logo

Kavitha: నాడు అన్నీ తానై.. నేడు పార్టీకే దూరమై

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 03 Sep 2025 06:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కవిత సస్పెన్షన్‌పై భారాస శ్రేణుల్లో చర్చ

ఈనాడు, నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లా నుంచి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత భారాస నుంచి సస్పెండ్‌ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొన్నేళ్లుగా గులాబీ శ్రేణులను తనదైన నాయకత్వ పటిమతో ఏకతాటిపై నడిపించిన ఆమె.. అటు తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల క్రతువుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కవితపై భారాస వేటు వేసింది. 

  • తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి కవిత పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో భారాస కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్‌పై పూర్తిస్థాయి పట్టు సాధించి పార్టీని ముందుకు నడిపించారు. 
  • 2019లో భారాస అభ్యర్థిగా నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కొంత కాలం పార్టీ శ్రేణులకు దూరంగా ఉన్నారు. కొన్నాళ్లకు మళ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగించారు. రాష్ట్రస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 
  • 2023లో కవితపై లిక్కర్‌ కేసు నమోదైంది. 2024 మార్చిలో జైలుకు వెళ్లారు. నాలుగు నెలల తర్వాత విడుదలయ్యారు. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల, బోధన్, నిజామాబాద్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గతంలో ‘తెలంగాణ జాగృతి’ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చురుగ్గా ఉండేవారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాన అనుచరులు, అభిమానులు డోలాయమానంలో పడ్డారు. తమ నాయకురాలితో కొనసాగుతారా? భారాసలో ఉండిపోతారా? అనేది వేచిచూడాలి. 

మెట్టినిల్లు... ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం..

మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత అత్తింటి ఊరు.. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని పొతంగల్‌. ఈ జిల్లా నుంచే ఎంపీగా గెలిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడటంతో 2020 అక్టోబరులో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కవిత పోటీచేసి గెలుపొందారు. 2021, డిసెంబరులో శాసనమండలి ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యారు. 2022, జనవరి 19న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ మే 23న బహిర్గతం అయ్యింది. ఈ తరుణంలో ఆమె పలువురు పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై జిల్లాలో భారాస నేతలు పెద్దగా స్పందించలేదు. 

Tags :
Published : 03 Sep 2025 03:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని