నదులకు ప్రాణప్రతిష్ఠ

స్వచ్ఛమైన నదీనదాలు, చైతన్య స్రవంతుల్లాంటి జలప్రవాహాలు... ఏ జాతికైనా జీవన సౌభాగ్య ప్రదాతలు. దేశీయంగా నదీమతల్లుల స్థితిగతులు వేరు. అడ్డూఆపూ లేని మురుగు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా దేశంలోని చిన్నా పెద్దా నదులెన్నో ఎంతగా విషకలుషితమవుతున్నాయో సాక్షాత్తు ‘కాగ్‌’ నివేదికే గతంలో వెల్లడించింది.

Published : 02 Mar 2024 00:17 IST

స్వచ్ఛమైన నదీనదాలు, చైతన్య స్రవంతుల్లాంటి జలప్రవాహాలు... ఏ జాతికైనా జీవన సౌభాగ్య ప్రదాతలు. దేశీయంగా నదీమతల్లుల స్థితిగతులు వేరు. అడ్డూఆపూ లేని మురుగు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా దేశంలోని చిన్నా పెద్దా నదులెన్నో ఎంతగా విషకలుషితమవుతున్నాయో సాక్షాత్తు ‘కాగ్‌’ నివేదికే గతంలో వెల్లడించింది. అధ్యయనాలెన్ని హెచ్చరించినా దేశం నలుమూలలా నదుల విధ్వంసం యథేచ్ఛగా పెచ్చరిల్లుతోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆమధ్య కాన్పుర్‌ ఐఐటీ సారథ్యాన ఏడు విద్యాసంస్థలు గంగానదీ పరీవాహక నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అందించాయి. అది సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో విస్తృత కార్యాచరణపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. కృష్ణా, గోదావరి, కావేరి, మహానది, పెరియార్‌, నర్మదా నదుల పరీవాహక ప్రాంతాల్లో కాలుష్య కట్టడిని లక్షించి దేశంలోని పన్నెండు ప్రఖ్యాత అత్యున్నత విద్యాసంస్థలతో తాజాగా అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వరదాయినులుగా ప్రతీతి చెందిన కృష్ణా, గోదావరి నదుల్లో జలనాణ్యత పోనుపోను తీసికట్టు అవుతోందని పలు అధ్యయనాలు ధ్రువీకరిస్తున్న తరుణంలో- ఆ రెంటితోపాటు ఇంకో నాలుగు నదులకు కాయకల్ప చికిత్స చేపట్టాలన్న నిర్ణయం స్వాగతించదగింది. ఈ ప్రశంసార్హ చొరవ- నిర్దిష్ట చర్యల అమలులో ప్రజాభాగస్వామ్యం జతపడితే మరింత అర్థవంతమవుతుంది. స్థానికులతోపాటు పాలన యంత్రాంగం కనబరచిన చురుకుదనం తమిళనాడు నీలగిరి కొండల్లో కూనూర్‌ నదికి, మేఘాలయలో లూఖానదికి కొత్త ఊపిరులూదింది. ఇంగ్లాండ్‌లోని థేమ్స్‌, మెక్సికోలోని లా ఫియెదాద్‌ వంటి నదులు మృతప్రాయ దశ నుంచి పునరుద్ధరణకు నోచుకున్న ఘట్టాలు గొప్ప స్ఫూర్తికళికలు. ఇటలీ, ఇండొనేసియా, అర్జెంటీనాల్లో కొన్ని నదులకు శుద్ధిచేయని వ్యర్థాలే పెనుశాపాలయ్యాయి. దేశదేశాల అనుభవాల నుంచి విలువైన గుణపాఠాలు స్వీకరించి కార్యాచరణ ప్రణాళికను సత్వరం పట్టాలకు ఎక్కిస్తేనే నదులు తెరిపిన పడతాయి.

దేశవ్యాప్తంగా సగానికి పైగా నదులు కలుషితాలతో ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితికి మూలకారణాలేమిటో బహిరంగ రహస్యం. పారిశ్రామిక వ్యర్థాలను, విషరసాయనాలను బరితెగించి జలవనరుల్లో దిమ్మరిస్తున్న పర్యవసానంగా రోగాలు ప్రబలి మరణాలు సంభవిస్తున్నాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సూటిగా తప్పుపట్టింది. ఆ పెడపోకడల కట్టడి తక్షణావసరమని సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. పట్టణ ప్రాంతాలకు చెందిన మురుగునీటిలో మూడొంతుల దాకా నేరుగా సరస్సులు, నదుల్లో కలుస్తున్నట్లు ‘నీతిఆయోగ్‌’ నిర్ధారించిన తరవాతా- రాష్ట్రస్థాయి కాలుష్య నియంత్రణ మండళ్లు (పీసీబీలు), కేంద్ర కాలుష్య మండలి (సీపీసీబీ) మొద్దునిద్ర వీడనేలేదు. అధికారిక గణాంకాల ప్రకారమే దేశంలోని 323 నదులకు చెందిన 351 ప్రవాహ ప్రాంతాలు కాలుష్యభూతం కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, మంజీర, శబరి, మానేరు, మూసీ తదితర నదుల్లో నీటినాణ్యత ప్రమాణాలు అడుగంటాయని ధ్రువీకరించిన సీపీసీబీకి బాధ్యులపై చర్యల కొరడా ఝళిపించడానికి చేతులు చచ్చుబడిపోయాయి. ఘగ్గర్‌ (హరియాణా-పంజాబ్‌), హిండన్‌(యూపీ), భద్ర, సబర్మతి(గుజరాత్‌), మీఠీ(మహారాష్ట్ర), వసిష్ఠ(తమిళనాడు) ప్రభృత నదులదీ అదే దీనావస్థ. భారీయెత్తున పశు కళేబరాలు, క్రిమి సంహారిణులు, కాలీకాలని మృతదేహాలు వంటివన్నీ వచ్చి చేరుతుండటంతో నదుల జీవలక్షణం కొల్లబోతోంది. నదీతీరాల వెంబడి గుట్టలకొద్దీ చేపలు చచ్చిపడిన దృశ్యాలు, మనుషులు తాగడానికే కాదు... స్నానం చేయడానికీ పనికిరానంతగా విష మాలిన్యాలు పేరుకుపోతున్నాయంటున్న విశ్లేషణలు- జీవనదుల మరణయాతనకు అద్దంపడుతున్నాయి. అందుకు బాధ్యులను గుర్తించి కఠిన శిక్షలు అమలుపరచాలి. మానవ నాగరికతకు జీవం పోసిన జలసిరుల్ని భద్రంగా పరిరక్షించుకునే సంస్కృతి జనసామాన్యంలోనూ వేళ్లూనుకుంటేనే... నదులు తేటనీటి ప్రవాహాలకు నెలవులవుతాయి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.