logo

Karnataka: జోరందుకున్న కుర్చీలాట.. నవంబరులో మార్పు తథ్యమా?

Eenadu icon
By Karnataka News Desk Updated : 02 Oct 2025 10:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

సిద్ధు- డీకే.. మొదలైన మేధోమథనం

ఈనాడు, బెంగళూరు : ప్రతి రెండు మూడు నెలలకోసారి మంత్రివర్గ విస్తరణ లేదా అధికార మార్పిడిపై ఒక్కొక్కరుగా నోరు మెదుపుతూ రాజకీయాలను వేడెక్కిస్తుండటం తరచూ చూస్తున్న తంతే. మొన్నటికి మొన్న సెప్టెంబరులో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని అధికార పక్షంతో పాటు విపక్ష నేతలు కూడా ప్రకటనలు చేశారు. ఆ సెప్టెంబరు కాస్త ముగిసిపోయింది. ఇక మిగిలింది అక్టోబరు, నవంబరు మాసాలే. కాంగ్రెస్‌ సర్కారుకు పెను సవాళ్లు విసిరే నవంబరుకు ఓ నెల మాత్రమే అడ్డుగా ఉంది. రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడి ఉందా? లేదా అన్నది అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు మాత్రమే తెలుసు. ఆలోగా ఆశావహులు తమ అదృష్ట పరీక్ష కోసం ఉన్నదీ లేనిది మాట్లాడుతూ అగ్రనేతలకు సంకేతాలు పంపిస్తున్నారు.

సమీక్ష తెచ్చిన తంటా

గత వారం రోజుల్లో మంత్రులు జమీర్‌ అహ్మద్, డాక్టర్‌ జి.పరమేశ్వర్, హెచ్‌.సి.మహదేవప్పతో పాటు ఎమ్మెల్యేలు రంగనాథ్, బాలకృష్ణ, తదితరులు మంత్రివర్గ విస్తరణ, నాయకత్వ మార్పు గురించి పదేపదే మాట్లాడుతున్నారు. జమీర్‌ అహ్మద్‌ మంత్రివర్గ విస్తరణ తథ్యమని ప్రకటించినా పనిలో పనిగా సిద్ధు నాయకత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందన్నారు. మరోవైపు డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ కూడా విస్తరణ, నాయకత్వ మార్పులపై అధిష్ఠానం ఏమీ చెప్పలేదు. అనివార్యమైతే ఏ క్షణంలోనైనా ఈ మార్పు సాధ్యమనే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కుణిగల్‌ ఎమ్మెల్యే రంగనాథ్‌ మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కాగలరని సెలవిచ్చారు. 140 విధానసభ స్థానాల గెలుపులో ఆయన పాత్ర అపారమని మంత్రివర్గ విస్తరణకు ముందే విస్తర్లు వేసినట్లు వ్యాఖ్యానించారు. వీరి వ్యాఖ్యల మాట అటుంచితే.. బీసీ కమిషన్‌ చేపడుతున్న ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్ష డీకే శివకుమార్‌ పాలిట వరంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమీక్ష ఒక్కలిగ సముదాయ రాజకీయ చిత్రాన్ని మారుస్తుందన్న భయంతో బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిక్కబళ్లాపుర, పాత మైసూరు ప్రాంతానికి చెందిన ఉన్నత వర్గాలకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా డీకే నాయకత్వం అవసరమన్న సంకేతాలిస్తున్నారు.

పాకులాట ఏలనో..

రాష్ట్రంలో అత్యధికులుగా ఉన్న బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, అల్ప సంఖ్యాకులకు నాయకత్వం వహించే సిద్ధరామయ్యకు ధీటైన నేత పార్టీలో లేరు. సామాజిక సమీక్ష ద్వారా బీసీలను అత్యధికులుగా చూపినా భవిష్యత్తులో వారికి అండగా ఉండే గట్టినేత ప్రస్తుతానికి లేరు. మొదటి నుంచీ సామాజిక సమీక్షను వ్యతిరేకించే ఒక్కలిగ, లింగాయత నేతలు సిద్ధరామయ్యను పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లే. ఎంబీ పాటిల్, హెచ్‌.కె.పాటిల్, ఈశ్వర ఖండ్రే లింగాయత్‌లు కాగా వీరెవరూ సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయం కాదన్నది తోసిపుచ్చలేని అంశం. ఇక ఒక్కలిగల్లో డీకే శివకుమార్, కృష్ణభైరేగౌడ, చలువరాయస్వామి, కె.వెంకటేశ్, భైరతి సురేశ్‌.. ఉన్నా డీకే మినహా మిగిలిన వారు సిద్ధు మద్దతుదారులే. ఒక్క డీకే మాత్రమే సిద్ధరామయ్యను ఢీకొట్టగల నేత. ఈ సమీక్ష బయటపడేలోగా (డిసెంబరు)లో ఒక్కలిగ నాయకత్వం ఏర్పాటు చేయాలని ఆ సముదాయ ఎమ్మెల్యేలు యత్నిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో 25 మంది ఒక్కలిగ ఎమ్మెల్యేలుండగా వీరంతా డీకే నాయకత్వం, నవంబరులో చోటు చేసుకునే రాజకీయ మార్పుతో లబ్ధిపొందాలని చూస్తున్నారు.

పరీక్ష ముంగిట సిద్ధు

ముఖ్యమంత్రి రాజకీయ భవిష్యత్తు సమీక్షకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా సాగుతోంది. అప్పటి వరకు సిద్ధరామయ్య నాయకత్వానికి అండగా ఉన్న సీనియర్లు రామలింగారెడ్డి, హెచ్‌.కె.పాటిల్, ఎంబీ పాటిల్, ఈశ్వర ఖండ్రే తదితరులు ఈ సమీక్ష కారణంగా వ్యతిరేకులుగా మారారు. సీనియర్లు కృష్ణభైరేగౌడ, చలువరాయస్వామి, డాక్టర్‌ శరణ్‌ ప్రకాశ్‌ తదితరులు తటస్తులుగా మారారు. సిద్ధు నాయకత్వాన్ని గట్టిగా సమర్థించే రాజణ్ణను తొలగించటంతో సతీశ్‌ జార్ఖిహొళి కూడా నెమ్మదించారు. ఈ సమయంలో సమీక్ష వెల్లడించే నివేదిక సముదాయ పరంగా సిద్ధరామయ్యకు మేలు చేకూర్చినా రాజకీయపరంగా సవాలుగా మారక మానదన్న విశ్లేషణ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.


ఐదేళ్లు నేనే రాజు!

ఈనాడు, బెంగళూరు : నవంబరులోగా నాయకత్వ మార్పు.. అంటూ వస్తున్న వదంతులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తోసిపుచ్చారు. వచ్చే రెండున్నరేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ప్రకటించారు. దసరా ఉత్సవాల్లో చివరి రోజున జంబూ సవారీని ప్రారంభించేందుకు బుధవారం మైసూరుకు వచ్చిన ఆయన ఈ వదంతులపై స్పందించారు. వచ్చే ఏడాది దసరా ఉత్సవానికి నేను హాజరు కాకూడదా? అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల తర్వాత నాకు రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కదని అంచనా వేశారని, నేనే సీఎం అయ్యానని వివరించారు. తర్వాత నా కారుపై కాకి వాలితే బడ్జెట్‌ ప్రవేశపెట్టలేనని జోస్యం చెప్పారని, నేనేమో రెండు బడ్జెట్‌లు సమర్పించానని గుర్తుచేశారు. ఇప్పుడూ అలాంటి వాతావరణమే తలెత్తిందన్నారు. రానున్న రెండున్నరేళ్లకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఇందులో ఎవరికీ సందేహం లేదన్నారు. నాయకత్వ మార్పు, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య ప్రకటించారు. 

Tags :
Published : 02 Oct 2025 09:53 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు