logo

ఓటుకు ఊపిరిలూదిన ఊళ్లు.. 748 కేంద్రాల్లో 91 శాతానికి పైగా నమోదు

సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లింది. తమ హక్కు వినియోగంలో ఓటర్లు ఎనలేని చైతన్యం చాటారు. ఫలితంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 87.12 శాతం పోలింగ్‌ శాతం నమోదయ్యేలా చేశారు.

Updated : 22 May 2024 07:02 IST

ప్రజాస్వామ్య స్ఫూర్తిని గెలిపించిన గ్రామీణులు
సింగరబొట్లపాలెంలో అందరూ జైకొట్టారు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లింది. తమ హక్కు వినియోగంలో ఓటర్లు ఎనలేని చైతన్యం చాటారు. ఫలితంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 87.12 శాతం పోలింగ్‌ శాతం నమోదయ్యేలా చేశారు. ఒంగోలు పార్లమెంట్, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మనదే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పునకు గీటురాయి అయిన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. గంటల సమయం వరుసల్లో నిల్చుని., కొన్నిచోట్ల రాత్రి 12 గంటల వరకూ వేచి ఉండి మరీ హక్కు వినియోగించుకున్నారు. ఓటేసి తీరాలన్న తపన పట్టణ వాసుల కంటే గ్రామీణుల్లోనే ఎక్కువగా కనిపించింది. జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో నాలుగోవంతు కేంద్రాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ, విదేశాల్లో ఉంటున్న జిల్లా వాసులు కూడా ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. 1.3 శాతం మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌నూ వినియోగించుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగిన సాధారణ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్‌ కావడం గమనార్హం. 

అత్యల్పమే 59.17 శాతం..

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,183 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలోని 748 కేంద్రాల్లో(91 శాతానికి పైగా); 1,112 కేంద్రాల్లో(81-90 శాతం); 288 కేంద్రాల్లో (70-80 శాతం); 34 కేంద్రాల్లో (61-70 శాతం) పోలింగ్‌ నమోదైంది. కొండపి నియోజకవర్గ పరిధిలోని పొన్నలూరు మండలం సింగరబొట్లపాలెంలో ఏకంగా వంద శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో ఇదే అత్యధికం. అదే నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలం పాకలలోని పోలింగ్‌ కేంద్రం నం.271లో మొత్తం 1,178 మంది ఓటర్లు ఉండగా, అందులో 697 మంది(59.17 శాతం) మాత్రమే ఓటేశారు. జిల్లాలో ఇదే తక్కువ పోలింగ్‌ శాతంగా నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కనిగిరి నగర పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రం నం.135లో 786 మంది ఓటర్లకుగాను 480 మంది తమ హక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని