logo

కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు

పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు.

Updated : 18 May 2024 04:49 IST

ముంపు బారిన కాలనీలు
కాల్వల్లో సిల్టు తీయని వైనం
మూడేళ్లుగా పట్టించుకోని అధికారులు

నగరంలో ఆనంద్‌ థియేటర్‌ సమీపంలో వంతెన వద్ద పరిస్థితి

పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. కాల్వల్లో పేరుకుపోయిన పూడిక (సిల్టు)ను ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో తొలగించాలి.. గత మూడేళ్లు పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ వ్యర్థాలు, పూడిక పేరుకుపోవడంతో వరద నీరు ముందుకెళ్లే పరిస్థితి లేదు.. చిన్నపాటి వర్షం వచ్చినా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.. పట్టణ ప్రజలకు కునుకులేకుండా పోయింది.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలకం, పురపాలికల్లో దాదాపు 16-18 లక్షల జనాభా జీవనం సాగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పాతిక శాతం వార్డులు ముంపు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 

న్యూస్‌టుడే, కర్నూలు కార్పొరేషన్‌, నంద్యాల, డోన్‌, ఎమ్మిగనూరు,ఆదోని పురపాలిక

మూడేళ్లుగా పూడిక తీయలేదు

డోన్‌ పట్టణంలో 32 వార్డులు ఉన్నాయి. అన్ని రకాల కాల్వలు కలిపి 117.50 కి.మీ.ల మేర విస్తరించి ఉన్నాయి. పెద్ద కాల్వలో 2020లో 10 కి.మీ.ల మేర పూడిక తీశారు. అప్పటినుంచి నేటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం, పూడిక పేరుకుపోయింది. వరద నీరు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా శ్రీరామనగర్‌, తారకరామానగర్‌, సుజాతమ్మనగర్‌ కాలనీలు ముంపుబారిన పడుతున్నాయి. పట్టణంలోని మురుగు ముందుకెళ్లేలా రూ.కోట్లు వెచ్చించి స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్స్‌ను నిర్మించారు. వాటికి అనుబంధంగా కచ్చా, సీసీ డ్రైన్లు చేపట్టారు. పలుచోట్ల ఆక్రమణకు గురికావడంతో వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది.

40 వేల మందికి నరకం

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: చిన్నపాటి వర్షానికే జిల్లా కేంద్రం నంద్యాలలోని వీధులు మడుగులను తలపిస్తున్నాయి. సంజీవనగర్‌ గేట్‌, బైటిపేట, హరిజనవాడ, ఉప్పరిపేట, ఎంహెచ్‌ఎస్‌రోడ్డు, చాంద్‌బాడా, గుడిపాటిగడ్డ, పురపాలక కార్యాలయం, పద్మావతినగర్‌, సలీంనగర్‌, శ్యాంనగర్‌, సంచిపట్టల వీధి, సరస్వతీనగర్‌, దేవనగర్‌, భైర్మల్‌వీధి ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఏటా వర్షాకాలంలో 40 వేల మంది ఇబ్బంది పడుతున్నారు. గాంధీచౌక్‌ నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు 2017లో రహదారులను విస్తరించారు. ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించారు.. ఇప్పటివరకు పూడిక తీయలేదు.. వ్యర్థాలు నిండిపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా నీరు ముంచెత్తుతోంది. పట్టణంలో 383.55 కి.మీ మేర కాల్వలు విస్తరించి ఉన్నాయి. పలుచోట్ల ఆక్రమణలకు గురికావడం.. కల్వర్టులు దెబ్బతినడంతో నీరు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో వరద రోడ్లపైకి దూసుకొస్తోంది.

మూడు వేల మందికి తిప్పలు

చేనేతపురి ఎమ్మిగనూరు పట్టణంలో పాత ఆంజనేయస్వామి ఆలయం వీధిలో 350 మీటర్ల పొడవు ఉన్న ప్రధాన కాల్వలో పూడిక పేరుకుపోయింది. వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు.. చిన్నపాటి వర్షం వచ్చినా 11వ వార్డును ముంచెత్తుతోంది. క్విబుల్లా కాలనీ, చంద్రయ్య కొట్టాలలో ఉన్న 600 మీటర్ల పెద్ద కాల్వ, చెన్నకేశవ కాలనీలో 750 మీటర్ల కాల్వలో పూడిక పేరుకుపోయింది. వర్షం వచ్చిన ప్రతిసారి మూడు వేల మంది ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నా పుర అధికారులు, పాలకవర్గం స్పందించడం లేదు.

రెండేళ్ల కిందట మమ అనిపించారు

కర్నూలు నగరంలో 52 వార్డులో ఆరు లక్షల మంది నివాసం ఉంటున్నారు..నగరంలో మురుగు వెళ్లేందుకు 1,400 కి.మీ.ల మేర కాల్వలు నిర్మించారు.. వాటిలో పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడంతో నీరంతా రోడ్లపైకి చేరుతోంది. గాంధీనగర్‌, ఐదు రోడ్ల కూడలి, ఆనంద్‌ థియేటర్‌ సమీపంలో, కిడ్స్‌ వరల్డ్‌, పాతనగరం జమ్మిచెట్టు సమీపంలో, బుధవారపేట, శ్రీరామనగర్‌, ముజఫర్‌నగర్‌, శరీన్‌నగర్‌ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పూడిక తీసేందుకు ప్రత్యేకంగా 180 మంది కార్మికులు ఉన్నారు. కాల్వల్లో పూడిక తీయడానికి రెండేళ్ల కిందట ప్రతి వార్డుకు రూ.20 వేలు కేటాయించారు. నిధులు సరిపోకపోవడంతో నామమాత్రంగా చేసి వదిలేశారు. తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు..ఫలితంగా చిన్న వర్షం పడినా రహదారులపై మురుగు ఏరులై పారుతోంది.

ముంపు బారిన 15 కాలనీలు

ఆదోని పట్టణంలో 42 వార్డులు ఉండగా రెండు లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఏటా వర్షాకాలంలో 12 నుంచి 15 కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి.. ఫలితంగా 30 వేల మంది అవస్థలు పడుతున్నారు. పట్టణంలో ప్రధాన రహదారితో పాటు సట్టాబజారు, కూరగాయల మార్కెట్‌, సర్వజన ఆసుపత్రి రహదారి, హన్సాజీపేట, గీతామార్కెట్‌ వంటి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పాతబస్తీ, బుడ్డేకల్లు వీధి, వాల్మీకినగర్‌ దిగువ ప్రాంతం, ప్రకాశ్‌నగర్‌, అరుణ్జ్యోతినగర్‌, శివశంకర్‌నగర్‌, గౌళిపేట, వడ్డెగేరి, బోయగేరి, బొబ్బులమ్మగుడి, మట్కర్‌వీధి తదితర ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయి. పట్టణం మీదుగా 12-15 కి.మీ మేర ఆవుదూడ, ఎర్రవంకలు ప్రవహిస్తున్నాయి. 190 కి.మీ మేర మురుగు కాల్వలు ఉన్నాయి. చాలాచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. పూడిక తీయడం లేదు.. దీంతో వర్షపు నీరు ముందుకు వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని