భూతాపం పెరిగితే... అధోగతే!

భూతాప నియంత్రణ లక్ష్య సాధన నీరోడుతోందని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస కమిటీ ఐపీసీసీ నిరుడీ రోజుల్లో ప్రపంచ దేశాల్ని హెచ్చరించింది.

Updated : 12 Feb 2024 05:03 IST

భూతాప నియంత్రణ లక్ష్య సాధన నీరోడుతోందని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస కమిటీ ఐపీసీసీ నిరుడీ రోజుల్లో ప్రపంచ దేశాల్ని హెచ్చరించింది. పారిస్‌ ఒడంబడిక అనుసారం- పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే ఈ శతాబ్ది చివరికి భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం సాధ్యం కాకపోవచ్చుననీ అప్పట్లో ఆందోళన వ్యక్తపరచింది. దురదృష్టవశాత్తు, ఇప్పుడు అక్షరాలా అదే జరిగింది. నిరుడు ఫిబ్రవరి లగాయతు ప్రస్తుత సంవత్సరం జనవరి వరకు భూ ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.52 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డు కావడం హడలెత్తించే పరిణామం. ఇది మరింత జోరెత్తనుందన్న అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. కర్బన ఉద్గార కట్టడి ప్రణాళికలు చతికిలపడితే 2100 సంవత్సరం నాటికి భూతాపంలో వృద్ధి 2.7 డిగ్రీలకు చేరుతుందని సీఏటీ (క్లైమేట్‌ యాక్షన్‌ ట్రాకర్‌) రెండేళ్ల క్రితమే మదింపు వేసింది. భూతాపం పట్టపగ్గాలు లేని రీతిలో హెచ్చుతూ పోతే తీవ్ర అనర్థాలు వాటిల్లి మానవాళి తల్లడిల్లక తప్పదు. రుతువులు గతితప్పి అతివృష్టి అనావృష్టి మరింతగా పెచ్చరిల్లే పెనుముప్పు మానవజాతి నెత్తిన కత్తిలా వేలాడుతోంది. భూతాపంలో పెరుగుదలను సమర్థంగా నిరోధించలేకపోతే- వివిధ పంట దిగుబడులు తెగ్గోసుకుపోతాయని, అరటి కాఫీ వేరుశనగ ఆలుగడ్డల వంటి రకాలెన్నో కనుమరుగవుతాయని, భావితరాల జీవన స్థితిగతులు దారుణ దుష్ప్రభావాలకు లోనవుతాయని... గతంలోనే పలు అధ్యయనాలు భీతావహ భవిష్యత్‌ చిత్రాన్ని ఆవిష్కరించాయి. లోగడ బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ చెప్పినట్లు, అంతకంతకు రుజాగ్రస్తమవుతున్న భూమండలాన్ని పరిరక్షించుకోవడానికి ఉమ్మడి కార్యాచరణే ప్రాణాధారం. పారిస్‌ ఒప్పందం యథాతథంగా అమలుకు నోచుకుని భూమాతకు జ్వరం తగ్గించాలన్న సుదృఢ సంకల్పంతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందడుగు వేయాలి!

భూతాపం పెరిగి దేశదేశాల్లో ప్రాణాంతక ఉత్పాతాలు సంభవించడాన్ని ప్రస్తావిస్తూ- ‘మా తరాన్ని మీరు ఏం చేయబోతున్నారు?’ అని నాలుగేళ్ల క్రితం దావోస్‌ సదస్సు సందర్భంగా యువ పర్యావరణవేత్త గ్రెటా థున్‌బర్గ్‌ ప్రపంచ నేతల్ని సూటిగా నిగ్గదీసింది. పర్యావరణం ఛిద్రం కాకుండా ఏ దేశానికాదేశం విడివిడిగా అడ్డుకోలేవు. అంతర్జాతీయ వేదికలపై తరచూ పర్యావరణ శపథాలను వల్లెవేసే సంపన్న దేశాలు కర్బన ఉద్గారాల కట్టడి లక్ష్యాల సాధనకు ఇకనైనా కదిలి రావాలి. తమవంతుగా- ప్రభుత్వాల్లో చురుకు పుట్టించే బాధ్యతను జాగృత జనబాహుళ్యమే అందిపుచ్చుకోవాలి. 2030 నాటికి దేశీయంగా అవసరమైన విద్యుత్తులో సగందాకా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకుంటామన్న భారత్‌ 2070 నాటికి నెట్‌ జీరో (కర్బన ఉద్గార తటస్థత) సాధిస్తామని ప్రకటించింది. ఆ క్రమంలో దాదాపు 37 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు విక్రయించిన ఇండియాలో ఏటా 3.9 కోట్ల టన్నుల మేర బొగ్గుపులుసు వాయువు విడుదలను అడ్డుకుంటున్నట్లు ప్రధాని మోదీ నిరుడు వెల్లడించారు. రోడ్ల వెంబడి, జల ప్రవాహ మార్గాల పక్కన గ్రీన్‌ కారిడార్లు నెలకొల్పి, ప్రజా రవాణా కోసం విద్యుత్‌ బస్సుల వినియోగం పెంపొందించిన కొలంబియాలోని మెడలిన్‌లో నాలుగు డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు తగ్గాయి. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో విత్తన తయారీ క్షేత్రం- రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వదిలిపెట్టి అక్కడ పెంచే ఆవుల నుంచే సేంద్రియ ఎరువులు తయారు చేసి వినియోగించడం ద్వారా ‘కర్బన తటస్థీకరణ’ సాధించింది. వ్యక్తి స్థాయిలో మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ రహిత సమాజావిష్కరణకు గట్టి ప్రయత్నం, వీలైనంత వరకు నడక సైక్లింగ్‌ ద్వారా ఇంధనం ఆదావంటివి ఊపందుకుంటే- పర్యావరణ పరిరక్షణ కృషి వేగవంతమవుతుంది. ‘ఈ భూమి గాలి నీరు మనకు తాత ముత్తాతల వారసత్వంగా దక్కలేదు... వాటిని కనీసం అలాగే రేపటి తరానికి అప్పగించా’లన్న జాతిపిత మహితోక్తికి సరైన మన్నన దక్కేలా వ్యక్తి స్థాయిలోను, వ్యవస్థాగతంగాను దిద్దుబాటు చర్యలు సాకారమైతేనే- భావితరాలు తెరిపిన పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.