logo

వేతనాలు రాక వెతలు

పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కష్టపడి పని చేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

Published : 21 Mar 2023 02:42 IST

చెత్త సేకరిస్తున్న పంచాయతీ కార్మికులు

న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌: పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కష్టపడి పని చేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు గ్రామాల్లో పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తున్నారు. ప్రతి నెల కార్మికులకు వేతనాలు రావడంల లేదు. కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్నామని గ్రామ పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 499 పంచాయతీలు ఉండగా దాదాపు 2500 మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఒక్కొక్క కార్మికుడికి ప్రతి నెల రూ.8500 అందిస్తోంది. కొద్ది నెలలుగా పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. కొన్ని మేజర్‌ పంచాయతీలకు ఇతరత్రా ఆదాయం వస్తోంది. మిగతాచోట్ల ఇబ్బందిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.

అధిక పనిభారం

పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెల జమ చేస్తున్న నిధుల్లో నుంచి ముందుగా వేతనాలను చెల్లించేవారు. ప్రతి నెల 5వ తేదీలోగా కార్మికుల ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం కార్యదర్శులు బిల్లులు చేసి చెక్కులు వేస్తున్నా నగదు కార్మికుల ఖాతాల్లో జమ కావడం లేదు. నిధులున్నా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మల్టీపర్పస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో కార్మికులు అన్ని రకాల పనులు చేయాల్సి వస్తోంది. సిబ్బందిపై పని భారం పెరిగింది. పెద్ద పంచాయతీల్లో నలుగురు, ఐదుగురు, చిన్నవాటిల్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. ట్రాక్టరుపై ఉదయం వేళ ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తారు. డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు.


అప్పులు చేయాల్సి వస్తోంది
- మహేశ్‌, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఈ నెల 13న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టాం. ఇంకా అందలేదు. కుటుంబ పోషణ భారమై అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఖాతాల్లో జమ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని