కూర్చున్న కొమ్మ నరుక్కుందామా?

‘పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు’ అంటూ పౌరుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రకటనలు గుప్పించే ప్రభుత్వాలు దేశీయంగా అటవీ ఆచ్ఛాదన కోసుకుపోకుండా తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయా అన్న మౌలిక ప్రశ్న తలెత్తుతోంది. 1950 తరవాత దేశవ్యాప్తంగా 50 లక్షల హెక్టార్లకు పైగా అటవీ భూములు ఇతరేతర ప్రయోజనాలకు మళ్ళిపోయాయని, గత అయిదేళ్లలోనే రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని అడవులకూ అదే గతి పట్టిందని నివేదికలు ఘోషిస్తున్నాయి.

Updated : 29 Feb 2024 05:20 IST

‘పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు’ అంటూ పౌరుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రకటనలు గుప్పించే ప్రభుత్వాలు దేశీయంగా అటవీ ఆచ్ఛాదన కోసుకుపోకుండా తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయా అన్న మౌలిక ప్రశ్న తలెత్తుతోంది. 1950 తరవాత దేశవ్యాప్తంగా 50 లక్షల హెక్టార్లకు పైగా అటవీ భూములు ఇతరేతర ప్రయోజనాలకు మళ్ళిపోయాయని, గత అయిదేళ్లలోనే రెండు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని అడవులకూ అదే గతి పట్టిందని నివేదికలు ఘోషిస్తున్నాయి. మానవాళి వర్తమానాన్ని సంక్షుభితం, భవిష్యత్తును సందేహాస్పదం చేస్తున్న వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని సమర్థంగా కాచుకోవాలంటే అడవుల పెంపకానికి నిష్ఠగా కట్టుబడాలన్న సంగతి తెలిసిందే. పారిస్‌ ఒప్పందానుసారం 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్‌ జీరో ఎమిషన్‌) సాధించాలన్న లక్ష్య సాధనలో భాగంగా అంటూ నిరుడు అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం ‘గ్రీన్‌ క్రెడిట్‌ ప్రోగ్రాం’ రూపొందించింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, గాలి నీటి నాణ్యత పెంపు, జీవవైవిధ్యం మెరుగుదల వంటి సానుకూల పరిణామాల సాధనకు వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకంటూ కేంద్రం తాజాగా జారీ చేసిన నిబంధనావళితో అడవుల విధ్వంసం పెరుగుతుందేమోనని పర్యావరణవేత్తలు భయపడుతున్నారు. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని క్షీణించిన అడవుల్లో కనీసం అయిదు హెక్టార్లకు తక్కువ కాని ప్రాంతంలో మొక్కల పెంపకాన్ని చేపట్టే సంస్థలకు పెరిగిన ప్రతి చెట్టుకు ఒక గ్రీన్‌ క్రెడిట్‌ చొప్పున అందించాలన్నది కొత్త నిబంధనల సారాంశం. హెక్టారుకు 1100 చెట్ల సాంద్రతను షరతుగా నిర్దేశించిన కేంద్రం- అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్ళించిన సందర్భంలో అందుకు పరిహారంగా పెంచాల్సిన అడవికి బదులు ఈ గ్రీన్‌ క్రెడిట్‌ను మార్పిడి చేసుకోవచ్చునని చెబుతోంది. 1980 నాటి అటవీ పరిరక్షణ చట్టం కేంద్రం అనుమతి లేకుండా అటవీ భూముల్ని ఇతరేతర అవసరాలకు మళ్ళించరాదని స్పష్టీకరిస్తోంది. ఇప్పుడు కేంద్రమే కొత్త వెసులుబాట్లకు బాటలు పరవడం అటవీ పరిరక్షణ స్ఫూర్తికే గొడ్డలిపెట్టు అవుతుందన్న ఆందోళన అర్థవంతమైనది!

అయిదేళ్ల నాటి నివేదిక ప్రకారం ఇండియాలో 7.67 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయని కేంద్రం రాజ్యసభాముఖంగా వెల్లడించింది. లోగుట్టు ఏమిటంటే చీమలు దూరని చిట్టడవులు, కాకులు దూరని కారడవుల విస్తీర్ణం ఏటికేడు కోసుకుపోతుంటే, వృక్షాల సాంద్రత 10-40 శాతానికి పరిమితమైన ఓపెన్‌ ఫారెస్ట్‌ పరిమాణమే విస్తరిస్తోంది. కొత్తగా పెంచే మొక్కల కంటే, సహజ అరణ్యాలకే కర్బన ఉద్గారాల్ని శోషించుకొనే సామర్థ్యం 40 రెట్లు అధికంగా ఉంటుందని రుజువైన నేపథ్యంలో అడవుల పరిరక్షణకు శ్రద్ధగా నిబద్ధం కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నిరుడు తెచ్చిన సవరణ చట్టం మరింతగా వివాదాస్పదమైంది. జాతీయ భద్రతా ప్రాజెక్టుల కోసమంటూ అంతర్జాతీయ సరిహద్దులకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న వాటితో పాటు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో నిర్దేశిత విస్తీర్ణంలోని అటవీ భూములకూ మినహాయింపులు అనుగ్రహిస్తున్న చట్టంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కొత్త సవరణ చట్టం ‘అడవి’ని నిక్కచ్చిగా నిర్దేశించేలోగా ఆ పదానికి నిఘంటు అర్థమే కొనసాగుతుందంటూ న్యాయపాలిక ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు తాత్కాలిక ఉపశమనమే! మానవాళి మనుగడకే పెను ముప్పుగా దాపురించిన వాతావరణ మార్పు దుష్ప్రభావాలను కాచుకొనే రక్షాకవచం కాగల అడవుల్ని హరించడం- కూర్చున్న కొమ్మను నరుక్కొనే మూర్ఖత్వమే! దేశ విస్తీర్ణంలో మూడోవంతు అటవీ ఆచ్ఛాదన ప్రాణావసరం కాగా, ఇప్పుడు పట్టుమని నాలుగోవంతైనా లేదు. భూటాన్‌ 71శాతం, దక్షిణ కొరియా 64శాతం, కోస్టారికా, టాంజానియా 52శాతం అడవులతో అలరారుతున్నాయి. ప్రకృతి ప్రకోపంలో భావితరాల బతుకులు అలమటించ కూడదంటే, పుడమి తల్లికి శ్వాసకోశాలైన హరితారణ్యాల పరిరక్షణకు ప్రభుత్వాలు, పౌరులు ఉమ్మడిగా ప్రతినబూనాల్సిన సమయమిది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.