logo

Karnataka: మార్ఫింగ్‌ బొమ్మలతో దారుణాలకు తెగింపు

మార్ఫింగ్‌ చిత్రాలను చూపించి, యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతున్న అర్జున్‌ అలియాస్‌ అరుణ్‌గౌడ మళలి, అతని బంధువు బాలచంద్రలను శిరసి గ్రామీణ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 28 May 2024 07:45 IST

కార్వార, న్యూస్‌టుడే : మార్ఫింగ్‌ చిత్రాలను చూపించి, యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతున్న అర్జున్‌ అలియాస్‌ అరుణ్‌గౌడ మళలి, అతని బంధువు బాలచంద్రలను శిరసి గ్రామీణ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. కొడుకు అకృత్యాలకు సహకరిస్తున్న అర్జున్‌ తల్లి నాగవేణి పోలీసులకు దొరక్కుండా పరారైంది. పోలీసులు పట్టుకుంటారన్న భయంతో బాలచంద్ర ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. అతన్ని చికిత్స కోసం హుబ్బళ్లిలోని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసుల కథనం ప్రకారం.. అర్జున్‌ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండేవాడు. అందంగా ఉండే యువతులతో పరిచయం పెంచుకునేవాడు. వారిని తమ ఇంటికి ఆహ్వానించి, తల్లికి పరిచయం చేసేవాడు. నిన్ను వివాహం చేసుకుంటానని నమ్మించి, వారితో ఫొటోలు తీసుకునేవాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేసి, ఆ యువతులను బెదిరించేవాడు. వారిపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడేవాడు. వారిపై మోజు తీరాక, కొందరు యువతులను తన బంధువు బాలచంద్రకు పరిచయం చేసేవాడు. యువతులు శ్రీమంతులైతే నాగవేణి వారిని బెదిరించి, సొమ్ము చేసుకునేది. శిరసి, బనవాసి, కుందాపురలకు చెందిన యువతులను వీరు వంచించారని ప్రాథమిక విచారణలో తేలింది.


స్టిక్కర్‌ సాయంతో నిందితుల పట్టివేత

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : గత జనవరి 13 రాత్రి మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వెళుతూ కామాక్షిపాళ్య పరిధిలోని ఉపరితల వంతెన పైనుంచి కిందకు పడి దినేశ్‌ (29) అనే యువకుడు మరణించాడు. అతని స్నేహితుడు రాజ్‌ భట్ తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మద్యం తాగి వాహనం నడుపుతూ అదుపు తప్పి, వంతెన పైనుంచి వీరిద్దరూ కిందకు పడిపోయారని కామాక్షిపాళ్య ట్రాఫిక్‌ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాజ్‌భట్ స్పృహలోకి వచ్చిన అనంతరం తాము అదుపు తప్పి కిందకు పడలేదని, వెనుక నుంచి వచ్చిన క్యాంటర్‌ ఢీకొనడంతోనే కింద పడిపోయామని వాంగ్మూలం ఇచ్చాడు. క్యాంటర్‌ వివరాలు, నంబరు ఏమీ తెలియవని, దానిపై ఆవు బొమ్మ ఉన్న పెద్ద స్టిక్కర్‌ ఉందని గుర్తించానని రాజ్‌భట్ చెప్పాడు. ఆ బొమ్మ ఉన్న క్యాంటర్ల కోసం పోలీసులు వంతెన చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అలా వరుసగా వెళుతూ మండ్య జిల్లా తూబనగెరెకు చేరుకున్న పోలీసులు ఒక ఇంటి ముందు నిలిపి ఉన్న క్యాంటర్‌ను గుర్తించారు. దాన్ని స్వాధీనపరుచుకుని, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించగా, దాని బంపర్‌పై ద్విచక్ర వాహనానికి సంబంధించిన పెయింట్, రక్తం అవశేషాలు కనిపించాయి. మరణించిన దినేశ్, గాయపడిన రాజ్‌భట్ల రక్తం నమూనాలతో సరిపోలాయి. వాటి ఆధారంగా క్యాంటర్‌ యజమాని సందీప్, డ్రైవరు సునీల్‌ను అరెస్టు చేసి, విచారణ చేపట్టామని కామాక్షిపాళ్య ట్రాఫిక్‌ ఠాణా పోలీసులు తెలిపారు.


విద్యార్థినుల డీప్‌ఫేక్‌ చిత్రాలతో కలకలం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కొద్ది రోజుల కిందటే నటి రశ్మిక మందణ్ణను లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తి డీప్‌పేక్‌ సాంకేతికతతో వీడియో చేశాడు. ఆ వీడియో వైరల్‌ అయిన తర్వాత పోలీసులు స్వయం ప్రేరితంగా కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, సచిన్‌ తదితరుల వీడియోలూ విడుదలయ్యాయి. ఇప్పుడు నగరంలోని ప్రముఖ కాన్వెంట్కు చెందిన విద్యార్థినుల ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని చిత్రం ఒకటి గత శుక్రవారం విడుదలైంది. ఆ పాఠశాలలో 50 మంది విద్యార్థినుల గ్రూపు ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. వారి చిత్రాలు సోమవారం నాటికి అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి. కృత్రిమ మేధస్సును ఉపయోగించి విద్యార్థినుల నగ్న ఫొటోలను తయారు చేసినట్లు గుర్తించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేంద్ర విభాగం సైబర్‌ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కోర్టును ఆశ్రయించిన భవానీ రేవణ్ణ

 భవానీ రేవణ్ణ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : లైంగిక దౌర్జన్యానికి గురైన ఒక మహిళను అపహరించిన కేసులో తనకు జామీను మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి రేవణ్ణ సతీమణి భవానీ రేవణ్ణ సెషన్స్‌ న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. అర్జీ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మైసూరు జిల్లా కేఆర్‌ నగర ఠాణా పరిధిలో ఒక మహిళను అపహరించిన ఆరోపణలను భవానీ ఎదుర్కొంటున్నారు. తనను ఎవరూ అపహరించలేదని ఆ మహిళ ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే. మహిళను అపహరించిన కేసులో విచారణకు హాజరు కావాలని పలుసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. తనను అరెస్టు చేసేందుకు అవకాశాలు ఉండడంతో ముందస్తు జామీను కోసం అర్జీ వేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని