రేవంత్‌ నాయకత్వ పటిమ

‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అనుకుంటూ తెలంగాణ నలుమూలల నుంచి  నిన్న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటెత్తారు. వారి కేరింతల నడుమ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పాలనా పగ్గాలు స్వీకరించారు.

Updated : 08 Dec 2023 09:44 IST

‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అనుకుంటూ తెలంగాణ నలుమూలల నుంచి  నిన్న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటెత్తారు. వారి కేరింతల నడుమ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పాలనా పగ్గాలు స్వీకరించారు. స్వపక్ష అతిరథ మహారథుల సమక్షంలో మరో పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 54ఏళ్ల వయసులోనే సీఎంగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి- ఫైర్‌బ్రాండ్‌ రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన- విద్యార్థి రాజకీయాలతో నాయకత్వ పటిమను అలవరచుకొన్నారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ పాలకమండలి సభ్యుడిగా ప్రజాజీవితంలో మొదటి అడుగు వేశారు. ఆపై క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి స్వయంకృషితో అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా రేవంత్‌ ఎప్పుడు ఎక్కడ ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించినా- దూసుకుపోయే తత్వంతో, వాగ్ధాటితో అశేష అభిమానులకు ఆప్తులయ్యారు.

2021లో ఆయన పీసీసీ అధ్యక్షుడు అయ్యేనాటికి తెలంగాణలో కాంగ్రెస్‌ కొనూపిరితో కొట్టుమిట్టాడుతోంది. 2018 ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు అప్పటికే ‘కారు’ ఎక్కేశారు. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతులెత్తేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎలెక్షన్లలోనూ పరాభావం పాలైంది. వరస ఎదురుదెబ్బలతో నీరసించిన కార్యకర్తల్లో మళ్ళీ ఉత్సాహం నింపి భారాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ప్రజల ముందుకు తీసుకురావడంలో రేవంత్‌ విజయవంతమయ్యారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఓడి డీలాపడిన కాంగ్రెస్‌కు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి కొత్త ఊపిరి పోశారు.  కర్ణాటక తరవాత మరో పెద్ద రాష్ట్రంలో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి జాతీయస్థాయిలో దాని గౌరవాన్ని కాపాడారు. ప్రజలకోసం ప్రజల చేత ఎన్నికైన తాము నిజమైన ప్రజాప్రభుత్వ పంథాను అనుసరిస్తామని ఆయన నిన్న పునరుద్ఘాటించారు. ఆ మేరకు జనహిత ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పాలన విరాజిల్లాలని యావత్‌ తెలంగాణ ఆశిస్తోందిప్పుడు! 

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఖ్యాతి వహించినా- 2014, 18 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించలేదు. గడచిన నాలుగు దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ ఏనాడూ ఆరుపదుల సంఖ్యలో శాసనసభ స్థానాలను గెలుచుకోలేదు. మార్పును ఆశిస్తూ ఈసారి ఓటేసిన తెలంగాణ- కాంగ్రెస్‌కు అధికార కిరీటాన్ని అలంకరించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ వ్యవహారధోరణి, పాలనాలోపాలే హస్తం పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2018లో 99 స్థానాల్లో పోటీచేసి 28.43శాతం ఓట్లు చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ కేవలం 19 సీట్లనే గెలుచుకోగలిగింది. తాజా ఎన్నికల్లో 39.40శాతం ఓటర్ల మద్దతుతో అది 64 స్థానాల్లో జెండా పాతగలిగింది. 37.35శాతం ఓట్లు సాధించిన భారాస- తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తన ఉనికిని గట్టిగా నిలుపుకొంది. గతంతో పోలిస్తే భాజపా బాగా పుంజుకొని దాదాపు 14శాతం ఓట్లను ఒడిసిపట్టింది. అన్నివిధాలుగా శక్తిసంపన్నమైన ఈ రెండు పార్టీలను ఢీకొంటూ సుస్థిర పాలన సాగించడం- రేవంత్‌ రెడ్డికి నల్లేరు మీద నడకైతే కాబోదు. కాంగ్రెస్‌ సర్కారు ఏడాదిలోపే కుప్పకూలిపోతుందంటూ కడియం శ్రీహరి, రాజాసింగ్‌ వంటి భారాస, భాజపా నేతలు ఇప్పటికే జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్‌కు వచ్చింది బొటాబొటి మెజార్టీయేనని, ఆ పార్టీకి  ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడం ఒకఎత్తు- స్వపక్షంలో చీలికలను నివారించడం రేవంత్‌ ముందున్న మరో సవాలు. వర్గాల వారీగా బహిరంగ బలప్రదర్శనలకు దిగడం కాంగ్రెస్‌ నాయకుల సహజ లక్షణం. వారిని ఏకతాటిపై నడుపుతూ పాలనా రథాన్ని పరుగులు తీయించడం, తాజా ఫలితాలను రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం చేయడం- రేవంత్‌కు పెద్దపరీక్షే. రాజకీయ సంక్షోభాలు తలెత్తకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎన్నికల హామీలను ఆయన సర్కారు తూ.చ.తప్పక నెరవేర్చాలి. అభివృద్ధి, సంక్షేమాలలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామంటూ తెలంగాణ సమాజానికిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.