మానవాద్భుతం

మహాద్భుతమే జరిగింది. ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో 17 రోజుల పాటు చిక్కుకుపోయిన 41 మంది కార్మికులూ మృత్యుంజయులై క్షేమంగా బయటపడటంతో- యావత్‌ జాతీ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. చార్‌ధామ్‌ రహదారి నిర్మాణ పనుల్లో తలమునకలై ఉన్న ఆ శ్రామికులందరిపైనా దీపావళి నాటి తెల్లవారుఝామున చీకట్లు దట్టంగా ముసిరేశాయి.

Updated : 30 Nov 2023 05:39 IST

మహాద్భుతమే జరిగింది. ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో 17 రోజుల పాటు చిక్కుకుపోయిన 41 మంది కార్మికులూ మృత్యుంజయులై క్షేమంగా బయటపడటంతో- యావత్‌ జాతీ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. చార్‌ధామ్‌ రహదారి నిర్మాణ పనుల్లో తలమునకలై ఉన్న ఆ శ్రామికులందరిపైనా దీపావళి నాటి తెల్లవారుఝామున చీకట్లు దట్టంగా ముసిరేశాయి. వారిని కాపాడటమెలాగో దిక్కుతోచని స్థితిలో స్టీల్‌ పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్‌ పంపడం బాధిత కుటుంబీకుల్లో ఆశలు రేకెత్తించింది. అత్యాధునిక డ్రిల్లింగ్‌ యంత్రాల తరలింపు నిమిత్తం భారత వాయుసేన రంగంలోకి దిగింది. ప్రమాదం సంభవించి రెండు వారాలు గడిచినా ఏ ప్రయత్నమూ కలిసి రాలేదు. కూలిన సొరంగ ప్రాంతంపైన కొండ మీదకు చేరుకోవడానికి కొత్త మార్గాన్ని, సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) యుద్ధ ప్రాతిపదికన ఒక్కరోజులోనే సిద్ధం చేసింది. పరిష్కారం కనుచూపు మేరలో ఉందనిపించి చివరి క్షణాల్లో అవాంతరాలు తలెత్తడం- పరిసర ప్రాంతాల్లోనే కాదు... దేశమంతటా తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగాలను రేకెత్తించింది. తవ్వకాల కోసం రప్పించిన ఆగర్‌ యంత్రం మరమ్మతులకూ పనికిరాకుండా ధ్వంసమైంది. శిథిలాల్లో ఇరుక్కుపోయిన ఆ యంత్రం బ్లేడ్లను కత్తిరించడానికి హైదరాబాద్‌ నుంచి ప్లాస్మా కట్టర్‌ను తరలించారు. కడకు కొండ పైభాగం నుంచి నిలువునా డ్రిల్లింగ్‌ చేపట్టారు. ఆ క్రమంలో మరే ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్న నిపుణులకు ఆఖరి ఘట్టంలో గడ్డు సవాలు ఎదురైంది. 25 టన్నుల బరువు తూగే అధునాతన విదేశీ యంత్రాలు విఫలమైన చోట బొగ్గు తవ్వకాల్లో ఆరితేరిన ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ కార్మికులను ప్రవేశపెట్టడం గొప్ప ఫలితాన్ని అందించింది. అత్యంత ప్రమాదభరితమైన ఆ పద్ధతిని 2014లో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నిషేధించింది. చేతులు, చిన్న పనిముట్లతో తవ్వుతూ సొరంగ మార్గంలో చివరి అడ్డంకిని ఛేదించిన ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ కార్మికుల పనితనం- సిల్‌క్యారా ఉదంతాన్ని సుఖాంతం చేసింది!

దాదాపు అయిదేళ్ల క్రితం మేఘాలయలోని తూర్పు జైంటియా పర్వత ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ 15 మంది కార్మికుల్ని పెను ప్రమాదంలోకి నెట్టేసింది. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న జలరాశి వారందరినీ మృత్యుపరిష్వంగంలోకి ఈడ్చుకుపోయింది. ఆ మరుసటి ఏడాది ఉత్తర కాశీ సొరంగం కూలిన ఘటనలో కార్మికులు క్షేమంగా తప్పించుకున్నారు. తాజా ప్రమాదం చోటుచేసుకున్నది సరిగ్గా అక్కడే. ఉత్తరాఖండ్‌లోనే 2021 ఫిబ్రవరిలో తపోవన్‌- విష్ణుగఢ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగం 100 మందికి పైగా శ్రమజీవుల బతుకుల్ని జలసమాధి చేసేసింది. అటువంటి ఘోర విషాదం ఈసారి పునరావృతం కాకుండా కాచుకోవడంలో భిన్న విభాగాలు, యంత్రాంగాల విశేష కృషి ఎంతగానో ప్రశంసనీయం. జాతీయ విపత్తు నిభాయక దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), చమురు సహజ వాయు సంస్థ (ఓఎన్‌జీసీ), రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ, సట్లెజ్‌ జల విద్యుత్‌ నిగమ్‌ ప్రభృత సంస్థల్ని ప్రధానమంత్రి కార్యాలయం ఉరకలెత్తించింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ సారథ్యంలో స్థానిక అధికార యంత్రాంగం మానవీయంగా స్పందించి సహాయచర్యల్ని చురుగ్గా పట్టాలకు ఎక్కించింది. విదేశీ నిపుణులూ భాగస్వాములయ్యారు. ఇది అక్షరాలా బృహత్‌ యజ్ఞం. అందరొక్కటై సాగించిన మహాకృషి! సిల్‌క్యారా సొరంగ ప్రమాదం దరిమిలా దేశంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 29 సొరంగాలకు సంబంధించి ‘సేఫ్టీ ఆడిట్‌’ చేయించనున్నట్లు జాతీయ రహదారి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇటీవల ప్రకటించింది. అది ఒక్కటే సరిపోదు. ముఖ్యంగా ‘చార్‌ధామ్‌ మహామార్గ్‌ పరియోజన’తో ముడివడిన పర్యావరణ అంశాలపై పునస్సమీక్షకు కేంద్రం గట్టి పూనిక వహించాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.