logo

గిరిజన కోటాలో పాగా వేసేదెవరు?

 రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు జన్మనిచ్చిన మయూర్‌భంజ్‌ గిరిజనానికి నిలయం. ఝార్ఖండ్‌ రాష్ట్ర సరిహద్దున గల ఈ లోక్‌సభ స్థానంలో ఎన్నికల వేడి ఊపందుకుంది.

Published : 27 May 2024 03:45 IST

మయూర్‌భంజ్‌లో నబచరణ్, సుదాంల పోరు

సుధాం మరాండి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు జన్మనిచ్చిన మయూర్‌భంజ్‌ గిరిజనానికి నిలయం. ఝార్ఖండ్‌ రాష్ట్ర సరిహద్దున గల ఈ లోక్‌సభ స్థానంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. తమ ఖాతాలో ఉన్న సీటు నెలబెట్టుకోవడానికి భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది. కమలాన్ని నిలువరించడానికి బిజద పావులు కదిపి జోరు కనబరుస్తోంది. గతసారి తృతీయ స్థానానికి పరిమితమైన ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) ఈసారి గౌరవం నిలుపుకోవాలన్న తపనలో ఉంది. దీంతో మయుర్‌భంజ్‌లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా ఉంది.


రాష్ట్రపతి వల్ల గుర్తింపు 

రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మయూర్‌భంజ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగింది. దీనికి ముందుగా ఈ ప్రాంతాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తి గిరిజనంలో ఉంది. ద్రౌపదీ ముర్ము ఝార్ఖండ్‌ గవర్నరుగా విధులు నిర్వహించిన సమయంలో జన్మభూమి అభివృద్ధికి చిత్తశుద్ధి కనబరిచారు. ఆమె కృషితో మారుమూల గ్రామాలకు రహదారులు, రాకపోకలకు సౌకర్యాలు సమకూరాయి. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం రైల్వే విస్తరణ, ఏకలవ్య ఆశ్రమ విద్యాలయాలు, ఇతర కార్యక్రమాలు అమలు చేసింది.


కొత్త అభ్యర్థికి భాజపా టికెట్‌

కేంద్ర గిరిజన సంక్షేమ, జలశక్తి శాఖల సహాయ మంత్రి బిశ్వేశ్వర టుడు 2019లో మయూర్‌భంజ్‌ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్‌ నిరాకరించిన ఆ పార్టీ నాయకత్వం సామాజిక కార్యకర్త, ఆరెస్సెస్‌ ప్రచారకుడు నబచరణ్‌ మాఝిని బరిలోకి దించింది. రెవెన్యూ, విపత్తుల నివారణ, విద్యాశాఖల మంత్రి సుధాం మరాండిని ముఖ్యమంత్రి నవీన్‌ బిజద అభ్యర్థి చేశారు. గతసారి పోటీ చేసి తృతీయ స్థానంలో నిలిచిన జేఎంఎం నాయకురాలు అంజని సోరెన్‌ ఈసారీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మయూర్‌భంజ్‌ సీటు కాంగ్రెస్‌ జేఎంఎంకి విడిచిపెట్టింది


ముఖాముఖి పోరు 

అంజని సోరెన్‌ 

ఇదివరకు మయూర్‌భంజ్‌లో జేఎంఎంకు ఆదరణ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ కూడా బలహీనపడింది. జేఎంఎంకు హస్తం మద్దతు ఉన్నా అంజని విజయావకాశాలు తక్కువేనని పరిశీలకులంటున్నారు. ఈ నేపథ్యంలో భాజపా, బిజద అభ్యర్థుల మధ్యే ముఖాముఖి పోరు కనిపిస్తోంది. మంత్రి సుధాం పూర్వాశ్రమంలో జేఎంఎం అగ్రనేత. 2019 ఎన్నికల ముందు బిజదలో చేరిపోయారు. ఆయనకు గిరిజనంలో పట్టుంది. భాజపా తరఫున బరిలో ఉన్న నబచరణ్‌ విషయానికొస్తే మయూర్‌భంజ్‌లో సామాజిక కార్యకర్తగా గుర్తింపు ఉంది. అన్ని తెగల ఆదివాసీలతో సంబంధాలు కలిగున్నారు.


రెండు పార్టీల ముమ్మర ప్రచారం

జూన్‌ 1న నాలుగోవిడత పోలింగ్‌ మయూర్‌భంజ్‌లో జరగనుండగా భాజపా, బిజద నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గిరిపుత్రికకు సర్వోన్నత పదవిలో కూర్చోబెట్టిన ఘన చరిత్ర భాజపాది అని, ప్రధాని మోదీ గ్యారంటీ, ఆయన పాలనలో దేశం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి పెరిగిన కేటాయింపుల గురించి కమలం పెద్దలు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ ప్రచారం చేసిన నవీన్‌ మాట్లాడుతూ ద్రౌపదీ ముర్ము తన సోదరి అని, ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే బిజద మద్దతు తెలిపిన సంగతి వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన సుధాంకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి గిరిజనుల గౌరవం పెంచినట్లు చెప్పారు. భాజపా, బిజద పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయానికి కట్టుబడిన జేఎంఎంను విస్మరించరాదని, ఈ ప్రాంత బిడ్డగా తనను ఆదరించాలని అంజని ఓటర్లకు వినతులు చేస్తున్నారు. మయూర్‌భంజ్‌ లోక్‌సభ పరిధిలో జోషిపూర్, సరసరొణ, రాయ్‌రంగపూర్, బంగిరిపోషి, ఉదలా, బరిపద, మొరడ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ నియోజకవర్గాల్లో 12 తెగల ఆదివాసీలున్నారు. ఈసారి ఏ పార్టీకి ఆదరిస్తారన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. భాజపా, బిజద నాయకత్వాలు ఈ సీటు తమదేనని చెప్పుకుంటున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని