logo

అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు

ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Published : 18 May 2024 01:55 IST

2024-25లో ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 22 వరకు గడువు

ఆదర్శ కళాశాలలో ఇంటర్‌ అభ్యసిస్తున్న విద్యార్థులు

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అధునాతన తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అన్ని సౌకర్యాలతో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు, పట్టణానికి దూరంగా ఉన్న గ్రామీణ పేద బాలికలకు వసతిగృహం వంటి సౌకర్యాలతో ఇవి విద్యార్థులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.

ఒక్కో గ్రూపులో 40 సీట్లు

ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కో కళాశాలలో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున నాలుగు గ్రూపులకు 160 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. పదోతరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఆయా గ్రూపులకు, రిజర్వేషన్‌ ప్రకారం ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

దరఖాస్తు చేసుకోవడం ఇలా..

ఆదర్శ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా గానీ, మీ-సేవా కేంద్రాల్లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ధ్రువపత్రాలతో దరఖాస్తులను సమర్పించాలి.www.cse.ap.gov.in, www.apms.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసిన ఫారంతో పాటు స్టడీ సర్టిఫికెట్‌, మార్కుల మెమో, ఆధార్‌లను ఆయా కళాశాలల్లో ఇవ్వాలి.
రుసుములు ఇలా..: దరఖాస్తు రుసుము ఒసి, బిసిలకు రూ. 200లు.ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 150లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో 35 కళాశాలలు

ఆదర్శ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమసంవత్సరంలో చేరికలకు విద్యార్థుల నుంచి మార్చి 28వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధించనున్నారు. కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 19 మొత్తం 35 కళాశాలల్లో చేరికలకు ఈనెల 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

సీట్ల కేటాయింపు ఇలా..

ఆదర్శ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే విషయంలో సీట్ల కేటాయింపులో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10, బీసీలకు 29, దివ్యాంగులకు 3, బాలికలకు 33.3, ఈడబ్ల్యుఎస్‌కు 10, ఓసీలకు 37శాతం రిజర్వేషన్‌ ప్రకారం సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన వారి జాబితాలను ఆయా ఆదర్శ కళాశాలల వద్ద ప్రదర్శిస్తారు. ఎంపిక చేసిన విద్యార్థుల విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ప్రవేశాలు కల్పించే తేదీలు ప్రకటించనున్నారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి సీనియర్‌ ఇంటర్‌ తరగతులు జరగనున్నాయి.

ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

  • కర్నూలు జిల్లాలో: ఆలూరు, ఆస్పరి, సి.బెళగల్‌, గోనెగండ్ల, గూడూరు (జులేకల్లు), కల్లూరు(పెద్దపాడు), కోడుమూరు, కోసిగి, కృష్ణగిరి, మద్దికెర, మంత్రాలయం, నందవరం, ఓర్వకల్లు, పత్తికొండ, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు (కడివెల్ల) 16 ప్రాంతాల్లో ఆదర్శ కళాశాలలు ఉన్నాయి.
  • నంద్యాల జిల్లాలో: ఆళ్లగడ్డ (కోటకందుకూరు), బనగానపల్లి (రవ్వలకొండ), బండి ఆత్మకూరు, బేతంచెర్ల (గోరుమానుకొండ), డోన్‌, గడివేముల, గోస్పాడు, జూపాడు బంగ్లా, కొలిమిగుండ్ల, మహానంది (ఎం.తిమ్మాపురం), మిడుతూరు, అవుకు, పగిడ్యాల, పాములపాడు, పాణ్యం, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, వెలుగోడు ప్రాంతాల్లో ఆదర్శ కళాశాలలు ఉన్నాయి.
  • నంద్యాలలో ఆదర్శ పాఠశాలకు భవనం లేనందున ప్రస్తుతం సెరికల్చర్‌ భవనంలో నిర్వహిస్తున్నారు. ఆదర్శ పాఠశాల, కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. భవనం పూర్తైతే అందులో ఇంటర్‌ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంటుంది.

విద్యార్థులు వినియోగించుకోవాలి

ఆదర్శ పాఠశాలలు, కళాశాలల్లో ప్రైవేట్‌, కార్పొరేట్‌కు ధీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగుతుంది. అధునాతన సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధిస్తూ ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ పురోగతి వైపు నడుస్తున్నాయి. విద్యార్థులకు ప్రయోగ పూర్వకంగా బోధిస్తారు. ప్రతి కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో పరిమితంగా ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున చేరికలుంటాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

 డా.ఇస్రత్‌ బేగం, నంద్యాలఆదర్శ కళాశాలల జిల్లా కన్వీనరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని