logo

Siddaramaiah: సిద్ధు వారసుడిగా ధవన్‌ రాకేశ్‌.. కన్నడనాట కొత్త రాజకీయం

Eenadu icon
By Karnataka News Desk Updated : 22 Sep 2025 10:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

తాతతో కలిసి అభివాదం చేస్తున్న మనవడు ధవన్‌

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పెద్ద కుమారుడు రాకేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కనేవారు. చక్కని మాటకారి, సమస్యలను నేర్పుతో పరిష్కరించే గుణం ఉన్న రాకేశ్‌ దారి తప్పి, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని 39 ఏళ్ల పిన్న వయసులోనే కన్నుమూశారు. రాకేశ్‌ మరణించే సమయానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుమారుని మరణంతో కుంగిపోయి, ఇకపై తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు. వైద్యునిగా ఉన్న తన రెండో కుమారుడు డాక్టర్‌ యతీంద్రను వరుణ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపి గెలిపించుకున్నారు. ఎన్నికలకు దూరమని చెప్పినా, ఇవే చివరి ఎన్నికలు అంటూ 2018లో బాదామి నుంచి గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో జనతాదళ్‌కు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్‌ నుంచి 15 మంది, దళ్‌ నుంచి ముగ్గురు పార్టీ ఫిరాయించడంతో ముఖ్యమంత్రి స్థానం నుంచి హెచ్‌డీ కుమారస్వామి తప్పుకుని యడియూరప్పకు అధికారాన్ని అప్పగించారు. మరోసారి కుమారుడు పోటీ చేసిన వరుణ నుంచి పోటీ చేసి ఆయన గెలిచి, యతీంద్రకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రెండు నెలల ముందు తన రాజకీయ వారసుడు తన మనవడు ధవన్‌ రాకేశ్‌ సిద్ధరామయ్య (రాకేశ్‌ కుమారుడు) అని ప్రకటించారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీ సూచించిన పని చేస్తూ, తన మనవడ్ని ఎన్నికల్లో గెలిపించుకుంటానని చెప్పారు. గదగలో నిర్వహించిన కార్యక్రమంలో తన కురుబ సముదాయం నేతలకు మనవడ్ని పరిచయం చేశారు. అతనితో కనకదాసు విగ్రహానికి పూల హారాన్ని వేయించారు. ఇప్పుడు ధవన్‌కు 19 ఏళ్లు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మరో ఆరేళ్లు వేచి ఉండాలి. ఆ లోగా అతనికి రాజకీయాలను పరిచయం చేసి, రాటు తేలేలా చేయాలని సిద్ధు కోరుకుంటున్నారు.

చేరువ అవుతున్న రెండున్నరేళ్లు

గత ఎన్నికల్లో జోడెద్దుల్లా కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌, సిద్ధరామయ్య పని చేసి, వారు ఊహించినట్లే 135 సీట్లు గెలుచుకున్నారు. ముఖ్యమంత్రి పదవి తనకే దక్కుతుందని ఆశించిన డీకే శివకుమార్‌కు పార్టీ పెద్దలు వారించడంతో కాస్త వెనక్కు తగ్గారు. లోక్‌సభ ఎన్నికల వరకు వేచి ఉండాలని, మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్యకు అవకాశం ఇద్దామని చెప్పడంతో పెద్దల ఆదేశాలను శిరసావహించారు. రెండున్నరేళ్ల అవధి పూర్తవుతున్న సమయంలో తనకు అవకాశం వస్తుందన్న ధీమాతో శివుడు ఉన్నారు. తానే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిని అని సిద్ధరామయ్య చెబుతూ రావడంతో శివకుమార్‌ వర్గీయుల్లో అసంతృప్తి చెలరేగుతూ వచ్చింది. అందరూ సంయమనం పాటించాలని, రాష్ట్ర నేతలు ఏ నిర్ణయాన్ని తీసుకోవడం కుదరదని శివుడు స్పష్టం చేశారు. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. రాష్ట్రంలో దేవరాజ అరసు అనంతరం ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కొనసాగారు. ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారాన్ని వదులుకోవలసి వస్తుందని ఆయన భావించారు. నవంబరు నాటికి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతుంది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఈ మధ్య అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముందు జాగ్రత్తగా తన మనవడిని తన సముదాయానికి పరిచయం చేశారని రాజకీయ విశ్లేషకుల మదింపు.

Tags :
Published : 22 Sep 2025 09:16 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు