logo

పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం

ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తోంది..  ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు..  విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు.

Published : 18 May 2024 03:18 IST

కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోని ప్రభుత్వం
 రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ లేనట్లే

ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తోంది..  ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు..  విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు.. ప్రభుత్వం ఇప్పటికీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోలేదు.. రైతు భరోసా కేంద్రాల్లో ఇచ్చేందుకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు.. అన్నదాతలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.. కర్షకుల అవసరాలను పలువురు వ్యాపారంగా మల్చుకొంటున్నారు.. దీంతో ఏటా పొలాల్లో నకిలీ విత్తనాలు నాట్యం చేస్తున్నాయి... పంటను గులాబీ పురుగు తొలిచేస్తోంది... ఆశించిన దిగుబడులు రావడం లేదు...

 న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం

 రైతులపై  రూ.2.20 కోట్ల భారం

ఉమ్మడి కర్నూలులో పత్తి సాధారణ సాగు 2,69,275 హెక్టార్లుగా ఉంది.  ఉమ్మడి కర్నూలు జిల్లాకు 20 లక్షల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం.. అందులో ఒక్క కర్నూలు జిల్లా రైతులకే 16-17 లక్షల ప్యాకెట్లు కావాల్సి ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ప్యాకెట్‌ ధర రూ.11 పెరిగి రూ.864కు చేరింది. ఇందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి.. రైతులపై రూ.2.20 కోట్ల విత్తన భారం పడనుంది.  పరీక్షలు చేసిన నాణ్యమైన విత్తనాలనే రైతులకు ఇస్తామన్న ప్రభుత్వం... ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. పత్తి రైతుల్ని నకిలీ విత్తనాల వ్యాపారులకు, పురుగు మందుల సంస్థలకు అప్పగించి చోద్యం చూస్తోంది.

తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

ప్రణాళిక రూపొందించని అధికారులు

నాణ్యమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తామని వైకాపా ప్రభుత్వం గొప్పగా చాటింపేసుకుంటోంది. ఉమ్మడి జిల్లాకు ఆర్బీకేల ద్వారా వెయ్యి ప్యాకెట్లు ఇవ్వడం లేదు. ఈసారి ముందస్తుగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులకు అవసరమైన విత్తనాలపై జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేయలేదు.  విత్తన కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేదు. రైతులంతా ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిందే.. వాటిలో నాణ్యత ఎంతో అధికారులకే తెలియాలి.. నకిలీ విత్తనాల కారణంగా మూడేళ్లుగా తెల్లబంగారం ఆశించిన దిగుబడి రావడం లేదు.. పత్తి సాగు చేసిన రైతులు అప్పులు ఊబిలో చిక్కుకుంటున్నారు.

అధిక ధరలకు అంటకడుతున్నారు

ఎమ్మిగనూరు పట్టణంలో ఆదిత్య ట్రేడర్స్‌, పంచముఖి పెస్టిసైడ్స్‌ అండ్‌ సీడ్స్‌, శివ కిరణ్‌ ట్రేడర్స్‌ దుకాణాల్లో  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో వెలుగు చూసిందని విజిలెన్స్‌ సీఐ కె.సునీల్‌కుమార్‌ తెలిపారు. రూ.1.85 లక్షల జరిమానా విధించి... రూ.2.54 లక్షల విలువ చేసే విత్తనాలు స్వాధీనం చేసుకొన్నామన్నారు.

2021లో రూ.16.91 కోట్ల నష్టం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2021 ఖరీఫ్‌లో కావేరీ పత్తి విత్తన కంపెనీకి సంబంధించిన జాదు, ఏటీఎం రకాలు సాగు చేసి రైతులు నష్టపోయారు. ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విత్తన లోపంతోనే నష్టం జరిగిందని గుంటూరు లాంఫాం శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో 16 మండలాల్లో 1,899 మంది రైతులకు సంబంధించి 7,257 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు జిల్లాస్థాయి కమిటీ తేల్చింది. ఎకరాకు 3 క్వింటాళ్ల మేర నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.5,500 ఉండగా బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం (మధ్యస్త ధర) క్వింటా రూ.7,769 ప్రకారం నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఒక్కో రైతుకు 3 క్వింటాళ్లకు కలిపి రూ.23,307 పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. 1,899 మంది రైతులకు కావేరీ జాదు కంపెనీ రూ.16.91 కోట్ల పరిహారం ఇవ్వాలని అప్పటి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేస్తూ కంపెనీకి ఉత్తర్వులు పంపారు. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు.

అన్నదాత ఆవేదన వినని అధికారులు

2022 ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలో 2.75 లక్షల హెక్టార్లకు పైగా పత్తి సాగయ్యింది. రైతుల డిమాండు మేరకు విత్తనాలు ఇవ్వలేదు. నాసిరకం.. నాణ్యతా లోపం కలిగిన విత్తనాలు బయట మార్కెట్లో విక్రయించారు. పత్తి కొమ్మలు ఏపుగా పెరిగినా పూసిన పూత రాలిపోవడం, కాయలు లేకపోవడంతో.. దిగుబడులు తుడిచిపెట్టుకుపోయాయి. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఎకరాకు క్వింటా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. దీన్ని తొలగించి రబీలో శనగ పంట సాగు చేశారు. విత్తన లోపంతోనే పంట దిగుబడులు రాలేదని.. ఎకరాకు 1-2 క్వింటాళ్ల దిగుబడులు కూడా రాలేదని అన్నదాతలు మొరపెట్టుకున్నా.. వారి ఆవేదనను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. పంటల బీమాతో కొంతమేర ఆదుకున్నా.. పెద్దగా కర్షకులకు అక్కరకు రాలేదు.

గతేడాది భారీగా నష్టం

గత ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాధారణం కంటే తక్కువగా పత్తి సాగైంది. కర్నూలు జిల్లాలో పత్తి సాధారణ సాగు 2.50 లక్షల హెక్టార్లు కాగా.. 2.03 లక్షల హెక్టార్లు అంటే 80.96 శాతం మేర సాగు చేశారు. నంద్యాల జిల్లాలో 25,586 హెక్టార్ల సాధారణ సాగు కాగా.. 10,411 హెక్టార్లలో 45 శాతం మేర సాగైంది. ఉమ్మడి జిల్లాలో 60 వేల హెక్టార్లలో విత్తనమే పడలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎకరాకు 1-2 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. పెట్టుబడులు.. కూలీల ఖర్చులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. వరుసగా మూడేళ్లపాటు తెల్ల బంగారాన్ని నమ్ముకున్న రైతులకు చివరికి అప్పులే మిగిలాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని