logo

Hyderabad: ‘మై జీహెచ్‌ఎంసీ’.. అరచేతిలో అన్ని సేవలు

Eenadu icon
By Telangana Dist. Desk Published : 11 May 2025 05:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో ప్రజలకు  అనేక పౌర సేవలను ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌ ద్వారా అందిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ తెలిపారు. పౌరులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అరచేతి నుంచే బల్దియా సేవలను పొందాలని పిలుపునిచ్చారు. యాప్‌ ద్వారా పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, ఆరోగ్యం, వీధి దీపాలు, మురుగునీటి సమస్య, రహదారులను ఊడ్చడం వంటి సమస్యలపై ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఫొటో తీసి సమస్య ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ సూచించారు. వాటిని కంట్రోల్‌ రూము పరిశీలిస్తుందని, యాప్‌లో ఫిర్యాదు నమోదైన ప్రాంతానికి సంబంధిత అధికారులను పంపిస్తామని ఆయన తెలిపారు. అదే సమయంలో.. ఫిర్యాదుదారుకు మొబైల్‌కు ఫిర్యాదు సంఖ్య, సంబంధిత అధికారి ఫోన్‌ నెంబర్లతో స్వల్ప సందేశం వెళ్తుంది. యాప్‌లో ఫిర్యాదు పరిష్కారమైందా, లేదా అని సూరిచూసుకోవచ్చు. పరిష్కారం కాకపోయినా, అయినట్టు చూపే అధికారులపై బల్దియా కంట్రోల్‌ రూం 040 - 2111 1111కు ఫిర్యాదు చేయొచ్చని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

ట్రేడ్‌ లైసెన్సుకు దరఖాస్తు, ఆస్తిపన్ను మదింపు, పెంపుడు శునకానికి లైసెన్సు తీసుకోవడం, నిర్మాణ వ్యర్థాల తరలింపునకు వాహనాన్ని బుక్‌ చేసుకోవడంతోపాటు.. దోమల సమస్య, వీధి దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతలు, వీధి కుక్కలు, ఆహార కల్తీ, తదితర సమస్యలపై యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ట్రేడ్‌ లైసెన్సు, ఆస్తిపన్ను, ఇతరత్రా రుసుములనూ డెబిట్‌ కార్డు, యుపిఐ ద్వారా చెల్లించవచ్చు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు, వార్డు ఆఫీసులు, ప్రజా మరుగుదొడ్లు, వాతావరణ సమాచారం, ఇంకా చాలా అవసరమైన సేవలు పొందవచ్చు. గ్రేటర్‌ ప్రజల సౌకర్యం కోసం ఈ యాప్‌ను మరింత సులభతరంగా మార్చామని, ప్రజలు యాప్‌ను ఉపయోగించుకుని వ్యక్తిగత, సమాజ సమస్యల పరిష్కారం పొందవచ్చునని ఆర్‌.వి కర్ణన్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని