025 07:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు ఓటీపీతో లింకు
దరఖాస్తులు లెక్కగట్టి వసూలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు

ఈనాడు,హైదరాబాద్‌: లంచం ఇస్తేగానీ.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆమోదం పొందట్లేదు. కొందరు అధికారులు దరఖాస్తుకు రూ.వెయ్యి, రెండు వేలు వసూలు చేస్తున్నారు. వారికి కంప్యూటర్‌ ఆపరేటర్లు మధ్యవర్తిత్వం చేస్తున్నారు. కేంద్ర కార్యాలయం పర్యవేక్షణ లేకపోవడంతో.. సర్కిళ్ల స్థాయి అధికారులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు.

డబ్బులిస్తేనే ఆమోదం..: జనన, మరణ ధ్రువీకరణపత్రాల దరఖాస్తులను ఆమోదించే అధికారం సహాయ వైద్యాధికారులు, సహాయ మున్సిపల్‌ కమిషనర్లకు ఉంది. తప్పుడు పత్రాల జారీకి అధికారులను బాధ్యులను చేయాలనే ఉద్దేశంతో.. అధికారి నంబరుకు వచ్చే ఓటీపీతో దరఖాస్తు ఆమోదాన్ని ముడిపెట్టారు. ఆ నిబంధనను కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్కో ఓటీపీకి రూ.1,000 నుంచి రూ.2,000 ఇవ్వాలని.. అప్పుడే ఓటీపీ చెబుతామని కంప్యూటర్‌ ఆపరేటర్లకు షరతు పెట్టారు.

ఇవిగో ఉదాహరణలు..

  • జులై 27న పిల్లాడికి పేరు పెట్టేందుకు దరఖాస్తు నంబరు బీసీఎన్‌సీ07250 25319తో ఓ వ్యక్తి మీసేవా కేంద్రం ద్వారా చేసుకున్న దరఖాస్తును అధికారులు ఇప్పటికీ ఆమోదించలేదు.
  • ఆగస్టు 20న తన కుమారుడికి పేరు పెట్టడం కోసం బేగంపేట్‌కు చెందిన వ్యక్తి దరఖాస్తు నెంబరు సీఎన్‌ఐ022502429108తో చేసుకున్న దరఖాస్తును అధికారి ఆమోదించలేదు. ఆన్‌లైన్‌లో పుట్టిన తేదీని పరిశీలించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.. సరైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారి దరఖాస్తును అటకెక్కించడం గమనార్హం.

కావాలనే తప్పుగా నమోదు చేసి..

నగరంలోని 30 సర్కిళ్లలో కలిపి 5వేల అర్జీలు పెండింగులో ఉన్నాయి. అందులో రెండు నెలలకుపైగా ఆమోదం పొందనివి 3వేలు ఉండటం గమనార్హం. బాధితుల్లో మెజార్టీ అమాయకులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్న పేదలకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఆయా ఆస్పత్రుల్లోని సిబ్బంది తల్లిదండ్రుల పేర్లను తప్పుగా నమోదు చేస్తున్నారు. మీసేవా కేంద్రాల నిర్వాహకులూ అలాగే జనన ధ్రువీకరణపత్రాలు ఇస్తున్నారు. పిల్లలకు ఆధార్‌ కార్డు తీసుకునేటప్పుడు, పాఠశాలల్లో ప్రవేశాలప్పుడో సమస్య గురించి తెలుస్తోంది. హడావుడిగా మీసేవా కేంద్రాలకు వెళ్లి, అఫిడవిట్, ఇతరత్రా పత్రాలు సమర్పించి.. అధికారులకు లంచాలిచ్చి సర్టిఫికెట్లలోని తప్పులు దిద్దుకుంటున్నారు. పేర్ల సవరణకు వచ్చే అర్జీల్లో 99శాతం ప్రభుత్వ దవాఖానాల్లో పుట్టిన పిల్లల సర్టిఫికెట్లు ఉండటమే అందుకు నిదర్శనం.

Tags :
Published : 12 Oct 2025 06:52 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని