logo

శుభ్రత పాటించు.. సేవలు అందించు

ఇన్‌ఫెక్షన్లకు తావులేకుండా వైద్య ఉపకరణాలను శుభ్రత పాటిస్తూ సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Published : 24 Mar 2023 01:11 IST

ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు

బోదకాలు మందుల కిట్‌ను పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ

న్యూస్‌టుడే - సిద్దిపేట, నంగునూరు: ఇన్‌ఫెక్షన్లకు తావులేకుండా వైద్య ఉపకరణాలను శుభ్రత పాటిస్తూ సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స విధానంలో జరుగుతున్న ప్రసవాలకు అడ్డుకట్టవేయాలని, ఈ మేరకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ కింద దాదాపు రూ.70 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ సర్వజన, గజ్వేల్‌ జిల్లా ఆసుపత్రికి గురువారం సిద్దిపేటలో వితరణ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నంగునూరు మండలం ఘనపూర్‌లో గత నెల ఐదు ప్రసవాలు జరుగగా అందులో నాలుగు ప్రైవేటులో జరిగినట్లు దృష్టికి వచ్చిందన్నారు. మిట్టపల్లి శివారులో సురభి వైద్య కళాశాలలో ప్రసవ తేదీకి వారం రోజుల ముందుగానే శస్త్రచికిత్సతో కాన్పులు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. సర్వజన ఆసుపత్రిలో గత నెల 380 ప్రసవాలు జరిగాయని సిబ్బంది తెలుపగా సంఖ్య పెంచాలని సూచించారు.

చివరి అవకాశం : వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు జీవో నం. 58, 59ల కింద దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశమని, 2020 జూన్‌ 2వ తేదీలోగా ధ్రువపత్రాలు కలిగి ఉంటే అర్హులని మంత్రి పేర్కొన్నారు. ఆయా జీవోల కింద 600 మందికి పట్టాల పంపిణీని సిద్దిపేటలో గురువారం చేపట్టారు. సతత్‌ వికాస్‌ పురస్కార ప్రదానోత్సవంలో జక్కాపూర్‌ గ్రామం ఏడింటికి ఎంపికవగా మంత్రి అభినందించారు.

బోదకాలు బాధితులకు కిట్ల పంపిణీ : బోద వ్యాధిగ్రస్థులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూస్తోందని, ఈ తరుణంలో వారికి పింఛన్లు సైతం అందిస్తున్నట్లు మంత్రి అన్నారు. గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోద బాధితులకు కిట్ల పంపిణీ ప్రారంభించారు. జిల్లాలోని 8121 మందికి కిట్లు అందించనున్నట్లు వివరించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్‌ పరిధిలో 85 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, సిద్దిపేట గ్రామీణ మండలం మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు అసైన్‌మెంట్‌ పట్టా సర్టిఫికేట్లు, నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన 28 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. చిన్నకోడూరు మండలంలో 66 మంది భూ నిర్వాసితులకు రూ.95 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

రంజాన్‌ మాస శుభాకాంక్షలు

రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న పండుగలు, మహనీయుల జయంతి కార్యక్రమాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తూ జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేత, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి సమీక్షించారు.

విస్తరణ పనుల పరిశీలన

ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నంగునూరు మండలంలోని ముండ్రాయి, బద్దిపడగలో జరుగుతున్నాయి. మంత్రి ఆయా పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయిల్‌పామ్‌ రైతు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి, రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం, సూపరింటెండెంట్‌ కిషోర్‌కుమార్‌, ఈసీఐఎల్‌ ప్రతినిధులు, అదనపు పాలనాధికారులు శ్రీనివాస్‌రెడ్డి, ముజమ్మిల్‌ఖాన్‌, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని